లైంగిక వేధింపుల కేసులో నేషనల్ అవార్డు డైరక్టర్ అరెస్టు
x

లైంగిక వేధింపుల కేసులో నేషనల్ అవార్డు డైరక్టర్ అరెస్టు

యువ నటి ఫిర్యాదుతో కటకటాల్లోకి


మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న లైంగిక వేధింపుల పర్వం మరో కీలక మలుపు తిరిగింది. ఒకప్పుడు తన అద్భుతమైన సినిమాలతో అవార్డులు కొల్లగొట్టిన ఆ స్టార్ దర్శకుడు.. ఇప్పుడు పోలీసుల ఎదుట నిలబడాల్సి వచ్చింది. షూటింగ్ సెట్ అని కూడా చూడకుండా ఒక యువ నటి పట్ల ఆయన ప్రవర్తించిన తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఆ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి ఆయన్ను తాజాగా అరెస్టు చేశారు.

ఎవరీ రంజిత్ బాలక్రిష్ణన్? ఎందుకింత రచ్చ?

మలయాళ ఇండస్ట్రీలో రంజిత్ బాలక్రిష్ణన్ అంటే ఒక బ్రాండ్. దర్శకుడిగా, స్క్రిప్ట్ రైటర్‌గా, నిర్మాతగా ఆయనకు తిరుగులేని ఇమేజ్ ఉంది. 'రావణప్రభు' లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించడమే కాకుండా, మన తెలుగు 'భీమ్లా నాయక్' ఒరిజినల్ వెర్షన్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'లో పృథ్వీరాజ్ తండ్రిగా నటించి మెప్పించారు. సముద్రఖని చేసిన ఆ పవర్‌ఫుల్ పాత్రను మలయాళంలో రంజిత్ అద్భుతంగా పండించారు. ఇంతటి గుర్తింపు ఉన్న వ్యక్తి ఇప్పుడు జైలుకు వెళ్లడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

సెట్‌లో ఏం జరిగింది? ఉచ్చు ఎలా బిగిసింది?

ప్రస్తుతం రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న ఒక మహిళా నటి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు మొదలైంది. జనవరి 28న ఫోర్ట్ కొచ్చిలోని షూటింగ్ లొకేషన్‌లో ఈ ఘటన జరిగినట్లు ఆమె ఆరోపించారు. దర్శకుడు తన అనుమతి లేకుండా కారవాన్‌లోకి ప్రవేశించి, తనను పట్టుకుని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడని ఆమె పేర్కొన్నారు.

తాను ప్రతిఘటించడంతో ఆయన వెనక్కి తగ్గాడని ఆ నటి తెలిపారు. ఈ వారం ప్రారంభంలో మహిళా పోలీస్ స్టేషన్‌లో ఆమె రహస్య స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు, ఆ వెంటనే పోలీసులు వేగంగా స్పందించి అరెస్టు చర్యలు చేపట్టారు. ఈ ప్రక్రియను అత్యంత గోప్యంగా నిర్వహించామని, ప్రాథమిక విచారణలో ఫిర్యాదులో వాస్తవం ఉన్నట్లు తేలిందని అధికారులు వెల్లడించారు.

లైంగిక వేధింపులు, మహిళా గౌరవానికి భంగం కలిగించడం, అక్రమంగా నిర్బంధించడం, అసభ్యకరమైన చేష్టలు వంటి ఆరోపణలతో భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎర్నాకులం సిటీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అశ్వతి జిజి ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. రంజిత్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

నేషనల్ అవార్డ్ వచ్చినా

మలయాళ చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న రంజిత్ బాలకృష్ణన్, మొత్తం మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తిరక్కథ (2008), ఇండియన్ రూపీ (2011), స్పిరిట్ (2012) వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. సామాజిక అంశాలను ఇతివృత్తాలుగా తీసుకుని కథలు రాయడంలో, సినిమాలు తీయడంలో ఆయనకు మంచి పేరుంది. రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా మలయాళ సినిమా అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు.

పదవి పోయినా మారని బుద్ధి!

రంజిత్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనే ఒక బెంగాలీ నటి చేసిన వేధింపుల ఆరోపణల వల్ల ఆయన కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవిని వదులుకోవాల్సి వచ్చింది. హేమ కమిటీ నివేదిక బయటకు వచ్చినప్పటి నుండి మలయాళ చిత్ర సీమలోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గతంలో తనపై వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టిపారేసినా, ఇప్పుడు మళ్ళీ దొరికిపోవడంతో రంజిత్ కెరీర్ ప్రమాదంలో పడింది.

వరుసగా బయటపడుతున్న ఈ వేధింపుల కేసులు సినీ గ్లామర్ వెనుక ఉన్న భయంకరమైన వాస్తవాలను ఎత్తిచూపుతున్నాయి. బాధితులు ధైర్యంగా ముందుకు రావడం వల్లనే ఇలాంటి 'పెద్దల' అసలు రంగు బయటపడుతోంది.

Read More
Next Story