ముమ్ముట్టి ‘భ్రమయుగం’ రివ్యూ
x

ముమ్ముట్టి ‘భ్రమయుగం’ రివ్యూ


విడుదలైన మొదటి రోజే(15.2.24) కేరళలో మూడు కోట్లకు పైగా వసూలు చేసి, మొదటివారం ముగిసే సమయానికి దాదాపు 50 కోట్ల తో, హిట్ దిశగా అడుగులు వేస్తున్న ముమ్ముట్టి " భ్రమయుగం" సినిమా తెలుగు వెర్షన్ ఒక వారం ఆలస్యంగా(23.2.24) విడుదలైంది.


ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే, ఇది 17వ శతాబ్దం నాటి కల్పిత కథ. రాజు గారి దగ్గర ఆస్థాన గాయకుడైన తేవన్(అశోక్ వర్ధన్) తన స్నేహితుడితో కలిసి పోర్చుగీస్ బానిస వ్యాపారస్తుల బారి నుంచి తప్పించుకుని తూర్పు వైపుకి వెళ్తారు. అక్కడ భరతప్పుజా నది ప్రాంతంలో ఆ రాత్రి తలదాచుకుంటారు. తన స్నేహితుడిని ఒక యక్షిణి చంపేయగా తేవన్ అక్కడి నుంచి పారిపోయి ఒక పాడుబడిన భవనానికి చేరుకుంటాడు. ఆకలి తీర్చుకోవడానికి అక్కడున్న ఒక కొబ్బరికాయను తినే క్రమంలో ఒక సేవకుడు అతన్ని భవన యజమాని కొడుమోన్ పొట్టి(ముమ్ముట్టి) దగ్గరికి తీసుకెళ్తాడు.తక్కువ కులం వాడైనప్పటికీ తేవన్ అక్కడ ఉండటానికి అనుమతిస్తాడు కొడుమోన్ పొట్టి. అక్కడినుంచి కథ మొదలవుతుంది. చివరికి అక్కడే అంతమవుతుంది. అయితే ఈ మధ్యలో ఏం జరిగింది. ఆ పాడు పడిన భవనం ఎవరిది? అక్కడున్న వంటవాడు ఎవరు? కొడుమోన్ పుట్టి నేపథ్యం ఏమిటి? వంటి విషయాలు ఒకటొకటిగా తెలుస్తాయి. నిజం చెప్పాలంటే ఈ సినిమా మొత్తం ఆ పాడుబడిన భవంతిలోనే నడుస్తుంది. ఇది పెద్దగా సస్పెన్స్ ఏమీ కాదు.

మూడు పాత్రలతో మ్యాజిక్

2013 తన సినీ ప్రస్థానం మొదలుపెట్టి కేవలం రెండు సినిమాలు మాత్రమే తీసిన మలయాళీ దర్శకుడు రాహుల్ సదాశివన్ తీసిన మరో సినిమా ఇది. మొదటి రెండు సినిమాల లాగే ఇది కూడా ఒక థ్రిల్లరే. మొదటి సినిమా "రెడ్ రెయిన్" సైంటిఫిక్ థ్రిల్లర్ అయితే, రెండో సినిమా "భూతకాలం" సైకలాజికల్ థ్రిల్లర్. మూడో సినిమా భ్రమయుగం డార్క్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. మూడో సినిమా మూడు క్యారెక్టర్లతో మాత్రమే(ఇంకా రెండు క్యారెక్టర్లు ఒకటి రెండు సీన్లకే పరిమితం) తీసిన రాహుల్ సదాశివన్ ముమ్ముట్టి మ్యాజిక్ ను పూర్తిస్థాయిలో తెరమీద చూపించాడు. తన మొదటి సినిమా “రెడ్ రెయిన్” ఓ మాదిరిగా ఉన్నప్పటికీ, కథనంలో వేగం తక్కువై స్లోగా నడవడం వల్ల సినిమా బాగాలేదని విమర్శలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో కథనాన్ని వేగంగా నడపడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు రాహుల్. కేవలం మూడు పాత్రలతో సినిమా మొత్తం నడపటం కత్తి మీద సామే. అయితే దర్శకుడు ఇక్కడ చాలావరకు సక్సెస్ అయ్యాడు.

ముమ్ముట్టి విశ్వరూపం

ఇంతకుముందు ఆదూర్ గోపాలకృష్ణన్ తీసిన " విధేయన్"(1994) సినిమాలో ఒక దుర్మార్గుడైన భూస్వామి (ల్యాండ్ లార్డ్) పాత్రను ధరించి, ఆ ఏడాది ఉత్తమ నటుడు అవార్డు సాధించిన మమ్ముట్టి మరోసారి అలాంటి అవార్డు సాధించగల నటనతో విశ్వరూపం చూపిన సినిమా ఇది. కొత్త పాయింట్లతో, ప్రయోగాలు చేసే మలయాళ సినిమా రంగానికి ముమ్ముట్టి ఒక ఆసెట్. ఈ మధ్యనే వచ్చిన "కతల్" సినిమాలో స్వయంసంపర్కుడిగా నటించిన మమ్ముట్టి ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు.


అలాంటి ఒక ప్రయోగమే భ్రమయుగం. ఇది పూర్తిగా మమ్ముట్టి సినిమా. అయితే మమ్ముట్టితోపాటు మిగతా ఇద్దరు నటులు కూడా, ముఖ్యంగా అశోక్ వర్ధన్ బాగా చేశాడు. దర్శకుడు పాత్రలను మలిచిన తీరు కూడా బావుంది. ఈ సినిమా ఎలా ఉందో చెప్పాలంటే, ఈ సినిమాలోని ఒక డైలాగ్ చెప్పాలి " ఈ భవనం సింహద్వారం దాటి లోపలికి వచ్చిన వాళ్ళు బయటకు వెళ్లలేరు." ఇది సినిమా థియేటర్లో లోపలికి వచ్చి సీట్లో కూర్చుని చాలామంది ప్రేక్షకులకు కూడా వర్తిస్తుంది. సినిమా అక్కడక్కడ ప్రేక్షకుల కు సరియలిస్టిక్(surrealistic) గా అనిపించి, కొంత కన్ఫ్యూషన్ పెంచి, అర్థం కాని పరిస్థితిలోకి నెట్టినప్పటికీ, మొత్తంగా ఈ సినిమా(ముఖ్యంగా క్లైమాక్స్ తో కలిపి చివరి అరగంట) ప్రేక్షకులను కుర్చీలో కూర్చునేలా చేస్తుంది, దానికి ప్రధాన కారణం ముమ్ముట్టి మ్యాజిక్ అయితే, ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి.

ఈ సినిమాలో మిగతా ఇద్దరు నటులు మొదట్లో ఓ మాదిరిగా ఉన్నప్పటికీ , సినిమా సాగుతున్న క్రమంలో వారి నటన దాదాపు ముమ్ముట్టి నటనతో సమానంగా అనిపిస్తుంది. ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు.

బ్లాక్ అండ్ వైట్ మయాజాలం

ఇంకో కారణం ఈ సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్లో తీయడం. ప్రస్తుత రంగుల ప్రపంచమైన సినిమాను బ్లాక్ అండ్ వైట్ లో తీయడం అతిపెద్ద సాహసం. గతంలో కే జి ఎఫ్ సినిమాలు తీసిన ప్రశాంత్ నీల్ ఒకే కలర్ కు కట్టుబడినప్పటికీ అది బ్లాక్ అండ్ వైట్ కాదు. బ్లాక్ అండ్ వైట్లో తీయడమే కాకుండా ప్రేక్షకులను సినిమాలో లీనం అయ్యేలా చేయడం ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ పనితనం, ప్రతిభ.

నిజానికి ఈ సినిమా కలర్ లో తీసి ఉంటే ఇంత ఎఫెక్ట్ గా ఉండేది కాదేమో అన్న రీతిలో దీన్ని తీశారు. ఈ సినిమా కథకు కథనానికి, మూడ్ కు బ్లాక్ అండ్ వైటే కరెక్టు అనే స్థాయిలో చిత్రీకరించడం విశేషం. ఈ సినిమా మూడ్ కు అనుగుణంగా, కథను ఎలివేట్ చేసేలా ఉన్న నేపథ్య సంగీతం గురించి చెప్పాలి. ఒకటి రెండు పాటలు తెలుగులో వినదగ్గవిగా ఉన్నాయి. అయితే వేటికి వాయిద్యాలు వాడలేదు.


ఈ సినిమాలో చాలా సేపు వర్షం పడుతూనే ఉంటుంది. అదే సినిమాకు కాసుల వర్షం కురిపించింది. ఎందుకంటే వర్షం మొదలైనప్పటి నుంచి చివరి వరకు సినిమా చిత్రీకరణ ఎలా ఉందంటే, కుర్చీలో కూర్చున్న ప్రేక్షకులు ఏసీ చల్లదనం, వల్ల వర్షంలో భాగమైపోతారు. అడవిలో వర్షం కురిస్తే ఎలా ఉంటుందో , తడవకుండా చూడగలిగిన, అనుభవించగలిగిన సినిమా ఇది. ప్రేక్షకులు స్వయంగా ఒక అడవిలో వర్షంలో ఉన్నట్లు అనుభూతి చెందడం అన్నది చిత్రీకరణ ఫలితం. ఈ భాగమే(క్లైమాక్స్ తో కలిపి) సినిమాను ఒక స్థాయికి తీసుకెళ్లింది.

ఈ సినిమాలో సామాజికంగా కుల వ్యవస్థ అసమానతలు ఏ విధంగా ఉందో కొద్దిగా టచ్ చేస్తుంది. ఇంకా అధికారం ఏ స్థాయిలో ఉంటుందో, ఎంత క్రూరంగా ఉంటుందో దానికోసం కొంతమంది ఎంత దుర్మార్గానికైనా పాల్పడతారు లీలగా స్పృశించడం జరిగింది. అయితే ఎక్కడో ఒక రచయిత చెప్పినట్టు " ఒక గంట సేపు కుర్చీలో కూర్చొని అనుభవించడానికి తప్ప మరేమీ చేయడానికి వీలు లేని సినిమా ఇది”. ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఆల్రెడీ ఈ సినిమా సూపర్ హిట్ స్థాయికి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

నటీనటులు:
మమ్ముట్టి,సిద్ధార్థ్ భరతన్
అర్జున్ అశోకన్,అమల్దా లిజ్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాహుల్ సదాశివన్
సినిమాటోగ్రఫీ: షహనాద్ జలాల్
సంగీతం : క్రిష్టో జేవియర్
ఎడిటింగ్: మహమ్మద్ అలీ
నిర్మాతలు: చక్రవర్తి,రామచంద్ర, ఎస్.శశికాంత్
నిర్మాణ సంస్థలు: నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్
విడుదల తేదీ : ఫిబ్రవరి 23, 2024


Read More
Next Story