వివాదంలో చిక్కుకున్న  ముమ్మట్టి  ‘పుళు’ ఓటీటీ రివ్యూ
x

వివాదంలో చిక్కుకున్న ముమ్మట్టి ‘పుళు’ ఓటీటీ రివ్యూ

నిత్యం చావు భయంతో బతికే రిటైర్డ్ పోలీసు అధికారిగా మమ్ముట్టి నటించిన సినిమా ‘పుళు’. ఈ సినిమా చుట్టూ ప్రస్తుతం తీవ్ర వివాదం నడుస్తోంది. ఇంతకీ ఆ వివాదం ఏంటి..


ఇప్ప‌టివ‌ర‌కు మూడు నేష‌న‌ల్ అవార్డుల‌ను అందుకున్న మ‌మ్ముట్టి.. వయస్సు పెరుగుతున్నా తగ్గేదేలే అన్నట్లు కెరీర్‌లో దూసుకుపోతున్నారు. ఇటీవల కన్నూర్ స్క్వాడ్, భ్రమయుగం, కాతల్, అబ్ర‌హం ఓజ్ల‌ర్‌తో థియేటర్లలో సందడి చేశారు. క‌న్నూర్ స్క్వాడ్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 100 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఆ సినిమాలో నిజాయితీప‌రుడైన పోలీస్ ఆఫీస‌ర్‌‌గా మ‌మ్ముట్టి న‌టించారు. లేటెస్ట్ మూవీ భ్ర‌మ‌యుగంలో నెగిటివ్ షేడ్స్‌‌తో కూడిన మాంత్రికుడి పాత్ర‌లో అదరగొట్టారు. రోషాక్‌, పురు, అబ్ర‌హం ఓజ్ల‌ర్ సినిమాల్లో మ‌మ్ముట్టి విల‌న్‌‌గా యాక్ట్ చేశారు. కాథ‌ల్ ది కోర్ మూవీలో హోమో సెక్సువ‌ల్ క్యారెక్ట‌ర్ చేసి అందరినీ అబ్బురపరిచారు.

త్వరలోనే ఆయన నటిస్తున్న టర్బో మూవీ రిలీజ్ కానుంది. జూన్ 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఈలోగా ఆయన్ను ఓ వివాదం చుట్టుముట్టింది. మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో రెండేళ్ల క్రితం ‘పుళు’ టైటిల్‌తో ఒక సినిమా వచ్చింది. రథీనా దీనికి దర్శకత్వం వహించారు. ఆమె దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా అది. అందులోని సీన్స్ ఒక వర్గానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అందుకు కారణం.. ఆ మహిళా దర్శకురాలి భర్త. ఆయన ఒక ఆన్‌లైన్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఆ చిత్రం ఒక వర్గానికి వ్యతిరేకంగా ఉందనడమే గాక, అలాంటి చిత్రంలో నటించడంపై మమ్ముట్టిని తప్పుపట్టారు. దాంతో ఆయన మాటలు అందిపుచ్చుకుని చాలా మంది నెటిజన్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ మలయాళ స్టార్‌ను ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. దాంతో ఆయన అభిమానులు, స్థానిక నేతలు ఆయనకు అండగా నిలుస్తూ తమ మద్దతు ప్రకటించాల్సి వచ్చింది. ఇంతకీ ఆ సినిమాలో ఏముంది... ఆ కథా కమామీషు చూస్తే...

కథ ఏంటంటే...

కుట్ట‌న్ (మమ్ముట్టి) రిటైర్డ్ పోలీస్ అధికారి. తను ఎంతగానో ఇష్టపడే భార్య చ‌నిపోవ‌డంతో ఆ జ్ఞాప‌కాలతో జీవిస్తుంటాడు. కానీ కొడుకు కిచ్చు(వాసుదేవ్) ని క్రమశిక్షణ పేరుతో ఇబ్బందిపెడుతూంటాడు. అతన్ని తన అదుపులో ఉంచుకోవడానికి కుట్టన్ ప్రయత్నిస్తుంటాడు. దాంతో తండ్రిపై ద్వేషం పెంచుకుంటూంటాడు కిచ్చు. ఇదిలా ఉండగా కుట్ట‌న్ సోద‌రి భారతి (పార్వతి తిరువోత్తు) పెద్ద‌ల‌ను ఎదురించి కేపీ అనే ఓ రంగ‌స్థ‌ల క‌ళాకారుడిని ప్రేమ‌వివాహం చేసుకుంటుంది.

అయితే కేపీది త‌మ‌కంటే త‌క్కువ కులం కావ‌డంతో కుట్ట‌న్‌కు ఇష్టం ఉండదు. ఆమెను దూరం పెడ‌తారు. అనుకోకుండా కుట్ట‌న్ ఉండే అపార్ట్‌మెంట్‌లోకి భ‌ర్త‌తో క‌ల‌సి భార‌తి కొన్నాళ్లు ఉండాల్సిన సిట్యువేషన్ క్రియేట్ అవుతుంది. మ‌రోవైపు కుట్ట‌న్‌ను చంపేందుకు ఎవరో గుర్తు తెలియని వాళ్లు ప్రయత్నిస్తూంటాడు. ఇంతకీ కుట్టన్‌ని చంప‌డానికి ప్ర‌య‌త్నించిన‌దెవ‌రు? తన అన్న అపార్ట్‌మెంట్‌లోకి దిగిన భార‌తి జీవితం ఏమైంది? కుట్ట‌న్‌తో పాటు భార‌తి జీవితం చివ‌ర‌కు ఏ టర్న్ తిరిగింద‌న్న‌దే ఈ చిత్రం కథ.

ఎలా ఉందంటే...

పరువు హత్యలు, రివేంజ్‌ కథాంశంగా తెరకెక్కింది. ఈ స్టోరీని మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా బాగానే మలిచారు డైరెక్టర్‌ రథీనా పీటీ. ఉన్న‌త కుటుంబాల్లో ఈ కుల వివ‌క్ష ఎక్కువ‌గానే ఉంటుంద‌ని ద‌ర్శ‌కురాలు ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. కుటుంబ ప్ర‌తిష్ట, కుల గౌర‌వం ముఖ్య‌మ‌ని న‌మ్మే ఓ వ్య‌క్తి జీవితం చివ‌ర‌కు ఎలా ముగిసిందో చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు వివాదం ఈ సినిమాలో సీన్స్ ఓ కులంకు, వర్గానికి వ్యతిరేకంగా ఉన్నాయనేది అభియోగం.

ఫస్టాఫ్ సెటప్ సీన్స్‌తో సోసోగా వెళ్లిపోయినా సెకండాఫ్‌లో డ్రామాలోకి కథ ఎంటర్ అవుతుంది. కుట్ట‌న్‌లో మార్పు కోసం సోద‌రి భార‌తి ప్ర‌య‌త్నాలు చేయ‌డం, త‌న‌ను చంప‌డానికి ప్ర‌య‌త్నించే శ‌త్రువు ఎవ‌రో తెలుసుకోవ‌డానికి కుట్ట‌న్ వేసే ప్లాన్స్‌తో ఇంటెన్స్ డ్రామాగా నడుస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ అయితే సూపర్‌గా ఇచ్చారు.

మమ్ముట్టి అయితే సినిమాలో తన క్యారక్టరైజేషన్‌తోనే అదరకొట్టాడు. అనుక్ష‌ణం చావు భ‌యంతో బ‌తికే రిటైర్డ్ పోలీస్ పాత్ర‌లో జీవించేశాడు. చివ‌ర‌కు త‌న సొంత కొడుకుతో పాటు సోద‌రిని కూడా అనుమానించే వ్య‌క్తిగా తన నటనతో సినిమాను నిల‌బెట్టారు.

చూడచ్చా

వివాదాలు ప్రక్కన పెడితే ఈ సినిమా చూడదగ్గ చిత్రమే..కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. అయితే స్లోగా ఉంటుంది. డబ్బింగ్ యావరేజ్ గా ఉంటుంది.

ఏ ఓటీటిలో ...

సోనిలివ్ ఓటీటీ లో తెలుగు వెర్షన్ ఉంది.

నటీనటులు: మమ్ముట్టి, పార్వతి తిరువోతు, వాసుదేవ్‌ సజీత్ తదితరులు

నిర్మాత: ఎస్‌ జార్జ్‌

దర్శకత్వం: రథీనా పీటీ

సంగీతం: జేక్స్‌ బిజోయ్‌

సినిమాటోగ్రఫీ: థేనీ ఈశ్వరన్‌

Read More
Next Story