
Image source: Lakshmi Manchu FB page
మంచు లక్ష్మి ఆవేదనలో అర్థం ఉంది...
ఆమె ఆవేదనలో అర్థం ఉంది. వెంటనే సారీ చెప్తే పరువూ, మర్యాదా!
పొలిటికల్ జర్నలిస్టులకు, ఫిల్మ్ జర్నలిస్టులకు ఒకరకమైన పొగరు, అహంభావం ఉంటాయి. దానికి కారణం...బాగా ప్రజాదరణ, పలుకుబడి గల వాళ్లతో (పొలిటీషియన్స్ అండ్ ఫిల్మ్ స్టార్స్) వారికి ఉన్న పరిచయాలు, అనుబంధం. ఈ రంగంలో (బీట్స్ అంటారు జర్నలిజం పరిభాషలో) చాలా ఏళ్లుగా ఉన్న సీనియర్లు కొందరు విపరీతంగా వ్యవహరిస్తారు. కానీ వాళ్ళని ఎవ్వరూ ఏమీ అనరు... ఎందుకొచ్చిన గొడవని.
తెలుగు నటి, సినిమా కుటుంబం నుంచి వచ్చిన మంచు లక్ష్మి గారిని ఆమె వయస్సు, బట్టల ధారణ గురించి ఒక ఇంటర్వ్యూలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు మూర్తి గారు (టీవీ 5 CEO మూర్తి గారు కాదు) అడిగిన ప్రశ్న వివాదాస్పదమైంది. తనను అడిగిన పోరంబోకు ప్రశ్నను ఒక హీరో నైతే అడుగుతారా? అన్న లక్ష్మి గారి ప్రశ్నకు మూర్తి గారి వెకిలి నవ్వు సమాధానం కావడం నాకు కూడా నచ్చలేదు.
ఈ ప్రపంచంలో మహిళలు బయటికొచ్చి తాము ఎంచుకున్న రంగాల్లో తమదైన ముద్ర వేయడం అంత ఈజీ కాదు. ఎన్నో అవాంతరాలు, అడ్డు గోడలు ఉంటాయి. వివాదాస్పద సినీ కుటుంబం నుంచి వచ్చినా లక్ష్మి గారు చలాకీగా, ఉత్సాహంగా మాట్లాడుతూ సందడి చేస్తూ తనకు తోచింది తాను చేసుకుంటారు.
ఇదేమి ప్రశ్న సామీ? అని ఆమె అంటే... వైరల్ అవుతుంది గదా! అన్నట్టు సదరు సీనియర్ జర్నలిస్టు అనడం అస్సలు బాగోలేదు. దీంతో ఒళ్ళు మండిన ఆ నటి తెలుగు ఫిలిం ఛాంబర్ కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.
ఫిలిం మనుషులు నోటికొచ్చింది మాట్లాడవచ్చు, ఇష్టం వచ్చింది చూపవచ్చు గానీ జర్నలిస్టులు ఇట్లాంటి ప్రశ్నలు వేస్తే తప్పా? అని అడగొద్దు. జర్నలిస్టులు ఎంతో బాధ్యతగా ఉండాలి.
నిజానికి సమాజంలో మహిళల పట్ల చిన్నచూపు, దాడులు పెరగడానికి కారణం ఈ సినిమా వాళ్లే అని నా వాదన. సృజనాత్మకత (క్రియేటివిటీ) పేరుతో రచయితలు, దర్శకులు వయోలెన్స్, సెక్స్ మానియక్స్ లాగా ప్రవర్తిస్తుంటే..నటీ నటులు డబ్బు కోసం వాటికి అభ్యంతరం చెప్పకుండా బెండ్ అవుతున్నారు.
వెంటబడి ప్రేమించాలని బలవంతం చేయవచ్చని ఒక సినిమా, స్కూల్ లెవల్లోనే లవ్వు హంగామా చేయవచ్చని ఇంకో సినిమా, ఏజ్ తో సంబంధం లేకుండా ప్రేమ వ్యవహారం నడపాలని మరో సినిమా ప్రబోధిస్తూ.... సమాజంలో స్థిరపడిన విలువల్ని సమూలంగా మారుస్తున్నారు.
వీటికీ మంచు లక్ష్మి గారికి సంబంధం లేదు. ఆమె ఆవేదనలో అర్థం ఉంది. మూర్తి గారు వెంటనే సారీ చెప్తే పరువూ, మర్యాదా!
Next Story