ఓ మోస్తరు సస్పెన్స్ థ్రిల్లర్ మంగళవారం;
x
source: X

ఓ మోస్తరు సస్పెన్స్ థ్రిల్లర్ 'మంగళవారం;

అజయ్ భూపతి, “మహాసముద్రం” అనే సినిమా తీసి ఇబ్బంది పడి మళ్లీ సస్పెన్స్, థ్రిల్లర్ లు మాత్రమే ప్రేక్షకులకు నచ్చుతాయి అని భావించి తీసిన సినిమా " మంగళవారం".



ఆర్ఎక్స్ 100 అనే ఒక హిట్ సినిమాను(రెండు కోట్లతో తీస్తే- పాతిక కోట్ల దాకా వసూలు చేసింది) తీసిన అజయ్ భూపతి, “మహాసముద్రం” అనే సినిమా తీసి ఇబ్బంది పడి మళ్లీ సస్పెన్స్, థ్రిల్లర్ లు మాత్రమే ప్రేక్షకులకు నచ్చుతాయి అని భావించి తీసిన సినిమా " మంగళవారం".

మొదట్లోనే ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే కొంత సస్పెన్స్ ను మరికొంత థ్రిల్ కాసింత రివెంజ్, కాస్త మిస్టరీ మూడు నాలుగు ట్విస్టులు (ఇవి నిజంగా ప్రేక్షకులకు సంభ్రమాశ్చర్యాలను కలిగించాయి) కలిపి నేసిన ఒక రంగుల పెయింటింగ్ కొంతవరకు బాగుందనే చెప్పాలి. అది ఇంకా కొంచెం ఎక్కువ బాగుండకపోవడానికి కారణం రచన,దర్శకత్వమే, అంటే దర్శకుడే. ఎందుకంటే అతనే రచయిత కాబట్టి! ప్రస్తుతం తక్కువ - ఫ్లాష్ బ్యాక్ ఎక్కువ( ఇదే ఈ సినిమా ను భారీ సక్సెస్ నుంచి వెనక్కి తీసుకెళ్లింది), అవసరం లేని పాత్రలు ఎక్కువ, అవసరం ఉన్న పాత్రల నిడివి తక్కువ కావడం వల్ల ఈ సినిమా పై స్థాయికి వెళ్లలేకపోయింది. అయితే ఈ మధ్యకాలంలో వస్తున్న అనేక హారర్, థ్రిల్లర్, సస్పెన్స్ జోనర్ సినిమాల్లో ఇది కొంచెం బెటర్ సినిమానే!

ఆర్ఎక్స్ సినిమాలో హీరోయిన్ గా వేసిన పాయల్ రాజ్ పుత్ తో దర్శకుడు దాదాపు అలాంటి పాత్రనే మళ్ళీ ఈ సినిమాలో కూడా వేయించాడు.. కాకపోతే ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ పర్వాలేదనిపించింది. అదొక్కటే తేడా. కొంచెం నటనకు ఆస్కారం ఉన్న సినిమా కాబట్టి గ్లామర్ పక్కన పెట్టి ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బోల్డ్ సన్నివేశాల్లో కూడా పూర్తిగా లీనమై నటించింది. బోల్డ్ సన్నివేశాల్లో ఎడిటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడే కొన్ని సీన్లు ఈ సినిమాలో ఉన్నాయి. సినిమా లో , కొంత కన్ఫ్యూజన్, పాత్రల మధ్య కనెక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా కన్విన్స్ చేయడం కొంచెం కష్టమే.

ఈ సినిమా ఎక్కడైనా పక్కదారి పట్టినప్పుడు ( పట్టనప్పుడు కూడా) దీన్ని నిలబెట్టినవి రెండు అంశాలు. ఒకటి దాశరథి శివేంద్ర ఫోటోగ్రఫీ పల్లెటూరి నేపథ్యాన్ని, ముఖ్యంగా రాత్రిపూట తీసిన సన్నివేశాలను చాలా చక్కగా చూపించాడు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో, ముఖ్యంగా అందరూ హంతకుడి కోసం పరుగులు తీసి, వెతికే సన్నివేశాల్లో చిత్రీకరణ హాలీవుడ్ స్థాయిలో ఉంది. నైట్ ఎఫెక్ట్ ఈ సినిమాకి బలం, దాన్ని చాలా బాగా తీయడం సినిమాకు చాలా లాభం కలిగింది.

దానికి తోడైంది "కాంతారా" సినిమాను ఒక లెవెల్ కి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు అజనీష్ నేపథ్య సంగీతం. తన సంగీతంతో ఈ సినిమాను కూడా ఒక స్థాయికి తీసుకెళ్లాడు. బాగా ఎలివేట్ చేశాడు. చాలా సన్నివేశాల్లో ఫోటోగ్రఫీ సంగీతాల జుగల్బందీ కథను కథనాన్ని ఆసక్తికరంగా నడిపించాయి.

ఈ సినిమా దర్శకుడు అజయ్ భూపతి ప్రతిభ కూడా కొంతవరకు సినిమాలు ఎలివేట్ చేసింది. రాంగోపాల్ వర్మకు దర్శకత్వంలో సహాయకుడిగా పనిచేసిన అజయ్ భూపతి టేకింగ్ లో కొంతవరకు రామ్ గోపాల్ వర్మ టేకింగ్ ఛాయలు కనపడతాయి. ముఖ్యంగా రాత్రి తీసిన సన్నివేశాలు. సినిమా రచయిత కూడా అయిన దర్శకుడు కొన్ని సన్నివేశాలతో ప్రేమలో పడిపోయి వాటిని ఎక్కువ సేపు చిత్రీకరించడం వల్ల మెలోడీ డ్రామా ఎక్కువయి, సినిమాని కాస్త స్లో చేసింది. సినిమా చివర్లో వచ్చే మూడు నాలుగు ట్విస్టులు ప్రేక్షకులు ఊహించనివే. అవి కూడా కొంతవరకు సినిమాకు బలాన్ని చేకూర్చాయి. సంగీతం, దర్శకత్వం, చాయాగ్రహణం, ఎడిటింగ్ ఏ సినిమాకి అయినా ఈ నాలుగే బలం. మొదటి మూడు బలంగా ఉన్నప్పటికీ ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండి ఉంటే బాగుండేది. ఇలాంటి జోనర్ సినిమాలకు నాలుగు స్తంభాలు ఇవే.

మహాలక్ష్మి పురం అనే ఊర్లో 80 దశకాల్లో జరిగిన పీరియాడికల్ కథ ఈ సినిమా సారాంశం. శైలు అనే శైలజ

(పాయల్ రాజ్ పుత్) ఫ్లాష్ బ్యాక్ నుంచి ప్రస్తుతం వరకు ఈ సినిమా నడుస్తుంది. మధ్యలో ఎన్నో పాత్రలు. ప్రస్తుతానికి, గతానికి మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్ల ప్రేక్షకులు కొంత కన్ఫ్యూజన్ కు గురవుతారు. ఆ కన్ఫ్యూజన్ దూరం చేయడానికి, క్లియర్ చేయడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. సినిమా వేగాన్ని తగ్గించినవివే. ముఖ్యం గా కాలేజీలో పాయల్ రాజ్ పుత్ లెక్చరర్ అజ్మల్ మధ్య నడిచిన ఫ్లాష్ బ్యాక్ సీన్లు ఫ్లాష్ బ్యాక్ సీన్లు కూడా కొద్దిగా లాగినట్లు అనిపిస్తుంది, ఇవి సినిమా వేగానికి స్పీడ్ బ్రేకర్లు.

ఈ సీన్లకి బ్యాగ్రౌండ్ లో వినిపించే పాట చిత్రీకరణతో సహా బాగున్నప్పటికీ సినిమాకు ఉపయోగపడదు. తర్వాత జరిగిన కొన్ని సన్నివేశాలు కృత్రిమంగా అనిపిస్తాయి. కేవలం ఒక వర్గం ప్రేక్షకులను అలరించడానికి తీసిన సన్నివేశాలు ఇవి. ఇంతకు ముందు చెప్పిన ఊర్లో గోడమీద ఇద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని రాయడం, ఆ తర్వాత వాళ్ళిద్దరూ హత్యకు గురి కావడం (అది మంగళవారం రోజే) మిస్టరీగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ పరువు పోయిందని ఆత్మహత్య చేసుకున్నారని ఊరు వాళ్ళందరూ అనుకుంటారు. కానీ ఊరికి కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ మాయ (నందిత శ్వేత) అది హత్యగా చెబుతుంది.

పోస్టుమార్టం చేయాలని చెప్తే, ఊరు మొత్తం వ్యతిరేకిస్తుంది. దానికి వంత పాడుతాడు వూరి జమిందార్ ప్రకాశం బాబు(చైతన్య కృష్ణ) కానీ రెండోసారి మరో మంగళవారం అలాగే గోడ మీద పేర్లు రాసి ఉన్న మరో ఇద్దరు చనిపోవడంతో అప్పుడు ఊరివాళ్లు వ్యతిరేకిస్తున్నప్పటికి మాయ పోస్టుమార్టం చేయిస్తుంది.

దాని తర్వాత సినిమా మొత్తం శైలజ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్రలు, గోడ మీద రాస్తున్న వారు ఎవరు? హత్యలు మంగళవారమే ఎందుకు జరుగుతున్నాయి? ఆర్ఎంపీ డాక్టర్ విశ్వనాథం(రవీంద్ర విజయ్)ఎవరు? లాంటి ప్రశ్నలు ఉత్పన్నమై చివరకు అంత తేటతెల్లం కావడం ఈ సినిమా కథ (సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి.. కథ గురించి ఇంతకన్నా చెప్పడం భావ్యం కాదు).

ఈ సినిమాలో కసిరాజు(అజయ్ ఘోష్) పాత్రతో చేయించిన కామెడీ పంటికిందరాయి. ఇలాంటి సినిమాల్లో డార్క్ కామెడీ సినిమా వేగాన్ని తగ్గించే స్పీడ్ బ్రేకర్. ఇంకా కొన్ని పాత్రలో కేవలం ప్రేక్షకులు ఊహించడం కోసం, లేదా వాళ్ళ మెదడుకు పని పెట్టడం కోసం ప్రవేశపెట్టబడినవే.

ఏ మాట కా మాట చెప్పాల్సి వస్తే ఈ సినిమాలో బాగున్న అంశాలు, సినిమా ను పరిగెత్తించే అంశాలు తక్కువగానే ఉన్నాయి. మిగతా అంశాలు కేవలం ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేయడానికో (ఉదాహరణకు పూజారి పాత్ర, మాస్క్ ధరించిన వ్యక్తి పాత్ర)ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికో ఉన్నవే.

బాటమ్ లైన్ ఏంటంటే ఈ సినిమా రేటింగ్ లు అవి పక్కన పెట్టి, కొన్ని పట్టించుకోకుండా ఉంటే చూడదగ్గ సినిమానే అని చెప్పడం, దర్శకుడి ప్రతిభకు ఇవ్వగలిగే, ఇవ్వదగ్గ కితాబు!

కొసమెరుపు: సినిమా చివర్లో దర్శకుడు ఆల్రెడీ రెండో పార్ట్ ఉందని చెప్పకనే చెప్పాడు! లెట్స్ వెయిట్!!

తారాగణం: : పాయల్ రాజ్ పుత్, దివ్య పిళ్ళై, నందిత శ్వేత, అజ్మల్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్, రవీంద్ర విజయ్, శ్రావణ్ రెడ్డి, తదితరులు

దర్శకుడు : అజయ్ భూపతి

నిర్మాతలు: స్వాతి రెడ్డి .ఎం సురేష్ వర్మ .

సంగీతం: బి. అజనీష్ లోక్ నాథ్

సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర

ఎడిటర్: మాధవ్ కుమార్ గుళ్ళపల్లి

విడుదల తేదీ:17.11.2023

Read More
Next Story