
‘మంజుమ్మెల్ బాయ్స్’ డైరెక్టర్ పై లైంగిక ఆరోపణలు!
అపార్ట్‌మెంట్‌లో అర్ధరాత్రి ఏం జరిగింది!
భారతీయ సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ మూవీ పేరు వినగానే ఆ మ్యాజిక్, ఆ సర్వైవల్ థ్రిల్ గుర్తొస్తాయి. కానీ, అదే సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ చిదంబరం ఇప్పుడు ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. ఒక యువ నటి ఫిర్యాదుతో ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం యావత్ సినీ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. కేరళ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ఈ వ్యవహారం వెనుక ఉన్న ఊహించని నిజాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.
అర్ధరాత్రి అక్రమ చొరబాటు :
ఎర్నాకులం టౌన్ సౌత్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఘటన 2022లో జరిగినట్లు తెలుస్తోంది. కొచ్చిలోని ఎలమ్ కులంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లోకి చిదంబరం బలవంతంగా ప్రవేశించారని, అక్కడ ఉన్న ఒక యువ నటిపై లైంగిక ఉద్దేశంతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు వస్తున్నాయి. కేవలం వేధింపులే కాకుండా, ఆమె గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించారని బాధిత మహిళ తన వాంగ్మూలంలో పేర్కొంది. ఈ మేరకు మార్చి 2న ఎర్నాకులం పోలీసులు FIR నమోదు చేశారు.
పోలీసుల యాక్షన్ :
ప్రస్తుతం చిదంబరంపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసు బుక్ అయింది. సెక్షన్ 74 (మహిళ గౌరవానికి భంగం కలిగించేలా దాడి చేయడం), సెక్షన్ 75 (లైంగిక వేధింపులు) కింద పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. గత రెండేళ్లుగా నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈ వ్యవహారం ఇప్పుడు నటి ధైర్యంగా ముందుకు రావడంతో సంచలనంగా మారింది. పోలీసులు సదరు నటి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచి, దర్శకుడిని విచారణకు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు.
స్టార్ ఇమేజ్ మసకబారుతోందా? :
చిదంబరం 2021లో 'Jan.E.Man' చిత్రంతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ‘మంజుమ్మెల్ బాయ్స్’ తో మలయాళ సినిమా బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేశారు. ఆ చిత్రం సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఆయన ‘బాలన్’ (Balan) అనే ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే పనిలో ఉండగా, ఈ ఆరోపణలు ఆయన కెరీర్‌ను అగాధంలోకి నెట్టేలా కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో పెద్ద పేరున్న ఒక దర్శకుడు ఇలాంటి కేసులో ఇరుక్కోవడంపై నెట్టింట తీవ్ర చర్చ సాగుతోంది.
సినిమాల్లో హీరోలను గొప్పగా చూపే దర్శకులు, నిజ జీవితంలో ఇలాంటి పనులకు పాల్పడటం జీర్ణించుకోలేని విషయమని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమని తేలితే, చిదంబరం అరెస్ట్ అవ్వడం ఖాయమని పోలీసు వర్గాలు హింట్ ఇస్తున్నాయి. ఈ కేసు మలయాళ చిత్ర పరిశ్రమలోని చీకటి కోణాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. మరి ఈ వివాదం చిదంబరం కెరీర్‌ను ఎటు వైపు తీసుకెళ్తుందో వేచి చూడాలి.

