మంజుమ్మల్ బాయ్స్: మూవీ రివ్యూ
x
Source: Facebook

మంజుమ్మల్ బాయ్స్: మూవీ రివ్యూ

సినిమా అంటే నాణేలతో తీసేది కాదు నాణ్యతతో తీసేది అని నిరూపించిన మూవీ మంజుమ్మల్ బాయ్స్. కథ సాధారణమే అయినా కలెక్షన్లు అసాధారణంగా ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..


ఈ మధ్య కాలంలో మాలీవుడ్ నుంచి తెలుగులోకి డబ్ చేయబడిన మరో సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా సినిమా "మంజుమ్మల్ బాయ్స్". ఈ సినిమా ఇప్పటికే 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ దాటేసి, మలయాళ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ వేసవి ఆరంభంలో మలయాళం నుంచి వచ్చిన " ఆడు జీవితం" కూడా ఒక సర్వైవల్ డ్రామానే. దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రయోగాలు చేయడంలో ముందుండే మాలీవుడ్, ఈ మధ్యకాలంలో ఇటువంటి సినిమాలు తీయడమే కాకుండా, వాటిని వసూళ్ల పరంగా కూడా విజయవంతం చేయడం విశేషం. ఈ సంవత్సరం భారతదేశం తరపున ఆస్కార్ ఎంట్రీ అయిన 2018, ఆ సంవత్సరం వచ్చిన కేరళ వరదలకు సంబంధించిన కథ (ఇది కూడా ఒకరకంగా సర్వైవల్ డ్రామానే) కూడా మలయాళ సినిమానే!

ఎన్నో మానవీయ కోణాలను ఆవిష్కరించిన సినిమా

“మంజుమ్మల్ బాయ్స్” ఎందుకు ఇంత విజయవంతమైంది? ఇందులో ఏముంది? అన్న విషయాలు ఒకసారి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. చాలా సాధారణమైన కథ, ఎటువంటి సెన్సేషన్స్, ఫైట్లు, పాటలు విజువల్స్ లేకుండా నడుస్తుంది. నిజమైన స్నేహం, సాయం, మానవత్వం వంటి మానవీయ విలువలను ప్రతిబింబించిన సినిమా ఇది. ‘మంజుమ్మల్ బాయ్స్’ కొన్ని నిజ జీవిత సంఘటనల మీద ఆధారపడి రాసుకున్న ఓ సింపుల్ కథ. కేరళ రాష్ట్రంలోని మంజుమ్మల్ ప్రాంతం నుంచి కొంతమంది స్నేహితులు(మంజుమ్మల్ బాయ్స్) కొడైకెనాల్ ట్రిప్‌కు వెళ్లడం, అక్కడ ఆ జట్టులోని ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు గుహల సముదాయంలోని "గుణ" అనే ఒక లోయలో పడి పోవడం, ఆ తర్వాత అతన్ని బయటికి తీయడానికి చేసే ప్రయత్నాలతో సినిమా నడుస్తుంది. కమలహాసన్ "గుణ" సినిమా చిత్రీకరణ అక్కడ జరిగిన తర్వాత దాని పేరు "గుణ" అయ్యింది. ఆ సినిమాలోని "ప్రియతమా.. నీవచట కుశలమా.. నేనిచట కుశలమే.." అన్న పాటను సందర్భానుసారం సినిమాలో వాడటం విశేషం!

ఇది పూర్తిగా దర్శకుడి సినిమా. "జానేమన్" అనే కామెడీ సినిమా తర్వాత చిదంబరం తీసిన రెండో సినిమా. ఈ సినిమా కథ నిజ జీవితం మీద ఆధారపడి తీసినప్పటికీ, దాన్ని నడిపించిన విధానం చూడదగ్గ సినిమాగా మార్చింది. మొదట్లో మంజుమల్ బాయ్స్ అందర్నీ పరిచయం చేయడానికి, వారి గ్రూప్ క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత టైం తీసుకున్నట్టు అనిపించినా, సినిమాలో తర్వాత అది కనెక్ట్ అవుతుంది. మొదట్లో తాడు లాగే సన్నివేశం అనవసరమేమో అనిపించినప్పటికీ, సినిమా ద్వితీయార్థంలో స్నేహితులందరూ కలిసి తాడు లాగి సుభాష్‌ను కాపాడడం అన్న సీన్‌కు కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా ప్రధానంగా కుట్టన్(శోభిన్ షాహిర్) అతని స్నేహితుడు సుభాష్(శ్రీనాథ్ భాషి) చుట్టూ తిరుగుతుంది. చాలా సాదా సీదా కథనంతో దర్శకుడు సినిమాను నడిపాడు. అక్కడక్కడ కొన్ని సీన్లు అవసరం లేదేమో అనిపించినప్పుడు, వాటి అవసరాన్ని తర్వాత జాగ్రత్తగా ప్రేక్షకులకు పరిచయం చేశాడు దర్శకుడు.

ప్రతి పాత్రను క్యాజువల్‌గా అనిపించేలా చేస్తూ వాటితోనే బిగువైన సన్నివేశాలు రాసుకోవడం, అవి కథకు అవసరమై ఉండడం అన్నది దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రతిభ. ఉదాహరణకు టీ కొట్టు యజమాని పాత్ర, పోలీస్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్, రైటర్, గైడ్ పాత్రలు అన్నీ కూడా సినిమాను ముందుకు నడుపుతాయి. ఇందులో ప్రతి పాత్ర ఏదో ఒక మానవీయ కోణాన్ని ప్రతిబింబిస్తుంది. సాధారణంగా పోలీసులు ఎలా బిహేవ్ చేస్తారు అన్నది చాలా చక్కగా చూపించాడు దర్శకుడు చిదంబరం. చిన్నప్పుడు సుభాష్ ఎవరికి కనపడకుండా ఎలా దాక్కునేవాడు అన్న గతాన్ని, వర్తమానాన్ని ఒకదాని తర్వాత మరో దాన్ని వరుసగా చూపడం దర్శకుడు చూపించిన ప్రతిభ. ఈ ప్రక్రియ ద్వారా సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఆ పాత్రలతో, సినిమాతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు.

ఈ సినిమాల్లో నటీనటుల నటన బాగుంది. ప్రతివారు తమ తమ స్థాయిలో సహజంగా అనిపించేలా నటించారు. కథా కథనంతో పాటు ఏ పాత్ర నేల విడిచి సాము చేయదు. అదే సినిమాకు ఉన్న ప్రధాన బలం. ఇక సన్నివేశాల చిత్రీకరణలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు దర్శకుడు. ఈ సినిమా మూడ్ నీ ఎమోషన్స్‌ని ఎలివేట్ చేసిన నేపథ్య సంగీతం ద్వారా దర్శకుడు సినిమాలో ప్రేక్షకులు లీనమయ్యేలా చేసుకున్నాడు. దీనికి సినిమాటోగ్రఫీ కూడా తోడైంది. వర్షం పడుతున్న సందర్భాలు, చీకట్లో జరిపిన రెస్క్యూ ఆపరేషన్ మొత్తం ఉత్కంఠ భరితంగా మారడానికి ఫోటోగ్రఫీ, సంగీతమే ప్రధాన కారణాలు.

తెలుగు, హిందీ, తమిళ, కన్నడ సినిమాలతో పోలిస్తే దీంట్లో అన్నీ తక్కువే ఉన్నాయి. అయినా ఈ సినిమా ఎక్కువగా వసూలు సాధించింది. దీన్ని బట్టి చూస్తే కొన్నిసార్లు LESS IS MORE (తక్కువనే ఎక్కువ) అన్నది నిజమే అని అనిపిస్తుంది "20 కోట్ల ఖర్చు- 200 కోట్లకు పైగా వసూళ్లు" మంజుమల్ బాయ్స్ సినిమా తెలుగులో విజయవంతం కాకపోయినా, తెలుగు ప్రేక్షకులకు నచ్చకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ చాలా మందికి నచ్చిందని అర్థం అయిపోయింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు చూడడం కోసం రిలీజ్ చేశారు మైత్రీ మూవీస్ సంస్థ వారు. ఇట్లాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. ఎవరైనా సరే ఈ సినిమాను చూడొచ్చు.

చివరగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా ఇతర భారతీయ భాషల సినిమాలు, విఫలం కావడానికి ముఖ్యమైన కారణం "నేల విడిచి సాము చేయడమే" అని అనిపిస్తుంది. కోట్లాది రూపాయలు, భారీ తారాగణాలు, హంగులు, ఆర్భాటాలు, విదేశాల్లో చిత్రీకరణ, బీభత్సమైన ఫైట్లు, పంచ్ డైలాగులు, నవ్వించడానికి చేసే ప్రయత్నాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు, ఐటెం సాంగ్‌లు, వంటివి సినిమా కథకు కథనానికి అదనంగా ఉండాలి తప్ప, అవే సినిమా కాకూడదు. ఈ విషయాన్ని విజయవంతంగా రుజువు చేసిన సినిమాలు ఈ మధ్యకాలంలో అన్ని భాషల్లో కలిపి ఓ గుప్పెడు మాత్రమే వచ్చాయి. గుప్పెడంత గుండెలను తడి చేసి వెళ్ళాయి... వెళుతూ వెళుతూ కలెక్షన్స్ కూడా భారీ స్థాయిలో ఇచ్చి వెళ్లాయి. నాణ్యమైన సినిమాలు తీయాలంటే నాణేలు కాదు, నాణ్యత ముఖ్యమని ఒక చిన్న సందేశాన్ని కూడా వదిలి వెళ్లాయి. ఈ సినిమా కూడా అందులో ఒకటి!

తారాగణం: సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలువర్గీస్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్

వర్గీస్, గణపతి ఎస్. పొదువల్, లాల్

రచన, దర్శకత్వం: చిదంబరం ఎస్ పొదువల్

సంగీతం: సుశీన్ శ్యామ్

ఛాయాగ్రహణం: షైజు ఖలీద్

ఎడిటర్:వివేక్ హర్షన్

నిర్మాతలు: సౌబిన్ షాహిర్,బాబు షాహిర్,షాన్ ఆంటోనీ

నిర్మాణసంస్థ: పరవ ఫిల్మ్స్

విడుదల తేదీ:ఏప్రిల్ 6, 2024



Read More
Next Story