అందమైన బాల్యంలోకి  అలవోకగా నెట్టే ....‘లంపన్’రివ్యూ
x

అందమైన బాల్యంలోకి అలవోకగా నెట్టే ....‘లంపన్’రివ్యూ

నేను చెప్పేది ఇప్పుడు టైమ్ చూసుకుని మరీ హాస్పటిల్ లో జన్మించే జనరేషన్ గురించి కాదు. దాంతో అందరికీ అమ్మమ్మగారిల్లు అనేది జీవితంలో పెద్ద మధుర స్మృతి.


దాదాపు మనలో ఎక్కువ శాతం అమ్మమ్మగారింట్లోనే పుట్టి,అక్కడే కొంతకాలం పెరిగే ఉంటారు. నేను చెప్పేది ఇప్పుడు టైమ్ చూసుకుని మరీ హాస్పటిల్ లో జన్మించే జనరేషన్ గురించి కాదు. దాంతో అందరికీ అమ్మమ్మగారిల్లు అనేది జీవితంలో పెద్ద మధుర స్మృతి. దాంతో వేసవి శెలవులు ఇచ్చినప్పుడల్లా అమ్మమ్మ ఇంటికి పరుగెట్టేస్తూండటం ఆనవాయితీ. అమ్మేమో పుట్టింటికి, మనమేమో అమ్మమ్మగారింటికి. అయితే మన కథల్లో మరీ ముఖ్యంగా సినిమా కథల్లో ఈ నోస్ట్రాలిజీకు చోటు ఉండటం లేదు. కథల్లో హీరోలు ఎక్కువ శాతం అనాధలే కాబట్టి . వారికి అమ్మమ్మగారిల్లు ఉండే ప్రసక్తే ఉండదు. అది ప్రక్కన పెడితే అమ్మమ్మగారింటికి వెళ్లటం, ఆ బాల్యాన్ని గుర్తు చేసుకోవటం ఎంతటి కష్టాన్ని అయినా మరిపిస్తుంది. అందుకేనేమో ఈ దర్శక,నిర్మాతలు మనని చేయి పట్టుకుని ఓ మారు మూల పల్లెలో ఉన్న అమ్మమ్మగారింటికి తీసుకెళ్లిపోతారు. అదే ఈ వెబ్ సీరిస్ లో కథ. మళ్ళీ కథంటే ఎక్కువ ఊహించుకోకండి కొన్ని జ్ఞాపకాలు అంతే.

స్టోరీ లైన్

1947 లలో ఈ కథ జరుగుతూంటుంది. పుణెలో అమ్మా,నాన్నల దగ్గర ఉండే లంపన్ కు ఓ రోజు వాళ్లమ్మ ఓ ప్రపోజల్ పెడుతుంది. అదేమిటంటే మీ అమ్మమ్మ,తాతయ్య ఫలానా ఊళ్లో ఒంటిరిగా ఉంటున్నారు. వాళ్లకు తోడుగా ఉంటూ అక్కడ కొంతకాలం చదువుకో అంటుంది. మొదట అమ్మమాటను కాదంటాడు. కానీ తప్పదు. అతన్ని తీసుకొచ్చి అమ్మమ్మగారింట్లో వదిలేస్తారు. అమ్మమ్మ (గీతాంజలి కులకర్ణి), తాత (చంద్రకాంత్ కులకర్ణి) తమ మనవుడు రావటంతో మురిసిపోతారు. ఇద్దరే ఉండటంతో బోర్ కొట్టే లైఫ్ కు ఈ మనవడు ఓ సరదా వ్యవహారం. దాంతో మన లంపన్ అదే గ్రామంలో స్కూల్‍లో చేరతాడు. కొత్త ఊరు, కొత్త స్నేహితులు, కొత్త వాతావరణం కొద్ది రోజులు ఎడ్జెస్ట్ అవటం కష్టమే అనిపిస్తుంది.

కానీ కొందరు స్నేహితులు అయ్యాక అతని జీవితంలో ఉత్సాహం వస్తుంది. కానీ మాటి మాటికి అమ్మ గుర్తు వస్తుంది. మరో ప్రక్క అమ్మమ్మ...అస్తమానం బాగా చదువుకో అని నస పెడుతూంటుంది. స్కూల్ మారటంతో మార్కులు పెద్దగా రావు. మరో ప్రక్క అతని అమ్మ వచ్చినా ఓ రెండు రోజులు ఉండి బెంగ తీరకుండానే వెళ్లిపోతుంది. చెల్లేలేమో వచ్చిరానీ భాషలో అన్నయ్యా త్వరగా వచ్చేయ్ అని ఉత్తరం రాస్తుంది. ఇవన్నీ ఆ చిన్న మనస్సుని తన ఇంటివైపు లాగేస్తూంటాయి. ఒంటిరిగా ఫీలవుతూంటాడు. తన తాత, అమ్మమ్మ తనను పట్టించుకోవటం లేదని ఫీలవుతూంటాడు. వాళ్లకీ విషయం తెలుస్తుంది. ఈ లోగా లంపన్ కు తీవ్రంగా జ్వరం వస్తుంది. అప్పుడు తన ఇంటికి వెళ్తాడు. మళ్లీ లంపన్ వెనక్కి తన అమ్మమ్మ,తాతయ్య దగ్గరకు వచ్చారా, చివరకు ఏమైంది అనేది మిగతా కథ.

ఎలా ఉంది

సినిమాగాని, ఓటిటిలో వచ్చే వెబ్ సీరిస్ గానీ మనస్సుకు ఆనందం కలిగించటమే పరమార్దం. అయితే ఓటిటిలలో వెబ్ సీరిస్ కానీ, డబ్బింగ్ సినిమా కానీ అంటే ఖచ్చితంగా అది మర్డర్ మిస్టరీగా మారిపోయింది. క్రైమ్ కు విపరీతమైన ప్రయారిటీ ఇస్తూ ఒకరికొకరు పోటీగా తీస్తున్నారు. అవి వరసపెట్టి చూస్తూంటే ఎప్పుడైనా ఓ చిన్న ఆవగింజంత రిలీఫ్ ఇచ్చేది చూసినా మనస్సు ఆనందంతో మురిసిపోతుంది. అలాంటి అరుదైన వెబ్ సీరిస్ ‘లంపన్’. ఎక్కడా క్రైమ్, హింస, శృంగారం లేకుండా పిల్లా, పెద్దలు అందరూ చూసి ఎంజాయ్ చేసాలా డిజైన్ చేసారు. మరీ ముఖ్యంగా పిల్లలకు, పిల్లలలాంటి మనస్సున్న పెద్దలకు ఈ సీరిస్ తెగ నచ్చేస్తుంది.

ప్ర‌ముఖ మ‌రాఠీ ర‌చ‌యిత ప్ర‌కాశ్ నారాయ‌ణ్ సంత్ (Prakash Narayan Sant) ర‌చించిన ప్ర‌ఖ్యాత‌ ‘వ‌న‌వాస్’ అనే పుస్తకంలోని ఓ పాత్ర‌తో ఈ సిరీస్ తెర‌కెక్క‌ంది. ప్రముఖ న‌టుడు,ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు నిపున్ అవినాశ్ ధర్మాధికారి (Nipun Dharmadhikari) డైరెక్ట్ చేశారు. బాల న‌టుడు మిహిర్ గోడ్‍బోలే మెయిన్‌లీడ్‌లో న‌టించారు. సౌరభ్ భలేరావ్ (Saurabh Bhalerao) బ్యా గ్రౌండ్ మ్యూజిక్, రాహుల్ దేశ్‌పాండే సంగీతం అందించారు . డబ్బింగ్ ఎంత బాగా కుదిరిందంటే అసలు మనకు మరాఠి సీరిస్ డబ్బింగ్ చూస్తున్నట్లు అనిపించదు.

చాలాకాలం త‌ర్వాత ఓ ఫీల్‌గుడ్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చింది. అయితే ఇది త‌ర‌చూ వ‌చ్చే హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల‌కు చెందినది కాకుండా.. రెగ్యుల‌ర్‌గా వ‌చ్చేక్రైమ్‌, లవ్‌, ఇన్వేస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ల‌కు ఏమాత్రం సంబంధం లేని ఓ సింపుల్‌ ఫ్యామిలీ, ఎమోష‌న్ జాన‌ర్‌లో వ‌చ్చిన మ‌రాఠీ వెబ్ సిరీస్ ‘లంపన్’ (Lampan). తాజాగా ఓటీటీలోకి వ‌చ్చిన ఈ సిరీస్ డిజిట‌ల్ వీక్ష‌కుల‌ను తెగ ఆక‌ట్టుకోవ‌డ‌మే కాక వారిని వారి బాల్యంలోకి తీసుకెళ్లి నాటి వారి జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసి ఆనంద‌భాష్పాలు వ‌చ్చేలా చేస్తూ హృద‌యాల‌ను బ‌రువెక్కేలా చేస్తోంది. పైగా తెలుగు డ‌బ్బింగ్ అద్భుతంగా కుద‌ర‌డంతో మ‌నం మ‌రాఠీ సిరీస్ చూస్తున్నామ‌నే ఆలోచ‌న ఎక్క‌డా కూడా రాదు. అంత‌లా డ‌బ్బింగ్ సెట్ అయింది.

స్ట్రీమింగ్ ఎక్కడ..

లంపన్ వెబ్ సిరీస్ సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో తెలుగులో ఉంది.

చూడచ్చా...

ఏ మొహమాటం లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు.

Read More
Next Story