మారిటల్ రేప్ చుట్టూ తిరిగే.. : చిరైయా వెబ్ సిరీస్ రివ్యూ
x

'మారిటల్ రేప్' చుట్టూ తిరిగే.. : 'చిరైయా' వెబ్ సిరీస్ రివ్యూ

పడకగది వేధింపులు ఆగుతాయా?


"భార్య ఇష్టం లేకుండా జరిపే శృంగారం కూడా రేప్ లాంటిదే!" అని ఆమె మొత్తుకున్నా అతను వినిపించుకోలేదు. బయట సమాజంలో కవిత్వం చెప్పే మామ, ఇంట్లో పెత్తనం చలాయించే వదిన.. వీరి మధ్య ఒక ఆడపిల్ల బెడ్ రూమ్ లో ఎదుర్కొన్న నరకం కథ ఇది!

సమాజంలో పేరున్న కవి సుకుమార్ భ్రమర్ (సంజయ్ మిశ్రా). స్త్రీ స్వేచ్ఛ గురించి ఆయన రాసే కవితలకు ఫ్యాన్స్ ఎందరో. కానీ, ఆయన ఇంట్లోనే ఒక మహిళా స్వేచ్ఛ గాలిలో కలిసిపోతోందని ఆయనకు తెలుసా? పెద్ద కోడలు కమలేశ్ (దివ్య దత్తా) కనుసన్నల్లో నడిచే ఆ ఇంట్లోకి, చిన్న కొడుకు అరుణ్ (సిద్ధార్థ్ షా) భార్యగా అడుగుపెట్టింది పూజ (ప్రసన్న). పెళ్లి అంటే కలల ప్రపంచం అనుకున్న పూజకు, ఫస్ట్ నైట్ రోజే తన భర్త అసలు స్వరూపం బయటపడింది.

పెళ్లి తర్వాత జరిగే శోభనం కోసం అన్నీ సిద్ధమయ్యాయి. కానీ, తనకి ఒంట్లో బాగోలేదని, మానసికంగా తాను సిద్ధంగా లేనని పూజ తన భర్త అరుణ్ కు క్లియర్ గా చెప్పింది. కానీ అరుణ్ మాత్రం భార్య ఇష్టాన్ని లైట్ తీసుకున్నాడు. "భార్య ఇష్టం లేని శృంగారం రేప్ తో సమానం" అని పూజ హెచ్చరించినా, వాడు మొరటుగా ప్రవర్తించటం మొదలెట్టాడు. అప్పటి నుండి ప్రతి రోజూ శృంగారం పేరుతో పూజకు నరకం చూపించడం మొదలుపెట్టాడు.

ఈ విషయాన్ని తన అత్తగారికి, వదిన కమలేశ్ కి చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. "మొగుడు పెళ్ళాల మధ్య ఇవన్నీ కామన్" అన్నట్లుగా కొట్టిపారేశారు. భర్తను చూసినా, రాత్రి అవుతుందన్నా పూజ వెన్నులో వణుకు పుట్టే స్థితికి చేరుకుంది. సరిగ్గా అదే సమయంలో ఈ కొత్త జంటను హనీమూన్ కి పంపిస్తారు కుటుంబ సభ్యులు.

అక్కడ ఆ నాలుగు గోడల మధ్య జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఆ కుటుంబ సభ్యుల జీవితాలను, వారి ఆలోచనలను ఎలా మార్చేసింది అన్నదే ఈ కథలోని అసలు ట్విస్ట్. ఆ సంఘటన ఏమిటి? బయట మేధావిగా కనిపించే మామ, ఇంట్లో సైలెంట్ గా ఉండే అరుణ్.. వీరి అసలు రంగులు ఎలా బయటపడ్డాయి అనేది తెలియాలంటే ఈ వెబ్ సీరిస్ చూడాల్సిందే.

ఎనాలసిస్

హిందీలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన సిరీస్ లకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. కానీ, ఈ సారి 'మారిటల్ రేప్' అనే బోల్డ్ అండ్ సెన్సిటివ్ కాన్సెప్ట్ తో వచ్చిన సిరీస్ 'చిరైయా'. బెంగాలీ సూపర్ హిట్ సిరీస్ 'సంపూర్ణ'కి రీమేక్ గా వచ్చిన ఈ 6 ఎపిసోడ్ల కథ, ఒక సాంప్రదాయ కుటుంబంలో ఉండే చీకటి కోణాలను బయటపెట్టింది. తన చిన్న కోడలికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి, ఒక మధ్యతరగతి వదినమ్మ ఎలా రియాక్ట్ అయింది? ఆమెలో వచ్చిన మార్పు ఏంటి? అనేదే ఈ సిరీస్ హైలైట్.

వినడానికి ఇది చాలా పవర్‌ఫుల్ ఆర్క్. కానీ స్క్రీన్ మీద చూస్తే — ఇది ఒక అత్తా-కోడలు సీరియల్ స్టైల్ లో ప్యాకేజ్డ్ “సోషల్ మెసేజ్” లాగా అనిపిస్తుంది చాలా చోట్ల. అంటే…సబ్టిల్‌గా చూపించాల్సిన ఎమోషన్‌ను, డైలాగ్‌ల్లో బలవంతంగా ఇరికించటమే సమస్యగా అనిపిస్తుంది.

ఈ సిరీస్ ప్రధానంగా 'కమలేశ్', 'పూజ' పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. కమలేశ్ పాత్ర ఒక పక్కా విలేజ్ ఉమెన్ లాగా ఉంటుంది. భర్తను 'పింకీ కే పాపా' అని పిలుస్తూ, భార్య అంటే వంట గదిలో, బెడ్ రూమ్ లో సర్దుకుపోవాలి అని మిగతా మహిళలకు క్లాసులు పీకుతూ ఉంటుంది. కానీ, ఎప్పుడైతే తన కోడలు పూజపై తన తమ్ముడు అరుణ్ అత్యాచారానికి పాల్పడుతున్నాడని తెలిసిందో, అప్పుడు ఆమెలో అసలైన మార్పు మొదలవుతుంది.

అయితే, ఈ సిరీస్ లో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అరుణ్ పాత్ర 90వ దశకంలోని పాత విలన్ లాగా ఉంటుంది. భార్యపై దాడి చేసే ముందు అతను ఇచ్చే ఆ వికృత నవ్వు, డోర్ క్లోజ్ చేసే విధానం మరీ నాటకీయంగా అనిపిస్తాయి. ఇక పూజ పాత్ర విషయానికొస్తే, ఈ కాలపు 'జెన్-జీ' అమ్మాయిలా కనిపిస్తుంది. తను రేప్ కు గురవుతున్న సమయంలో కూడా "నేను నా శరీరం కంటే మిన్న" అని డైలాగులు చెప్పడం, ఎల్‌జిబిటిక్యూ (LGBTQ+) నిరసనల్లో పాల్గొనడం వంటివి ఒక జాయింట్ ఫ్యామిలీ సెటప్ లో కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తాయి. అలాగే కమలేశ్ పాత్రను కూడా మేకర్స్ మొదట్లో మరీ అమాయకురాలిగా చూపించారు. ఆమెకు చదువు రాకపోవడాన్ని తెలివితేటలు లేకపోవడంతో పోల్చడం, 'లెస్బియన్' అనే పదాన్ని తప్పుగా పలకడం ద్వారా చీప్ హ్యూమర్ కోసం ప్రయత్నించడం సిరీస్ స్థాయిని తగ్గించింది.

అలాగే కథనం సాగే కొద్దీ ఇది ఒక ఫిక్షన్ స్టోరీ కంటే ఎక్కువగా సామాజిక అవగాహన కల్పించే మీటింగ్స్ (NGO స్టైల్) లాగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో సిరీస్ టోన్ మరీ టీవీ సీరియల్ లాగా నాటకీయంగా మారిపోవడం, క్లైమాక్స్ మరీ భారీగా ఉండటం కథలోని సహజత్వాన్ని కొంచెం దెబ్బతీశాయి. అయినప్పటికీ, 'కన్సెంట్' (సమ్మతి) అంటే ఏమిటో వివరించే చర్చలు నేటి కాలానికి చాలా అవసరమనిపిస్తాయి.

ఏదైమైనా ...

చిరైయా ఒక మంచి సోషల్ మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నించింది కానీ, అది పాత కాలపు సీరియల్ పద్ధతిలోనే సాగింది. ఆడపిల్లలు ఎదుర్కొంటున్న హింసను కేవలం ఒక పాయింట్ గా కాకుండా, ఎమోషనల్ గా కూడా కనెక్ట్ చేయడంలో కొంచెం తడబడింది. ఏది ఏమైనా మారిటల్ రేప్ గురించి సమాజంలో చర్చ జరగడానికి ఇలాంటి సిరీస్ లు రావాల్సిందే.

ఎక్కడ చూడచ్చు..

జియో హాట్ స్టార్ లో తెలుగులో ఉంది.

Read More
Next Story