
మన ఫోన్లే సినిమాలను చంపేస్తున్నాయా?
హాలీవుడ్ స్టార్స్ సంచలన విశ్లేషణ!
మీరు సినిమా చూస్తున్నప్పుడు పక్కనే పిల్లలు అల్లరి చేస్తున్నారా? కుక్కలు మొరుగుతున్నాయా? మధ్యలో ఫోన్ చూస్తున్నారా? అయితే మీరు సినిమాను ‘చూడటం’ లేదు, కేవలం ‘వింటున్నారు’ అని అర్థం. ఓటీటీ, స్మార్ట్‌ఫోన్ల రాకతో సినిమా కళ ఎలా దెబ్బతింటోంది, ప్రేక్షకులను ఆకర్షించడానికి మేకర్స్ ఎలాంటి తంటాలు పడుతున్నారో హాలీవుడ్ దిగ్గజాలు మ్యాట్ డామన్, బెన్ అఫ్లెక్ రీసెంట్ గా ఓ ఇంటర్వూలో కొన్ని నిజాలను బయటపెట్టారు.
ఫోన్ల వల్ల కథలు మారిపోతున్నాయి!
సినిమా అంటే ఒకప్పుడు రెండు మూడు గంటల పాటు వేరే లోకంలో విహరించడం. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. ఇంట్లో గదిలో లైట్లు ఆన్ చేసి, రకరకాల డిస్టర్బెన్స్ ల మధ్య సినిమా చూడటం వల్ల ప్రేక్షకుల అటెన్షన్ తగ్గిపోయిందని మ్యాట్ డామన్ ఆవేదన వ్యక్తం చేశారు.
మ్యాట్ డామన్ మాటల్లో:
"ఇంట్లో సినిమా చూసే అనుభవం చాలా భిన్నంగా ఉంటుంది. గదిలో లైట్లు ఆన్ చేసి ఉంటాయి, చుట్టూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది.. పిల్లలు అటు ఇటు పరిగెడుతుంటారు, కుక్కలు మొరుగుతుంటాయి. థియేటర్‌లో లాగ దృష్టి , శ్రద్ద సినిమాపై ఇంట్లో పెట్టలేం."
"ఇదంతా సినిమాలను మనం ఎలా తీస్తామనే దానిపై ప్రభావం చూపుతోంది. ఉదాహరణకు, నెట్‌ఫ్లిక్స్ తీసుకుంటే.. మేము నేర్చుకున్న యాక్షన్ సినిమాల పద్ధతి వేరు. సాధారణంగా సినిమాలో మూడు ప్రధాన భాగాలు (Three acts) ఉంటాయి. మొదటి అంకం, రెండో అంకం, ఆఖరి అంకం. క్లైమాక్స్‌లో పేలుళ్లు, భారీ హంగామా కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేసేవాళ్లం."
"కానీ ఇప్పుడు వాళ్లు (స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్) ఏమంటున్నారంటే.. సినిమా మొదలైన మొదటి ఐదు నిమిషాల్లోనే ఒక పెద్ద యాక్షన్ సీన్ కావాలని కోరుతున్నారు. ప్రజలు టీవీకి అతుక్కుపోవాలని వాళ్ల ఆశ."
"అంతేకాదు, సినిమాలో ప్లాట్‌ను (కథను) మూడు నాలుగు సార్లు డైలాగుల ద్వారా మళ్ళీ మళ్ళీ చెప్పిస్తున్నారు. ఎందుకంటే ప్రజలు సినిమా చూస్తూనే ఫోన్లు వాడుతుంటారు. దీనివల్ల మేము కథను చెప్పే పద్ధతి దెబ్బతింటోంది." అని ఆవేదనతో చెప్పారు.
బెన్ అఫ్లెక్ మాటల్లో:
"మరోవైపు 'ది లాస్ట్ డ్యుయల్' (The Last Duel) వంటి సినిమాలను ఇప్పుడు తీస్తే, చూస్తే, అవి ఏమీ ఇంపాక్ట్ చూపలేకపోతున్నాయి. ఆ సినిమా కథ చాలా తీవ్రంగా, విషాదభరితంగా ఉంటుంది. తమ పిల్లవాడు హత్యకు గురయ్యాడని తెలుసుకున్న తండ్రి కథ అది. కార్లలో కూర్చుని ఎవరూ ఏమీ మాట్లాడకుండా ఉండే సుదీర్ఘమైన సీన్లు ఉంటాయి. అలాంటి మాస్టర్‌ఫుల్ సినిమాలు ఇప్పుడు అరుదైపోతున్నాయి.
" 'ది టౌన్' (The Town) వంటి సినిమాల్లో మొదటి ఐదు నిమిషాల్లోనే యాక్షన్ సీన్ ఉంటుంది. అది ప్రేక్షకులను సినిమాలోకి లాగడానికి వాడే ఒక ట్రిక్. ఓటిటిలో ఇలాంటివి అవసరం. కానీ థియేటర్ ప్రేక్షకులకు ఇవన్నీ అవసరం లేదనిపిస్తుంది."
"సినిమా కల్చర్ మనకు నచ్చిన కాలంలోలాగానే ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ ప్రజల అలవాట్లను మనం మార్చలేము, కాబట్టి సరఫరా, డిమాండ్‌కు తగ్గట్టుగా మనం మారాలి. ప్రజలు ఇంట్లో కూర్చుని వాట్సప్ వీడియోలు చూస్తూ, టిక్‌టాక్ (TikTok) చూస్తూ సినిమాలు చూడాలనుకుంటే, వాళ్ళు అలాగే చేస్తారు. మనం చేయగలిగిందల్లా సినిమాను వీలైనంత బాగా తీయడమే."
"టీవీలు వచ్చినప్పుడు కూడా థియేటర్లకు వెళ్ళే వారి సంఖ్య తగ్గింది. అయినా ప్రజలు థియేటర్‌కు వెళ్తూనే ఉన్నారు. ఎందుకంటే అదొక గొప్ప అనుభవం. నేను ఇప్పటికీ 'ది ఒడిస్సీ' (The Odyssey) వంటి సినిమాలను థియేటర్‌లోనే చూస్తాను."
"ఒక కుటుంబం థియేటర్‌కు వెళ్తే కనీసం 100 డాలర్లు ఖర్చు అవుతుంది, అదే ఓటీటీలో అయితే నెలకు 20 డాలర్లకే అన్నీ వస్తాయి. స్ట్రీమింగ్ సర్వీసుల వల్ల రిస్క్ తీసుకోవడం తగ్గింది. వాళ్ళు ఇంట్లోనే చూడటానికి ఇష్టపడతారు."
ప్రయోగాలకు నో: థియేటర్లలో సినిమా రిలీజ్ చేయాలంటే పబ్లిసిటీకే సినిమా బడ్జెట్ అంత ఖర్చు అవుతోంది. అందుకే భారీ బడ్జెట్ సినిమాలు తప్ప, ప్రయోగాత్మక చిత్రాలు థియేటర్లకు రావడం లేదని బెన్ అఫ్లెక్ వివరించారు.
"కానీ దీనికి ఒక మంచి వైపు కూడా ఉంది. థియేటర్‌కు రమ్మని ప్రజలను బలవంతం చేయాల్సిన అవసరం లేని ప్రయోగాత్మక సినిమాలను ఇప్పుడు స్ట్రీమింగ్‌లో తీయవచ్చు."
ఎన్ని అడ్డంకులు ఉన్నా, సినిమాను వీలైనంత అద్భుతంగా తీయడమే మన బాధ్యత అని వారు స్పష్టం చేశారు.
సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక సామాజిక అనుభవం. ఆ అనుభవాన్ని ఓటీటీలు రీప్లేస్ చేయగలవా? లేక థియేటర్లు మళ్ళీ పుంజుకుంటాయా? ఈ హాలీవుడ్ హీరోల అభిప్రాయంపై మీరు ఏమంటారు? మీ స్పందనను కామెంట్ చేయండి!

