
'బాహుబలి' కంటే ముందే తెలుగు పాన్ ఇండియా స్టార్
300 సినిమాలు, కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు..
నేడు ప్రభాస్, అల్లు అర్జున్ వంటి హీరోలు పాన్ ఇండియా స్టార్లంటూ ఉత్తరాదిని ఊపేస్తుంటే మనం మురిసిపోతున్నాం. కానీ సరిగ్గా వంద ఏళ్ల క్రితమే, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా బొంబాయి వెళ్లి, హిందీ చిత్రసీమను తన గుప్పిట్లో పెట్టుకున్న ఒక తెలుగు వీరుడు ఉన్నాడనే నిజం ఎంతమందికి తెలుసు?. ఆయన ఎవరో కాదు.. కరీంనగర్ మట్టిలో పుట్టి, భారతీయ సినిమా రారాజుగా వెలిగిన పైడి జైరాజ్. రాజమౌళి సినిమాల్లో చూసే భారీ యాక్షన్ సీన్లను ఆ కాలంలోనే డూప్ లేకుండా చేసి చూపించిన ధీశాలి ఆయన.
బొంబాయిని ఏలిన కరీంనగర్ కుర్రాడు!
పైడిపతి జైరుల నాయుడుగా కరీంనగర్‌లో జన్మించిన ఈయన, ఇంజనీర్ కావాలన్న ఇంట్లో వారి మాటను కాదని సినిమాలపై వ్యామోహంతో బొంబాయి రైలెక్కారు. సరోజినీ నాయుడు వంటి హేమాహేమీలతో బంధుత్వం ఉన్నా, ఎక్కడా ఆ పేరు వాడుకోకుండా స్టూడియోల చుట్టూ తిరిగారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, ఎడిటర్‌గా సినిమాలోని అన్ని విభాగాల్లో వేలు పెట్టి 'ఆల్ రౌండర్' అనిపించుకున్నారు. అప్పట్లో పృథ్వీరాజ్ కపూర్ వంటి స్టార్ హీరోలు కేవలం డైలాగులకే పరిమితమైతే, జైరాజ్ మాత్రం కత్తి పట్టి గుర్రమెక్కి యుద్ధాలు చేస్తూ వెండితెరపై నిప్పులు కురిపించేవారు.
తన సహ నటులు పృథ్వీరాజ్ కపూర్, అశోక్ కుమార్ లాంటి వారు సున్నితమైన ప్రేమ సన్నివేషాల్లో నటిస్తున్న సమయంలో పైడి జైరాజ్ వెండి తెరపై యాక్షన్ సీన్స్, స్టంట్స్ చేశారు. హైదరాబాద్ వ్యాయామశాలల్లో పొందిన తర్పీదు నటనా జీవితంలో ఆయనకు తోడ్పడింది
అమితాబ్ కంటే ముందే దాదాసాహెబ్ ఫాల్కే!
భారతీయ సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డును అందుకున్న అచ్చతెలుగు వ్యక్తి మన జైరాజ్. హిందీ, గుజరాతీ, మరాఠీ, ఇంగ్లీష్ ఇలా ఏకంగా ఆరు భాషల్లో 300కు పైగా సినిమాలు చేసి వెండితెరకు కొత్త అర్థం చెప్పారు. ఈ రోజు మనం హైదరాబాద్‌లో సినిమా షూటింగులు చేసుకుంటున్నామంటే, నాడు చెన్నారెడ్డి వంటి నేతలతో మాట్లాడి పరిశ్రమను ఇక్కడికి రప్పించడంలో ఆయన చేసిన కృషి మరువలేనిది.
తెలుగు సినిమాల్లో ...?
300 కు పైగా చిత్రాల్లో నటించిన పైడి జైరాజ్ తన మాతృభాష తెలుగులో మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించలేoదంటే నమ్ముతారా?. 'చిత్తూరు నాగయ్య'తో ఓ తెలుగు సినిమాకు అగ్రిమెంట్ పై సంతకాలు జరిగినా ఆ తర్వాత కొద్ది రోజులకే నాగయ్య మరణంతో ఆ చిత్ర నిర్మాణం జరగలేదు.
చిత్తూరు నాగయ్యతో కనకదుర్గ అనే చిత్రంలో నటించాలని ఆయన అనుకున్నారు. కానీ నాగయ్య మరణంతో ఆ ప్రతిపాదన ఆగిపోయింది. అయితే తెలుగు చిత్రం 'పల్లెటూరి పిల్ల' హిందీ రీమేక్ అయిన 'ఇన్సానియత్'లో ఆయన ఒక పాత్రను పోషించారు.
పైడి జైరాజ్ కొడుకు పైడి దిలీప్ రాజ్ ఆస్మాన్ మహల్ వంటి కొన్ని చిత్రాల్లో కథానాయకుడుగా నటించారు. మరో అబ్బాయి ఇంజనీర్ గా అమెరికాలో పనిచేశారు.
ఆయన నటించిన రెండు సినిమాలు ఆనాటి ప్రభుత్వాల నిషేధానికి గురయ్యాయి. ముంబాయి నేత మిల్లు కార్మికుల దుర్భర జీవితాల ఆధారంగా నిర్మించిన 'మిల్ మజ్దూర్' (1934) అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నిషేదించింది. ఈ సినిమాలో ప్రసిద్ద హిందీ రచయిత 'మున్షీ ప్రేమ్ చంద్'తక్కువ నిడివిగల పాత్రలో కనిపించారు. మహాత్మా గాంధీ హత్యోదంతం నేపథ్యంగా 'నాథురాం గాడ్సే' ప్రధాన పాత్ర గా వచ్చిన ఫిక్షన్ సినిమా 'నైన్ హవర్స్ టు రామా' (1963)ను భారత ప్రభుత్వ నిషేధించింది.
ఈ సినిమాలో జైరాజ్ గాంధీ ప్రధాన అనుచరుడు, ఆనాటి ప్రముఖ పారిశ్రామిక వేత్త జి.డి.బిర్లా పాత్ర పోషించారు. ఈ సినిమా సెన్సార్ బోర్డ్ ముందుకు రాగా ఆనాటి కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి 'బెజవాడ గోపాల్ రెడ్డి' సెన్సార్ బోర్డ్ ప్రివ్యూ షోకు ప్రధాని నెహ్రూ, ఇతర మంత్రులను ఆహ్వానించారు. అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా ఈ సినిమా ప్రివ్యూ చూశారు. ఈ సినిమా నిషేధం పై ఆ రోజుల్లో రాజ్యసభలో జరిగిన చర్చ లో నెహ్రూ సమాధానం ఇచ్చారు.
చివరి వరకు మాయని మచ్చ లేని మనిషి!
తొంభై ఏళ్ల సుదీర్ఘ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినా, ఆయన వ్యక్తిత్వంపై ఒక్క చిన్న మచ్చ కూడా పడలేదు. సినిమా ప్రపంచం ఎంతగా మారినా, తనను తాను కొత్తగా మలుచుకుంటూ ముంబైలోనే స్థిరపడి 2000వ సంవత్సరంలో కన్నుమూశారు. రవీంద్రభారతిలో ఆయన పేరుతో ఉన్న థియేటర్ మనకు ఆయన గొప్పతనాన్ని నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటుంది.
తెలుగువాడి సత్తాను దేశం నలుమూలల చాటిన ఈ లెజెండ్ గురించి తెలుసుకోవడం మన బాధ్యత!

