
ప్రియదర్శి “మిత్ర మండలి” మూవీ రివ్యూ
నవ్విస్తుందా? నొప్పించిందా?
నారాయణ (వీటీవీ గణేశ్)కు చాలా మంది లాగే తన కులం అంటే పిచ్చి. అయితే అది కాస్త మోతాదు దాటి ఉంటుంది. తన కులం కాకపోతే చివరికి అవసరమైనప్పుడు రక్తం తీసుకోవటానికి కూడా ఇష్టపడడు. అలాగే తన కులబలంతోనే లోకల్ ఎమ్మల్యే అవ్వాలని ప్లాన్ చేస్తాడు. అందుకు తగ్గ ఏర్పాట్లు అన్ని జరగుతాయి. అయితే ఊహించని ట్విస్ట్ తన కూతురు స్వేచ్ఛ (నిహారిక) రూపంలో వస్తుంది.
ఆమె తన కులానికి చెందని ఓ కుర్రాడిని ప్రేమించి అతనితో జంప్. అయితే ఈ విషయం బయిటకు వస్తే తన కులం ఓట్లు పోతాయి. తను ఎమ్మల్యే కాడు. అందుకే ఆ లేచిపోయిన విషయాన్ని దాచిపెట్టి తన కూతురు కిడ్నాప్ అయ్యినట్లుగా చెప్పి ఎస్సై సాగర్ (వెన్నెల కిశోర్)ని రంగంలోకి దింపుతాడు. అతనికి తన కూతురుని పట్టుకుని వస్తే మంచి ఎమౌంట్ ఇస్తానని ప్రామిస్ చేస్తాడు. దాంతో సాగర్ వీరావేశంతో రంగంలోకి దూకుతాడు. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ (సత్య) సాయిం తీసుకుంటాడు.
ఎమ్మల్యే ఉండే ఏరియా కు చెందిన బేవర్స్ గాళ్లు అయిన చైతన్య (ప్రియదర్శి), అభయ్ (రాగ్ మయూర్), సాత్విక్ (విష్ణు ఓ.ఐ), రాజీవ్ (ప్రసాద్) లను ఐడెంటిఫై చేస్తాడు. ఇంతకీ ఈ నలుగురిలో స్వేచ్ఛ బోయ్ ప్రెండ్ ఎవరు ? అలాగే ఈ కిడ్నాప్ గొడవలో మిగతా ముగ్గురూ ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు? చివరకు నారాయణ ఏం చేశాడనే విషయాల్ని తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
గత కొంతకాలంగా తెలుగు సినిమాల్లో ఒక కొత్త ఫార్ములా నడుస్తోంది — “సింపుల్ స్టోరీ + రాండమ్ జోక్స్ + హడావుడి టోన్ ”. “జాతి రత్నాలు” లాంటి విజయాలు ఆ మోడల్‌కి బూస్ట్ ఇచ్చాయి. దాంతో చాలా దర్శకులు “కథ అవసరం లేదు, పంచ్ ఉంటే చాలు” ఫిక్స్ అయ్యిపోయారు. ఈ “మిత్రమండలి” కూడా అదే ఫార్ములా మీద పుట్టిన సినిమా — కథ కన్నా వరస జోక్స్ మీద ఫోకస్ చేసారు. అయితే ఆ జోక్ లు ఏమీ అనుకున్న స్దాయిలో పేలకపోవటంతో చూసేవారికి విసుగు తెప్పించింది.
కథ లేనిదాన్ని కథగా చెప్పడం అనేది సాధారణంగా self-aware comedyగా పని చేయొచ్చు. కానీ “మిత్రమండలి” దాన్ని లేజీ ఎక్సక్యూజ్ గా వాడింది. అంటే “మేము సిల్లీగా రాసాం, కాబట్టి లాజిక్ అడగొద్దు” అని మనని లాక్ చేయటానికి ప్రయత్నించింది.
దానికి తోడు సినిమాలోని గ్యాగ్స్ అన్నీ విడివిడిగా ఉన్నాయి — అవి కథతో కనెక్టివిటి లేదు. ఉదాహరణకు వెన్నెల కిషోర్ ఎంట్రీ, “Very Important Character” జోక్, ఫోన్ నెంబర్ సీన్, ఇవి వేరువేరు సన్నివేశాల్లా ఫన్నీగా ఉన్నా, మొత్తం కధలో కలిసి నవ్వించలేవు.
ఇక్కడ డైరెక్టర్ జోక్ వెయ్యలేదు, జోక్ పరంపర వేశాడు. ఇది ఒక మ్యూజిక్ ఆల్బమ్ లా — ప్రతి పాట catchy గా ఉన్నా, వాటి మధ్య theme లేదు. దాంతో ఏదీ నచ్చినట్లు అనిపించదు.
లౌడ్‌నెస్‌నే ఎనర్జీ అనుకునే పొరపాటు
ప్రారంభ సన్నివేశాల నుంచే "తుట్టే కుల నారాయణ" బ్లాక్ బిగ్గరగా, ఎక్కవ నోటితో, లౌడ్‌గా ఉంటుంది. సినిమా మొదటి ఐదు నిమిషాల్లోనే ప్రేక్షకుడి చెవులు విసుగుతో నిండిపోతాయి. ఈ లౌడ్ టోన్ తగ్గకుండా కొనసాగుతుంది. "సినిమా వాయిస్ పెరిగితే కామెడీ పెరుగుతుంది" అన్న భ్రమతో. కానీ నిజమైన కామెడీ ఎప్పుడూ రిథమ్‌లో ఉంటుంది — నవ్వు అంటే టెంపో, టోన్, బీట్. ఇక్కడ అది పూర్తిగా దారితప్పింది.
సినిమా ఫస్ట్ హాఫ్‌లోనే మూడు ఒకే రకమైన సన్నివేశాలు రిపీట్ అవుతూంటాయి. ఫ్రెండ్స్ ఫన్, కిడ్నాప్ డ్రామా, పోలీస్ గ్యాగ్స్. దాంతో కథ ముందుకు కదలదు, మొత్తం సినిమా ఒక సర్కిల్‌లో అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. దీన్నే “progression-less narrative” అని రైటింగ్ భాషలో అంటారు. ప్రేక్షకుడికి క్షణిక నవ్వు వస్తుంది, కానీ కథ ఎక్కడా కదలదు.
దానికి తోడు మొత్తం కథ దాదాపు ఒకే సెట్‌లో నడుస్తుంది. సినిమా స్థల పరిమితి దానిని visual fatigue లోకి నెడుతుంది. సీన్ తర్వాత సీన్ మారినా, ఫ్రేమ్ మారదు. దాంతో సినిమా కేవలం ఒక స్టేజ్ డ్రామా ఫీలింగ్ ఇస్తుంది.
సాధారణంగా హాస్యం అంటే setup – tension – release అనే రిథమ్ ఉంటుంది. ఈ సినిమాలో టెన్షన్ లేకపోవడం వల్ల ప్రతి పంచ్ కూడా లైఫ్ లేకుండా వచ్చి పోతుంది. జోక్ ల్యాండింగ్ డిలే అవడం వల్ల ఎనర్జీ డ్రాప్ అవుతుంది. సెకండ్ హాఫ్‌లో ఇది మరింత తీవ్రమవుతుంది. కామెడీ సీన్స్ ఉన్నాయి, కానీ నవ్వులే మాయమయ్యాయి. ఇది "comedy fatigue" కి పరాకాష్ట.
ఎవరెలా..
ప్రియదర్శి “బలగం”, “కోర్ట్” తర్వాత మంచి స్క్రిప్ట్ ఎంచుకోవాల్సింది. ఇక్కడ హీరోగా కనిపించినా, కథలో వెయిట్ లేక వర్కవుట్ కాలేదు.
విష్ణు ఓ.ఐ కొన్ని సార్లు నవ్విస్తాడు, రాగ్ మయూర్ టైమింగ్ బాగుంది, కానీ ప్రసాద్ బెహరా అనుకున్న ఎఫెక్ట్ ఇవ్వలేదు. వెన్నెల కిషోర్ – పోలీస్ పాత్రలో బాగానే ఎంటర్‌టైన్ చేశాడు,సత్య జస్ట్ ఓకే. హీరోయిన్ గా చేసిన నిహారిక NM ఎంట్రీ మాత్రం ఫ్లాట్‌గా ఉంది, గుర్తుండిపోయే సీన్ ఏదీ లేదు.
టెక్నికల్‌గా ...
సినిమాకు కథ, కథనమే దెబ్బ కొట్టింది. దానికి తోడు మ్యూజిక్, కెమెరా వర్క్ రెండూ ఆకట్టుకోవు. డైరక్షన్ సీరియస్ లేదు. ఎడిటింగ్ చాలా చోట్ల ల్యాగ్ లను పట్టించుకోలేదు. నిర్మాణ పరంగా కూడా సినిమా పెద్ద చెప్పుకునేందుకు ఏమీ లేదు.
ఫైనల్ థాట్
ఇది “కథ లేని కథ” కాదు — “సెన్స్ లేని సెన్స్ ఆఫ్ హ్యూమర్.” జోక్ అనేది ఒక క్షణం మాత్రమే కాదు, ఆ క్షణం తర్వాత మిగిలే భావం కూడా.
అది ఇక్కడ లేదు. ఇలాంటి బలహీనతను “ఇదే మా స్టైల్” అంటూ టీమ్ గొప్పగా చెప్పుకుంటే చేసేదేముంటుంది.