మోహన్ లాల్ ‘మలైకోటై వాలిబన్‌’ మినీ రివ్యూ
x

మోహన్ లాల్ ‘మలైకోటై వాలిబన్‌’ మినీ రివ్యూ

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తీసిన ‘మలైకోటై వాలిబన్’ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. అయితే ఇది అలరించిదా? కథ వస్తువు ఏంటీ.. ఎలా తీసారు..


యుద్దంలో అజేయుడే సర్వ శక్తిమంతుడైన యోధుడు, సర్వం కోల్పోతాడా..అవకాశం లేదంటారు కానీ వాలిబన్ మాత్రం అలాంటోడే. ‘అంగమలి డైరీస్‌’, ‘జల్లికట్టు’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు లిజో జోస్‌ పెల్లిస్సేరి ఈ సినిమా తీసాడు. చాలా సంక్లిష్టమైన విషయాన్ని చాలా సీదాసీదాగా చెప్తున్నాను అనుకున్నాడు. కానీ అది మరింత సంక్లిష్టమైపోతుందని ఊహించి ఉండడు. అది ఎంతలా అంటే మోహన్ లాల్ సూపర్ స్టార్ డం కూడా బ్రతికించలేనంత విసిగించేలా.

ప్రయోగాత్మక కథలు, చారిత్రక చిత్రాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే మోహన్ లాల్.. ఇప్పుడు ఈ పీరియాడిక్ సినిమా అనగానే ఉత్సాహం చూపించి ఉండవచ్చు. 'కంప్లీట్ యాక్టర్' అనిపించుకోవాలనే తాపత్రయంలో ఆయన ఈ సినిమా ఒప్పుకుని ఉండచ్చు. ఆ ప్రాసెస్ లో కథ కన్నా డైరక్టర్ నే ఎక్కువ నమ్మినట్లున్నారని అర్దమవుతుంది. దాంతో డైరక్టర్ చెప్పిన కథ లో ఉన్న నైరాశ్యం ఆయన గమించకపోయి ఉండపోవచ్చు. ఇంతకీ ఏమిటా కథ..అంటే..
అదో ఎడారి ప్రాంతం..దానిపేరు 'మలైకోటై'. అక్కడ ఒక కుస్తీ పోటీ వీరుడు (రెజ్లర్) తన కండబలం చూపించి అందరినీ భయపెడుతూంటాడు. బలహీనులు అతని ధాటికితట్టుకోలేక అతని చెప్పిన పనులు చేస్తూంటాడు. ఆ టైమ్ లో అక్కడికి మరో కుస్తీ పోటీ వీరుడు వాలిబన్ అక్కడికి తన తమ్ముడితో కలిసి వస్తాడు‌.
వీళ్లిద్దరికీ యాజ్ యూజవల్ గా ఫైట్ జరుగుతుంది. మనం ఊహించినట్లే ఈ పోటీలో వాలిబన్ గెలిచి 'మలైకోటై వాలిబన్' గా నిలుస్తాడు. అయితే ఆ గెలుపే అతనికి శత్రువులను తెచ్చిపెడుతుంది. అక్కడ ఉన్న ఆడవాళ్లు అతనిపై మనస్సు పడటంతో శత్రువులు సంఖ్య పెరుగుతుంది. అయితే వాటిని వాలీబన్ పట్టించుకోడు.
మరో చోట తాను విద్య నేర్చుకున్న సంస్థానాన్ని ఆక్రమించుకున్న బ్రిటిష్‌ వారితో పోరాటం మొదలెడతాడు. బ్రిటీష్ వారి చేతిలో బందీలుగా ఉన్న కొంతమంది వీరులని కాపాడతాడు. అయితే అక్కడా కొంచెం అటూ ఇటూలో అదే పరిస్దితి. వాలిబన్ కి తెలియకుండా అతని గురువు మరో శత్రువుని తయారు చేస్తాడు. ఈలోగా వాలబన్ తమ్ముడు చిన్న ఓ అమ్మాయిని ఇష్టపడతాడు. వారి పెళ్ళికి వాలబన్ అంగీకరిస్తాడు.
అప్పుడు మరి కొందరు శత్రువులు. ఇలా గ్రామాలు తిరుగుతూ దేశాలు సంచరిస్తూ వాలిబన్ సాధించింది ఏమిటి...శత్రువుల వలన అతనికి ఏమైనా ప్రమాదాలు ఎదురయ్యాయా..చివరికి వాలిబన్ జీవితం ఎలా ముగిసింది, వాలిబన్‌ మల్లయోధుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది . ఆ గురువు గతమేమింటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
వాస్తవానికి ఇది క్యారక్టర్ డ్రైవన్ ప్లాట్. ఆ క్యారక్టర్ చుట్టూ అది సృష్టించే సంఘటనలు బేస్ చేసుకుని కథ చేసారు. అయితే ఆ కథ ఎటు నుంచి ఎటు వెళ్తోందో చూసుకోలేదు. అలాగే స్క్రీన్ ప్లే కొత్తగా చేద్దామనో మరి ..రొటీన్ ని బ్రేక్ చేద్దామనుకునో కానీ స్క్రీన్ ప్లే ఎంత బోర్ కొడుతుందంటే మన కర్శర్ ని స్క్రీన్ పై లాగుతూనే ఉంటాము.
ఫలానా ప్రాంతం, ఫలానా టైమ్ అని స్పెసిఫై చేయకుండా ఓ యోధుడి ప్రయాణంగా చూపే ప్రయత్నం చేసారు. ఇదో జానపద కథ అనిపిస్తుంది కొన్ని సార్లు. “నువ్వు ఇప్పుడు దాకా చూసింది నిజమే,చూడనిది అబద్ధం. అలాగే ఇప్పటి వరకు మీరు చూసినవన్నీ అబద్ధాలు, ఇప్పుడు మీరు చూడబోయేది మాత్రమే నిజం,” వంటి డైలాగులు ట్రికీగా ఉంటూ ఆలోచనలో పడేస్తాయి. అధివాస్తవికత , వాస్తవికత రెండూ ఒకే కథలో కథనమై కన్పిస్తూ కన్ఫూజన్ లో పడేస్తాయి.
కొన్నిసార్లు ఈ కథనం , యేది వాస్తవమో , యేది అధివాస్తవమో తేల్చుకోమని చూసేవాళ్లకు సవాల్ విసురుతూంటుంది. మార్షల్ ఆర్ట్స్, వార్, డ్రామా, ఫాంటసీ ఇలా సినిమా జానర్స్ తరుచుగా మారిపోతూంటాయి. అన్ని సెంట్రల్ క్యారక్టర్ తో ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉండచ్చు . కానీ ఫలితం ఏముంది. దాంతో ఈ సినిమా కొన్ని సార్లు ఒత్తిడికి గురిచేస్తుంది. అప్పటి చరిత్ర తలకిందులుగా చెప్తున్నారా అనే డౌట్ వస్తుంది. వాలీబన్ సక్సెస్ అందుకోలేకపోతున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇదే డైరక్టర్ కోరుకుంటే ఆ మేరకు సక్సెస్ అయ్యినట్లే.
అలాగని పూర్తిగా కొట్టిపారేయలేము. దాదాపు ప్రతీ ఫ్రేమ్, షాట్ కంపోజిషన్ ఫెరఫెక్ట్ గా సెట్ చేసి ఉంటాయి. వైడ్ షాట్ లలో ఎక్కువ కథ చెప్పే ప్రయత్నం చేసారు. ముఖ్యంగా లైటింగ్, కలర్స్, ప్రొడక్షన్ డిజైన్ గురించి అయితే చెప్పక్కర్లేదు. డైరక్టర్ మాస్టర్ క్రాఫ్ట్స్ మెన్ అని అర్దమవుతుంది.మోహన్ లాల్ అయితే ప్రాణం పెట్టేసాడు. స్క్రిప్టే అతనికి పెద్దగా కలిసి రాలేదు. బెటర్ లక్ నెక్ట్స్ టైమ్.
చూడచ్చా
మోహన్ లాల్ అభిమానులు మొహమాటపడుతూ చూడదగ్గ సినిమా . మిగతా వాళ్లు ఫ్రేమ్ లు, షాట్స్ చూసి మురిసిపోయే సినిమా. అంతకు మించి ఎక్సపెక్ట్ చేస్తే వాలిబన్ వచ్చి మన ముక్కుపై ఓ ముష్టిఘాతం ఇచ్చేసి పోతాడు.
ఏ ఓటిటిలో ..
‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో స్ట్రీమింగ్‌


Read More
Next Story