తెలంగాణ రాజకీయాల్లో సినిమా స్టార్లు మాయం
x

తెలంగాణ రాజకీయాల్లో సినిమా స్టార్లు మాయం

ఎలక్షన్ టైంలో సినిమావాళ్ల క్యాంపైన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుంది. అయితే ఈ మధ్యన ఆ ఊపు తగ్గింది. మొన్న తెలంగాణా ఎలక్షన్స్ లో సినిమావాళ్ల ప్రచారాలు కనపడలేదు.

సినిమాలకు, రాజకీయాలకు అన్నిచోట్లా అవినాభావ సంబంధం ఉంటూనే వస్తోంది. ముఖ్యంగా స్టార్స్ కు గుడి కట్టి, కటౌట్స్ కు పాలాభిషేకాలు చేసే మనదేశంలో అది మరికాస్తంత ఎక్కువే. దక్షిణ భారతదేశంలో కళాకారులు రాజకీయాల్లోకి రావడంతో ఈ ట్రెండ్ ఊపందుకుని కొనసాగుతోంది. ముఖ్యంగా ఎలక్షన్ టైమ్ లో సినిమావాళ్లు క్యాంపైన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటూ వస్తోంది. సినిమావాళ్లు మేము సైతం అన్నట్లు తమకు నచ్చిన పార్టీ ప్రచారం కోసం యాడ్స్ చేయటమే కాకుండా సినిమాలు సైతం రూపొందిస్తూ సపోర్ట్ చేస్తూంటారు. అయితే ఈ మధ్యన ఆ ఊపు తగ్గింది. మొన్న తెలంగాణా ఎలక్షన్స్ లో సినిమావాళ్ల ప్రచారాలు కనపడలేదు. ఏమో ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఏది గెలిచి ఏమి ముంచుకు వస్తుందో అన్నట్లు ఆగిపోయారు. అయినా మేజర్ తెలుగు సినిమా వాళ్ల దృష్టి ఆంధ్రా ఎలక్షన్స్ పైనే ఉంటుంది.

ఆంధ్రా ఎలక్షన్స్ లో ప్రధానంగా సినిమా హీరో జనసేన అధ్యక్ష్యుడు పవన్ కళ్యాణ్ పోటీకి దిగుతూండటంతో చాలా మంది సినిమా వాళ్లు ఆయనకు సపోర్ట్ గా ప్రచారంలోకి వస్తున్నారు. మరో ప్రక్క తెలుగుదేశం పార్టీ తరపున స్టార్ హీరో బాలకృష్ణ రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సినిమా వాళ్లు అంటే ప్రధానంగా రోజా, పోసాని కృష్ణ మురళి మాత్రమే కనపడతారు. సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రకరకాల వాదాలు, వివాదాలతో జనసేన పార్టీలోకి వెళ్లిపోయారు. దాంతో సామాన్యులే మన పార్టీ స్టార్ క్యాంపెయినర్లు అంటోంది ఆ పార్టీ. అదే తెలంగాణాకు ఎలక్షన్స్ కు వస్తే సినీ పరిశ్రమ మొహం చాటేసిందనే చెప్పాలి.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత విజయశాంతి, బాబూ మోహన్‌ మాత్రమే సినీ రంగం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. అలాగే గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అయితే ఒక్క బాబూ మోహన్‌ మాత్రమే పోటీ చేశారు. ఇక మొన్న జరిగిన తెలంగాణా ఎన్నికల్లో సినిమావాళ్లు ఎక్కువ మందే వస్తారని ఊహాగానాలు మీడియాలో వచ్చాయి. నిర్మాతలు దిల్‌ రాజు, రామ్‌ తాళ్లూరి, దర్శకుడు శంకర్‌, సినీ నటులు నితిన్‌, జీవిత, కత్తి కార్తీక తదితరులు కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు.

ముఖ్యంగా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్‌ రాజు అధికార బీఆర్‌ఎస్‌ నుంచి బరిలోకి దిగే అవకాశాలున్నాయని తెగ ప్రచారం జరిగింది. నిజామాబాద్‌ జిల్లా నర్సింగ్‌పల్లికి చెందిన ఆయన.. ఎంపీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నారని చెప్పుకున్నారు. రాజకీయ రంగంపై ఎప్పటి నుంచో ఆసక్తి చూపుతున్న ఆయన.. ఎలక్షన్ టైమ్ లో పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

ఇక, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌ కూడా మొదటి నుంచి బీఆర్‌ఎస్ కు సన్నిహితంగా ఉంటూ వచ్చారు. గతంలో ఆయన హైదరాబాద్‌ నగరంలోని ఒక స్థానం నుంచి పోటీ చేయడానికి ఇంట్రస్ట్ చూపినా అదీ ఎందుకనో ముందుకు వెళ్లలేదు. ఈసారి కూడా ఆయన ఎలక్షన్ టైమ్ లో చిన్న ట్వీట్ కూడా చేయలేదు. కొంతకాలం కిందట ఆయన సీఎం కేసీఆర్‌ను ఫామ్‌ హౌస్ లో కలిసి చర్చలు జరిపిన ఆయన ఎందుకు అంత నిరాశక్తిగా ఉండిపోయారో తెలియలేదు. ఆయన తెలంగాణ నుంచి కాకపోయినా బీఆర్‌ఎస్‌ తరఫున కర్ణాటకలో ఎక్కడి నుంచైనా బరిలోకి దిగుతారేమో అనుకుంటే ఏదీ లేదు.

తెలంగాణ వచ్చిన కొత్తలో ఎక్కువగా వినపడ్డ పేరు డైరక్టర్ ఎన్.శంకర్. జయం మనదేరా, భద్రాచలం వంటి సినిమాలు తీసిన ఆయనకు.. జై బోలో తెలంగాణ సినిమాతో మంచి పేరొచ్చింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన ఈ దర్శకుడు ఈసారి అసలు ఎక్కడా కనపడలేదు. ప్రచారం చేయలేదు. 2014 ఎన్నికల్లోనే ఆయనకు కాంగ్రెస్‌ తరఫున మిర్యాలగూడ నుంచి నిలబడతారు అనుకున్నారు. అప్పుడు ఆయన సుముఖత చూపలేదు. కానీ, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీకి ఆయన పేరును పరిశీలిస్తారని అనుకుంటే అదీ జరగలేదు. ఆయన డైరక్ట్ చేసిన జైబోలో తెలంగాణ సినిమాలోనే హీరోగా నటించిన రోషన్‌ బాలు కూడా ఈసారి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించారని అన్నారు. కానీ, దక్కలేదు.

తెలంగాణ ఎలక్షన్స్ ముందు గట్టి పోటీ ఇస్తుందనుకున్న బీజేపీ తమ పార్టీ తరుపున హీరో నితిన్‌ ని రంగంలోకి దింపుతుందని అందరూ భావించారు. పోటీ చేయాలనే కోరిక నితిన్‌కు లేదని చెప్పినట్లు సమాచారం. కానీ, బీజేపీ తన వ్యూహంలో భాగంగా ప్రచారంలోకి అయినా ఆయన్ను దింపుదామనుకున్నా అదీ జరగలేదు. అందులో భాగంగానే హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కూడా నితిన్‌ మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే.

ఇక కాంగ్రెస్‌ నాయకురాలు, మాజీ సినీ నటి.. స్టార్ క్యాంపేయినర్ విజయశాంతి మాత్రం సైలెంట్ అయిపోయారు. ఆమె అసలు ఎక్కడా కనిపించకపోవడం అందరిని ఆచ్చర్యపరుస్తోంది. ఎన్నికల ముందు వరకూ బీజేపీతో ఉన్నారు విజయశాంతి. అసెంబ్లీ ఎన్నికలకు కొంత కాలం ముందే ఆమె కాంగ్రెస్ లోకి వచ్చారు. ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యాక కొద్ది రోజులు గాంధీభవన్‌ లో కనిపించారు. తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాల్లో ఆమె కనిపించలేదు. ఏమి జరుగుతోందా అనేది ఇప్పుడు పెద్ద డిస్కషన్.

అలాగే గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ (Congress) తరపున సికింద్రాబాద్ (Secunderabad) ఎమ్మెల్యేగా గెలిచిన నాయకురాలు, సహజనటి జయసుధ (Jayasudha) ఊహించని విధంగా బీజేపీలోకి వచ్చారు. మాయమయ్యారు. ఆమెనెవరూ కాషాయ పార్టీలో పట్టించుకున్నట్లు లేదు. ఇలా తెలంగాణ రాజకీయాల్లో తారల తళుకు బెళుకులు మాయమయ్యాయి.

వీళ్లతో పాటు పార్టీలో క్రియాశీలంగా ఉన్న జీవిత కూడా బీజేపీ తరఫున పోటీలోకి దిగుతుంది, ఆమె జహీరాబాద్‌ అసెంబ్లీ స్థానాన్ని అడుగుతున్నట్లు చెప్పుకున్నారు. అయితే ఆమె కూడా సైలెంట్ అయ్యారు.

ఇక, బాబూ మోహన్‌ విషయానికి వస్తే. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేశారు. ఆ కొద్ది రోజులకే ప్రజా శాంతి పార్టీలో చేరారు. తనకు జన్మనిచ్చిన గడ్డ వరంగల్ నగరానికి ఏమైనా చేయాలనే ఉద్దేశం ఉందని అన్నారు. ప్రజాశాంతి పార్టీ తరపున తాను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు ఆ రోజే ఆయన ప్రకటించారు.

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, టీవీ ఆర్టిస్ట్‌ కత్తి కార్తీక కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించింది. టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ లో చేరారు. క్యాంపెయిన్ లో పాల్గొంటూ సంతృప్తి పడాల్సి వస్తోంది. అలాగే, ఈసారి ఖమ్మం జిల్లాకు రామ్‌ తాళ్లూరి జనసేన పార్టీలో ఉన్నారు. చుట్టాలబ్బాయి, నేల టికెట్‌, డిస్కో రాజా తదితర సినిమాలు నిర్మించిన ఈ ఎన్‌ఆర్‌ఐ నిర్మాత జనసేన తరఫున ఖమ్మం జిల్లాలో ఒక స్థానం నుంచి బరిలోకి దిగే ఆలోచనతో ఉన్నారని వార్తలు వచ్చాయి. అవేమీ వాస్తవ రూపం దాల్చలేదు.

తెలుగు రాష్ట్రాలలో హాస్యబ్రహ్మగా పేరొందిన బ్రహ్మానందం కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలోకి దిగారు. చిక్కబళ్లాపుర నియోజకవర్గం (తెలుగు ప్రాంతం)లో బీజేపీ అభ్యర్థి సుధాకర్‌ తరపున ఆయన ప్రచారం చేశారు. అయితే ఆయన తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ ఎవరకి సపోర్ట్ చేస్తున్నట్లు బహిరంగంగా కనపడటానికి ఇష్టపడలేదు.

Read More
Next Story