
మురుగదాస్‌కు చేసింది తప్పేనా?.. 10 కోట్లు కట్టాల్సిందేనా?
సక్సెస్ మీట్లు ఫేక్.. కలెక్షన్లు డమ్మీ?
ఒకప్పుడు సౌత్ ఇండియాను ఊపేసిన సెన్సేషనల్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. శివకార్తికేయన్ హీరోగా భారీ అంచనాల మధ్య వచ్చిన ‘మదరాసి’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టడమే కాకుండా, ఇప్పుడు ఏకంగా దర్శకుడి మెడకు కోట్లలో జరిమానా చుట్టుకునేలా చేసింది. సినిమా డిజాస్టర్ అయితే హీరోలు, నిర్మాతలు నష్టపోవడం కామన్, కానీ ఇక్కడ ఏకంగా దర్శకుడిపైనే నిర్మాత కౌన్సిల్‌లో ఫిర్యాదు చేయడం కోలీవుడ్‌లో సంచలనంగా మారింది.
బడ్జెట్ లెక్కలు తేలాయి.. నిర్మాత జేబుకు చిల్లు!
మురుగదాస్ ‘మదరాసి’ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు రూ. 150 కోట్లలో సినిమా పూర్తి చేస్తానని నిర్మాతకు మాట ఇచ్చారట. తీరా సినిమా పూర్తయ్యేసరికి ఆ బడ్జెట్ కాస్తా రూ. 170 కోట్లకు చేరింది. అంటే ప్లానింగ్ లోపంతో అదనంగా రూ. 20 కోట్లు ఖర్చు చేయించారన్నది ప్రధాన ఆరోపణ. కేవలం 90 కోట్లు మాత్రమే వసూలు చేసిన ఈ చిత్రం, నిర్మాతలకు కోలుకోలేని దెబ్బ తీసింది. దీంతో తన నష్టాన్ని భర్తీ చేయాలని, మురుగదాస్ రూ. 10 కోట్లు వెనక్కి ఇవ్వాలని నిర్మాత పట్టుబడుతున్నారు.
సల్మాన్ ఖాన్ కోసమే ఈ నిర్లక్ష్యమా?
మదరాసి షూటింగ్ జరుగుతున్న సమయంలోనే మురుగదాస్ తన తదుపరి చిత్రం ‘సికందర్’ పనుల్లో బిజీగా ఉన్నారని, సల్మాన్ ఖాన్ సినిమాపై ఉన్న శ్రద్ధ శివకార్తికేయన్ సినిమాపై చూపలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండు పడవల మీద కాళ్లు పెట్టడం వల్లే స్క్రిప్ట్ సరిగ్గా కుదరలేదని, మేకింగ్‌లో క్వాలిటీ లోపించిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హీరో క్రేజ్ ఉన్నా సరే, దర్శకుడి ఫోకస్ పక్కకు మళ్లడం వల్లే సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సక్సెస్ మీట్లు.. ఫేక్ సంబరాలు!
సినిమా థియేటర్లలో వెలవెలబోతుంటే, చిత్ర యూనిట్ భారీగా సక్సెస్ మీట్లు నిర్వహించడంపై నెటిజన్లు ఇప్పుడు ఫైర్ అవుతున్నారు. "డబ్బులు రాని సినిమాకు డప్పులు ఎందుకు?" అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. అప్పుడే సినిమా డిజాస్టర్ అని అందరికీ అర్థమైనా, మేకర్స్ మాత్రం అది హిట్ అని కలరింగ్ ఇవ్వడం ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. అసలు బ్రేక్ ఈవెన్ కూడా సాధించని సినిమాకు సెలబ్రేషన్స్ ఎలా చేసారని సామాన్య ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.
పరిహారంగా 'రమణ 2'.. గట్టెక్కుతారా?
ఈ పంచాయితీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు చేరడంతో మురుగదాస్ ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నగదు రూపంలో కాకుండా, తన హిట్ సినిమా ‘రమణ’ (తెలుగులో ఠాగూర్) కు సీక్వెల్ కథను రాసి ఇస్తానని, ఆ ప్రాజెక్ట్‌ను ఉచితంగా అదే బ్యానర్‌కు సెట్ చేస్తానని ఆఫర్ ఇచ్చారట. మరి ఈ డీల్‌తో నిర్మాత శాంతిస్తారా లేదా అనేది చూడాలి. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మురుగదాస్, ఈ వివాదం నుంచి బయటపడి మళ్ళీ ఫామ్‌లోకి వస్తారా లేదా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్.
మురుగదాస్ లాంటి దిగ్గజ దర్శకుడు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఆయన తదుపరి చిత్రాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది అంతటా చర్చనీయాంశంగా మారింది.

