నా కొడుకు నటుడే కాదు, కమ్యూనిస్టు కూడా! నటి సుహాసిని
x
నటి సుహాసిని (ఫోటో కర్టసీ ఫేస్ బుక్)

నా కొడుకు నటుడే కాదు, కమ్యూనిస్టు కూడా! నటి సుహాసిని

కమ్యూనిస్టన్నా, కమ్యూనిజమన్నా ఓ బూతుపదంగా చూస్తున్న ఈరోజుల్లో ప్రముఖ సినీనటి సుహాసినీ మణిరత్నం తన కొడుకు కమ్యూనిస్టని సగర్వంగా చెబుతోంది. ఎందుకంటారు?


ఆమధ్య ఎక్కడో ‘ఒక్క రోజైనా, ఒక్క పూటైనా కమ్యూనిస్టుగా బతుకు నేస్తమా, బతుకు విలువ తెలుస్తుంది నేస్తమా’ అనే పాట విన్నప్పుడు నిజంగానే కమ్యూనిజం విలువ తెలుస్తుందంటారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు డి.పాపారావు. ఆయన కమ్యూనిస్టు అభిమాని కనుక ఆ మాట అనడంలో వింతేమీ లేకపోయినా ఓ పేరున్న సినీనటి సుహాసిని తన కుమారుడు నందన్ కమ్యూనిస్టని చెప్పడమే ఆశ్యర్యమేసింది. కమ్యూనిజమనే పదాన్ని వాడడమే నేరమన్నట్టు చూస్తున్న ఈ రోజుల్లో నా కొడుకు కమ్యూనిస్టని చెప్పడానికి వెనుకాడను అన్నారు నటి సుహాసిని. చాలా పెద్ద ప్రొఫైల్ ఉన్న నటుల్లో సుహాసిని ఒకరు. దాదాపు వాళ్లది సినీ కుటుంబమే.

నా కుమారుడు నా దారిలో రాలేదు...

హుందాగా ఉండే నటుల్లో సుహాసిని ఒకరు. నాలుగు భాషల్లో నటించారు. ఆరు పదుల వయసు. భార్య, తల్లి, నటి, నిర్మాత, దర్శకురాలు ఇలా భిన్న పాత్రలు ఆమెవి. కేరళలో జరిగిన ఓ ఈవెంట్‌లో సుహాసిని మణిరత్నం తన కొడుకు లైఫ్‌స్టైల్‌ గురించి అబ్బురంగా చెప్పుకొచ్చారు. సహజంగా తలిదండ్రులు ఇద్దరూ చిత్రపరిశ్రమలో ఉంటే పిల్లలూ ఆ వైపుగా అడుగులు వేస్తారు. కానీ తన కుమారుడు ఆ దారిలో రాలేదని చెప్పడం గమనార్హం.

పరమకుడి మా ఊరు...

‘తమిళనాడులోని పరమకుడి మా ఊరు. మాది ఉమ్మడి కుటుంబం. మా ఇంట్లో కారు కాదు కదా, కనీసం ఫ్రిజ్‌ కూడా ఉండేది కాదు. నేను చదువుకున్నది కూడా మున్సిపల్‌ స్కూల్లోనే. నాన్న చారు హాసన్‌, బాబాయి కమల్‌హాసన్‌ అప్పటికే సినిమాల్లో నటిస్తున్నారు. నాన్నకు తోడుగా ఉంటానని నన్నూ పంపారు. రామకృష్ణ మిషన్‌ వారి శారద విద్యాలయ, క్వీన్‌ మేరీస్‌ కాలేజీలో నా చదువు సాగింది. మనం వేసుకునే దుస్తుల నుంచి చేసే పనుల వరకూ అన్నింటినీ అందరూ గమనిస్తారు. అందుకే ప్రతి పనిలోనూ జాగ్రత్తగా, బాధ్యతగా ఉండటం అలవాటు చేసుకున్నా. నాకు బాగా ఇష్టమైన దర్శకులు కె. బాలచందర్‌, సత్యజిత్‌ రే. బాలచందర్‌ దర్శకత్వంలోని ‘సింధు భైరవి’ లో నా పాత్రకు జాతీయ పురస్కారం దక్కింది.

అనుకోకుండా నటినయ్యా..

చదువుకునే రోజుల్లో బ్యాంక్‌ మేనేజర్‌ కావాలనేది నా కల. నాన్నేమో నన్ను ఇంజినీర్‌గానో, కలెక్టర్‌గానో చూడాలనుకున్నారు. అమ్మ నన్ను ఇంగ్లీష్‌ లెక్చరర్‌ చేయాలనుకునేది. కానీ అవేవీ కాకుండా.. బాబాయ్ ప్రోత్సాహంతో సినిమాటోగ్రఫీ కోర్సులో చేరాను. అచ్చంగా పక్కింటి అమ్మాయిలా ఉంటానని బాలూ మహేంద్రగారు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. మొదటి సినిమాకే ఉత్తమనటిగా తమిళనాడు ప్రభుత్వ అవార్డు వచ్చింది. అప్పటికి నా వయసు పందొమ్మిది. మణిరత్నంగారి అన్నయ్య, మా నాన్నగారు మంచి స్నేహితులు. వాళ్లు ముందే మాట్లాడుకుని మా పెళ్లి నిశ్చయించారు. ఆ తర్వాతే, మమ్మల్ని ఓసారి కలిసి మాట్లాడుకోమని చెప్పారు. అప్పుడే మళ్లీ కలిశాం. కాసేపు మాట్లాడుకున్నాక తెలిసింది.. మా ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు ఒక్కటేనని. అలా మా పెళ్లి జరిగింది. నాకు చదవడం, రాయడం, నేర్చుకోవడం.. చాలా ఇష్టం. ఒకే చట్రంలో ఎప్పుడూ ఇరుక్కుపోకూడదు. లాక్‌డౌన్‌లో దొరికిన సమయాన్ని వృథా చేసుకోకుండా పియానో నేర్చుకున్నా. దక్షిణాది భాషల్లో అనర్గళంగా మాట్లాడగలను. ప్రస్తుతం ఫ్రెంచ్‌ నేర్చుకుంటున్నా. దర్శకురాలిగా టీవీ సిరీస్‌తోపాటు షార్ట్‌ ఫిలిమ్స్‌, వెబ్‌ సిరీస్‌ చేశా. ఓ మీడియా ఆర్గనైజేషన్‌తోనూ పనిచేస్తున్నా. రాజా రవివర్మ చిత్రాలను రీక్రియేట్‌ చేసేందుకు కృషి చేస్తున్నా. ‘ఎన్ఎఎఎం’ ఫౌండేషన్‌ ద్వారా సమాజంలో అవసరమైన వారికి చేయూత అందిస్తున్నాం’ అని చెప్పారు.

కొడుకు సీపీఎం వాలంటీర్..

సుహాసిని కుమారుడు నందా హాసన్. ఆయన కమ్యూనిస్టు అభిమానట. ఈ విషయాన్నే ఆమె మాటల్లో చెప్పాలంటే.. “అతని లైఫ్‌స్టైల్‌ పట్ల తాను తృప్తిగా ఉన్నా. నందన్‌ ఇతర పిల్లల్లా కాదు. చిన్నతనంలో పాఠశాల నుంచి ఇంటికి వచ్చినప్పుడు, వెంటనే భారత పార్లమెంటు సమావేశాల టెలికాస్ట్‌ను సీరియస్‌గా చూసేవాడు. నేను ఇలాంటి బిడ్డకు జన్మనిచ్చానా అని ఆశ్చర్యపోయాను. పన్నెండేళ్ల వయస్సులో మార్క్సిస్ట్ మహోపాధాయుడు రాసిన “క్యాపిటల్” గంథ్రం చదవడం ప్రారంభించాడు. ఓ రోజు చేతిలో పుస్తకం పట్టుకుని సిపిఎం కార్యాలయానికి వెళ్లాడు. తన వద్ద కారు ఉందని పార్టీ సభ్యులకు తెలియకూడదని, దానిని వేరేచోట పార్క్‌ చేయమని చెప్పి, ఆఫీసులోకి వెళ్లాడు. పార్టీ సభ్యులు ఆయన్ను మొదట అడిగింది భోజనం చేశావా? అని. అది కమ్యూనిస్టు పార్టీ ప్రత్యేకత. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అని వారు అడగలేదు. నందా అన్నం తిన్న తర్వాత, పార్టీ కార్యదర్శిని కలిశాడు. తన తండ్రి పేరు గురించి అడిగినప్పుడు, మణిరత్నం అని చెప్పకుండా అతను అసలు పేరు గోపాలరత్నం సుబ్రమణ్యం అని చెప్పాడు. అమ్మ పేరు అడగ్గా సుహాసిని అని చెప్పాడు. వెంటనే ఆయన మణిరత్నం కొడుకువా? అని అడిగారు. అలా నందన్‌ వాలంటీర్‌ సభ్యుడుగా చేరాడు. తర్వాత కాలంలో కమ్యూనిస్టు భావజాలంతో ముందుకు వెళుతున్నాడు. అందుకు నేను గర్వపడుతున్నా’ అని అన్నారు సుహాసిని. బహుశా డి.పాపారావు ఈ అర్థంలోనే కమ్యూనిజం గొప్పదని ఉంటారు.

Read More
Next Story