వృత్త ఓటిటి మూవీ రివ్యూ!
x

'వృత్త' ఓటిటి మూవీ రివ్యూ!

ఒక రాత్రి ప్రయాణం… ఒక భయంకర వలయం


సిద్ధార్థ్ (మాహిర్ మొహియుద్దీన్) బయటకి చూస్తే సాధారణ యువకుడిలా కనిపిస్తాడు. కానీ అతని లోపల మాత్రం తీవ్రమైన టెన్షన్, చెప్పుకోలేని భయం దాగి ఉన్నాయి. కారణం వెంటనే తీర్చాల్సిన ముప్పై లక్షల అప్పు. ఆ అప్పు ఎందుకు చేశాడో, ఎలా ఈ స్థితికి వచ్చాడో అతనికి తప్ప ఇంకెవరికీ తెలియదు. తల్లిదండ్రులకు, చెల్లెలికి కూడా చెప్పకుండా, ఒంటరిగా ఆ సమస్యను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.

ఇక్కడ నుంచే సినిమా నెమ్మదిగా మిస్టరీని అల్లడం మొదలుపెడుతుంది. ఒకవైపు గతంలో ప్రేమించిన ప్రియ జ్ఞాపకాలు, మరోవైపు తన వల్ల గర్భం దాల్చిందని చెప్పే సుస్మిత పరిస్థితి, ఇంకో వైపు అప్పులవాడి బెదిరింపులు. ఈ మూడింటి మధ్య సిద్ధార్థ్ మానసికంగా చీలిపోతూ ఉంటాడు. చివరి ఆశగా ఒక స్నేహితుడి సూచనతో పుష్పగిరి వైపు రాత్రివేళ ప్రయాణం మొదలుపెడతాడు. అప్పటివరకు ఇది అప్పు కథలా అనిపించినా, ఆ ప్రయాణంతో అసలు సినిమా మొదలవుతుంది.

అడవిలోంచి వెళ్లే ఘాట్ రోడ్డులో, నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ సాగుతున్న కారు, వెనక నుంచి ఎవరో వ్యాన్‌లో ఫాలో అవుతున్నారన్న అనుమానం. అదే సమయంలో ఒక అపరిచిత మహిళ నుంచి వచ్చే ఫోన్ కాల్. రోడ్డు ప్రమాదంలో తన కొడుకు ప్రాణాపాయంలో ఉన్నాడని, వచ్చి రక్షించమని ఆమె చేసే ప్రాధేయపడటం. ఆ కాల్ తనకు ఎలా వచ్చిందో అర్థం కాని స్థితిలో సిద్ధార్థ్ తడబడతాడు. సహాయం చేయాలనే ప్రయత్నంలోనే ప్రమాదం జరిగి, అతడు లోయలో పడిపోతాడు. అక్కడితో కథ పూర్తిగా కొత్త మలుపు తీసుకుంటుంది.

ఇక్కడి నుంచి సినిమా ఇది కేవలం ప్రమాదం నుంచి బయటపడే కథగా కాకుండా, ఒక మనిషి తన జీవితాన్ని తిరిగి చూసుకునే ప్రయాణంగా మారుతుంది. అడవి ఒంటరితనం, చీకటి, నిశ్శబ్దం ఇవన్నీ సిద్ధార్థ్ లోపలి ప్రపంచానికి ప్రతిబింబాల్లా మారతాయి. చిన్ననాటి గాయాలు, తల్లిదండ్రులతో దూరమైన బంధం, ప్రేమలో చేసిన తప్పులు, ఆశల వెనక పరిగెత్తి మానవ సంబంధాలను నిర్లక్ష్యం చేసిన తీరు అన్నీ ఫ్లాష్‌బ్యాక్స్ రూపంలో బయటపడతాయి. ఈ దశలో సినిమా పూర్తిగా సైకాలజికల్ థ్రిల్లర్ టోన్‌లోకి వెళ్తుంది. అసలు సిద్దార్ద్ కథ ఏమిటి..చివరకు ఏమైంది.అతని జీవితంలో అతను తీసుకున్న నిర్ణయాలు, అతన్ని ఎటువైపు నెట్టాయి వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్:

సినిమా ప్రారంభమే చాలా కీలకం. ఒక వణుకు, ఒక భయం, ఒక బాలుడి ఒంటరితనం తో మొదలవుతుంది. ఎలాంటి వివరణ లేకుండా సినిమా మనల్ని నేరుగా ఒక ఎమోషనల్ స్టేట్‌లోకి నెట్టేస్తుంది. వెంటనే అదే వణుకు పెద్దదై సిద్ధార్థ్ అనే వ్యక్తిలో కొనసాగుతుంది. ఇక్కడే రచయిత స్పష్టం చేస్తాడు. ఈ సినిమా కాలానికి సంబంధించినది కాదు. ఇది స్థితికి సంబంధించినది. సిద్ధార్థ్ బాలుడిగా ఉన్నప్పటి భయం, పెద్దవాడైన తర్వాత కూడా అలాగే కొనసాగుతోంది. ఇది ఫ్లాష్‌బ్యాక్ కాదు. ఇది ఒక నిరంతర మానసిక ప్రవాహం.

సిద్ధార్థ్ పాత్రను స్క్రిప్టు ఎప్పుడూ కదలికలోనే ఉంచుతుంది. డ్రైవ్ చేయడం, కాల్స్ రావడం, అప్పు అడగడం, సిగరెట్ వెలిగించడం. కానీ ఈ కదలికలు కథను ముందుకు నడిపించవు. ఇవన్నీ ఒక స్టాటిక్ మైండ్‌ను కప్పిపుచ్చే మోషన్స్ మాత్రమే. స్క్రిప్టు చాలా తెలివిగా ఒక విషయం చేస్తుంది. సిద్ధార్థ్ సమస్యలను వివరించదు. ముప్పై లక్షల అప్పు ఎందుకు, ఎవరికీ అన్నది ఎక్కడా క్లియర్‌గా చెప్పదు. ఇది కథ లోపం కాదు. ఇది స్క్రిప్టు ఉద్దేశం. ఎందుకంటే ఈ సినిమా సమస్యపై కాదు. సమస్య వల్ల ఏర్పడిన మానసిక స్థితిపై.

సెకండాఫ్ కు వచ్చేసరికి స్క్రిప్టు బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా కుదించేస్తుంది. అడవి, రాత్రి, రోడ్డుపై కారు. ఈ మూడు మాత్రమే మిగులుతాయి. ఈ సెటప్ సిద్ధార్థ్ లోపలి ప్రపంచానికి రూపకం. బయట ఎంత తక్కువ ఉందో, లోపల అంత ఎక్కువ గందరగోళం. సుస్మిత ఫోన్ కాల్ స్క్రిప్టులో కీలక టర్నింగ్ పాయింట్. అది కథను మలుపు తిప్పదు. పాత్రను లోపలికి తోసేస్తుంది. గర్భం, బాధ్యత, తప్పు అన్న భావనలు ఒకేసారి సిద్ధార్థ్ మీద పడతాయి. అక్కడే ప్రమాదం జరుగుతుంది. అది కేవలం యాక్సిడెంట్ కాదు. అది అతని జీవితంలో తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాల ఫలితం.

స్క్రిప్టులో వృత్త అనే కాన్సెప్ట్ ఇక్కడ పూర్తిగా అమలవుతుంది. ప్రమాదం తర్వాత కథ ఎక్కడికీ పరుగెత్తదు. అదే స్థితిలో తిరుగుతుంది. సర్వైవల్ ట్రాక్ ఉన్నా, అది ఫిజికల్ కంటే మెంటల్‌గా ఎక్కువ. సిద్ధార్థ్ బయటపడతాడా అన్న ప్రశ్న కంటే, అతను తన భయాన్ని ఎదుర్కొంటాడా అన్నదే స్క్రిప్టు ఆసక్తి. దర్శకుడు–రచయిత Likith Kumar ఇక్కడ ప్రేక్షకుడిని గైడ్ చేయడు. అయోమయంలోనే ఉంచుతాడు. అదే ఉద్దేశం.

పాత్రల రచనలో కూడా ఇదే ప్యాటర్న్ కనిపిస్తుంది. సుస్మిత పూర్తి స్థాయి క్యారెక్టర్ కాదు. ఆమె ఒక స్వరం. ఒక బాధ్యత. ఒక గిల్ట్ ట్రిగ్గర్. ప్రియ గత జ్ఞాపకం మాత్రమే. తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి ప్రతీకలు. ఈ స్క్రిప్టులో ఎవరికీ పూర్తి ఆర్క్ లేదు. ఎందుకంటే ఇది సిద్ధార్థ్ మనసులోని ప్రపంచం. అక్కడ ఇతరులు నీడలుగానే ఉంటారు.

టెక్నికల్ గా...

ఈ కథను ప్రధానంగా నడిపించేది సిద్ధార్థ్ పాత్రే. ఆ పాత్రలో Maahir Mohiuddin చేసిన నటన సినిమాకు ప్రాణం పోస్తుంది. అతడి భయం, అయోమయం, లోపలి పోరాటం అన్నీ చాలా అండర్‌ప్లేలో కనిపిస్తాయి. దర్శకుడు లిఖిత్ కుమార్ ఈ సినిమాను అరుపులు, అనవసరమైన ట్విస్టులు లేకుండా, నిశ్శబ్దం ద్వారానే టెన్షన్ క్రియేట్ చేస్తూ నడిపిస్తాడు. కెమెరా వర్క్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదే మూడ్‌ను బలంగా నిలబెడతాయి.

సెకండ్ హాఫ్‌లో సినిమా పూర్తిగా ఇంట్రోస్పెక్షన్, సర్వైవల్ మీద ఫోకస్ పెడుతుంది. సిద్ధార్థ్ అక్కడి నుంచి ఎలా బయటపడతాడు అన్నదానికంటే, అతడు ఆ ప్రయాణంలో ఏమి గ్రహించాడు అన్నదే ముఖ్యమవుతుంది. ఆశ, లక్ష్యం కోసం మనుషులను, సంబంధాలను వదిలేసినప్పుడు చివరికి మిగిలేది ఒంటరితనమే అన్న భావన బలంగా చెప్పబడుతుంది. చిన్న మానవీయ చర్యలు కూడా ఒకరి జీవితాన్ని ఎలా మార్చగలవో దర్శకుడు సున్నితంగా చూపిస్తాడు.

ముగింపుకు వచ్చేసరికి ఇది ఒక సాధారణ థ్రిల్లర్ కాదు అన్న విషయం స్పష్టమవుతుంది. ఇది నెమ్మదిగా మనసులోకి దిగే సినిమా. పెద్ద ట్విస్టులు, హైపర్ సీన్స్ ఆశించే వారికి ఇది నచ్చకపోవచ్చు. కానీ స్లో బర్న్ మిస్టరీలు, మానసిక లోతులు, డిఫరెంట్ నేరేషన్ ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం Vritta ఒక కొత్త అనుభవం. ఓటీటీలో నిశ్శబ్దంగా వచ్చినా, చూసిన తర్వాత మాత్రం ఆలోచింపజేసే సినిమా ఇది.

ఎక్కడ చూడచ్చు?

జీ 5 లో తెలుగులో ఉంది

Read More
Next Story