![అన్ని పుష్ప లు, బాహుబలి లు కావు అన్ని పుష్ప లు, బాహుబలి లు కావు](https://telangana.thefederal.com/h-upload/2025/02/10/511789-whatsapp-image-2025-02-10-at-11444-pm11zon.webp)
అన్ని 'పుష్ప' లు, 'బాహుబలి' లు కావు
ప్యాన్ ఇండియా రిలీజ్ లు, దారుణ రిజల్ట్ లు
'బాహుబలి' తర్వాతే ప్యాన్ ఇండియా సినిమాల సందడి ఎక్కువైందనేది నిజం. ప్రతీ స్టార్ హీరో తమ సినిమాలు ప్యాన్ ఇండియా, అవకాశం ఉంటే ప్యాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ కోరుకుంటున్నారు. అదేమీ అత్యాశ కూడా కాదు. అయితే అందుకు ప్రమోషన్స్ నిమిత్తం బాగా ఖర్చు పెడుతున్నారు. ముంబై , డిల్లీ , అహ్మదాబాద్ ఇలా అవకాశం ఉన్న చోట్లల్లా ఈవెంట్స్ పెడుతున్నారు. ఆ కష్టం, కరెన్సీ వెనక్కి రెట్టింపు అయ్యి తిరిగివస్తున్నాయా అనేదే పెద్ద ప్రశ్న.
బాలీవుడ్ టాప్ గ్రాసర్ గా 'పుష్ప 2' లాంటి తెలుగు డబ్బింగ్ మూవీ నిలిచిందటే, నార్త్ లో మన సినిమా ఆధిపత్యం ఎ స్థాయిలో కొనసాగిందనేది స్పష్టం అవుతుంది. అలాగే ప్రభాస్ ''కల్కి 28988 AD'' సినిమా ఈ ఏడాది ప్యాన్ ఇండియా స్దాయిలో బ్లాక్ బస్టర్ సినిమాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ మూవీ.. వరల్డ్ వైడ్ గా 1200 కోట్ల వరకు కలెక్షన్ సాధించింది.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ''దేవర పార్ట్-1'' సినిమా రూ.520 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. స్టార్ క్యాస్టింగ్ లేకుండా రూ.40 కోట్ల బడ్జెట్ తో తీసిన 'హను-మాన్' చిత్రం రూ.350 కోట్లు వసూళ్లు సాధించిన పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించింది. ఇవన్నీ ఆనందం కలిగించే విషయాలే.
'తెలుగు ఇండియా'
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాటల్లో చెప్పాలంటే ఇది పాన్ ఇండియా కాదు.. 'తెలుగు ఇండియా'. అయితే ప్యాన్ ఇండియా లో రిలీజైన సినిమాలు అన్నీ అక్కడ సంచలనం సృష్టిస్తున్నాయా అంటే సమాధానం వెతుక్కోవాల్సి వస్తుంది.
ప్యాన్ ఇండియా మార్కెట్ లో ఈ మధ్యన బొక్కబోర్లా పడ్డ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్', 'మట్కా' రెండు పాన్ ఇండియా సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. పెద్ద ఎత్తున ప్రమోట్ చేసిన రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్' మూవీ గురించి చెప్పక్కర్లేదు. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', బాలయ్య 'డాకూ మహారాజ్' చిత్రాలు కూడా అదే పరిస్థితి. ప్యాన్ ఇండియా మార్కెట్ లో వర్కవుట్ కాలేదు.
నానీకి వర్కవుట్ కాలేదు
యంగ్ హీరో నాని తన హాయ్ నాన్న, సరిపోదా శనివారంలతో ప్యాన్ ఇండియా మార్కెట్ లో ప్రవేశించే ప్రయత్నించారు. హిందీ వెర్షన్ కు మినిమం షేర్ కూడా తెచ్చుకో లేకపోయాయి. తర్వాత కిరణ్ అబ్బవరం కూడా 'క' (Ka)సినిమాతో మళయాళ మార్కెట్ లోకి ప్లాన్ చేశారు. కానీ వర్కవుట్ కాలేదు.
తండేలు తడుముకుంటోంది
ఇప్పుడు నాగచైతన్య తండేలు చిత్రం కూడా దాదాపు అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈ సినిమా తెలుగు, ఓవర్ సీస్ మార్కెట్ లో బాగానే గ్రాస్ తెచ్చుకుంటోంది. అయితే తమిళ, మలయాళం, హిందీ వెర్షన్ ...ప్రమోషన్ ఖర్చులు కూడా రాబట్టలేక పోతున్నాయి. హిందీ లో అమీర్ ఖాన్ ని రప్పించి ఈవెంట్ చేసినా ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. కేవలం 15 ఓపినింగ్స్ తో దారుణం అనిపించుకుంది.
ఈ క్రమంలో ప్యాన్ ఇండియా మార్కెట్ కూడా అంత ఈజీగా కైవసం కాకపోవచ్చు అనేది అర్థమవుతోంది. ముఖ్యంగా మీడియం హీరోలు జాగ్రత్తగా అడుగులు వేయాలి. లేకపోతే కార్తికేయ 2 ఆడిందని నిఖిల్ నెక్ట్స్ సినిమాని నార్త్ లో భారీగా రిలీజ్ చేస్తే అక్కడ పట్టించుకునేవాళ్ళు లేకపోయారు. ఈ క్రమంలో ప్యాన్ ఇండియా మార్కెట్ అనేది జూదంగా తయారైందనేది కొందరి నిర్మాతల వాదన.
రాబోయే ప్యాన్ ఇండియా సినిమాలు
దక్షిణాదిలో పాన్ ఇండియా సినిమాల జోరు బాగా కనిపిస్తోంది. ఈ సంవత్సరం దాదాపు భాషాల్లోని స్టార్ హీరోలు తమ కెరీర్ లో క్రేజీ సినిమాలు చేస్తున్నారు. రజినీకాంత్ 'కూలీ' , కమల్ హాసన్ 'థంగ్ లైఫ్', విజయ్ '69', మోహన్ లాల్ 'ఎల్ 2 ఎంపురన్' , యష్ 'టాక్సిక్'తో పాటు ఇంకా చాలా ఉన్నాయి. వారంతా ప్యాన్ ఇండియా రిలీజ్ నే కోరుకుంటున్నారు. బాలీవుడ్ నుంచి కూడా 'వార్ 2' లాంటి సినిమాలు తెలుగులో కూడా భారీ రిలీజ్ కు సిద్ధమయ్యాయి. నాని , అడవి శేష్ లాంటి వారు తమ సినిమాలను పాన్ ఇండియా వైడ్ విడుదలకు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు.
తెలుగు నుంచి రాబోయే రోజుల్లో ప్రభాస్ 'ది రాజాసాబ్', 'మిరాయ్', 'ఘాటీ', 'కన్నప్ప', 'విశ్వంభర', 'హిట్ 3', 'అఖండ 2', 'VD 12', 'SYG - సంబరాల ఏటిగట్టు', OG లాంటి మరికొన్ని పాన్ ఇండియా చిత్రాలు విడుదల కానున్నాయి. మరి వీటిల్లో ఏవేవి సంచలనాలు సృష్టిస్తాయో, ఏవి బోల్తా పడతాయో చూడాలి.
ఏదైమైనా కేవలం భారీ హంగులనే నమ్ముకోకుండా, ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసే ఒరిజినల్ కంటెంట్ ను బిగ్ స్క్రీన్ మీదకు తీసుకు వచ్చిన సినిమాలే ప్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అయ్యారనే విషయం మర్చిపోకూడదు.