మర్లపాడు తండాకు కలెక్టర్‌ భరోసా !
x

మర్లపాడు తండాకు కలెక్టర్‌ భరోసా !

3 నుండి నాలుగు నెలల్లో పునరావాస కాలనీ సిద్ధం చేస్తాం.


‘ రాత్రుళ్లు మీకెందుకు నిద్ర పట్టడం లేదు? ’

‘ ఏదో ఒక రోజు ఉదయం లేచేసరికి మా ఊరు తెలంగాణ మ్యాప్‌ నుంచి మాయమవుతుందనే భయంతో...’ అన్నాడో యువకుడు.

మైండ్‌ బ్లాంక్‌... కాసేపు మాకు ఏమీ అర్ధం కాలేదు.

ఇదంతా నాగర్‌ కర్నూల్‌ జిల్లా , అచ్చంపేట మండలంలోని నక్కలగండి రిజర్వాయర్‌ సమీపంలో మర్లపాడు తండా కథ. ఈ రిపోర్ట్‌ ఫెడరల్‌ తెలంగాణలో పబ్లిష్‌ అయ్యాక అనేక మంది ప్రముఖులు స్పందించారు. సీనియర్‌ మాజీ ఐఎఎస్‌ అధికారి బీపీ ఆచార్యగారు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.


నాగర్‌ కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ కథనం చదివి వెంటనే మర్లపాడు తండా ను 21.11.2025న సందర్శించారు. ఆయనతో పాటు అదనపు కలెక్టర్‌ అమరేందర్‌ ఇతర అధికారులు కూడా ఉన్నారు.

నాలుగు నెలల్లో కొత్త తండా

మర్లపాడు తండా లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, గ్రామస్తులకు ధైర్యం చెప్పిన అనంతరం కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ ‘ ఫెడరల్‌ తెలబగాణ ప్రతినిధి’ కి ఫోన్‌లో భవిష్యత్‌ కార్యచరణను వివరించారు.

‘ ప్రాజెక్ట్‌ వల్ల ముంపుకు గురవుతున్న మర్లపాడు తండాలోని 350 కుటుంబాలకు ఒక్కొక్కరికి 250 చదరపు గజాల్లో ఇంటిని నిర్మిస్తాం. ఈ కొత్త కాలనీ కోసం ఇదే జిల్లాలో హజీపూర్‌,సిద్ధాపూర్‌లో ప్రభుత్వ భూమిని గుర్తించాం. 3 నుండి నాలుగు నెలల్లో పునరావాస కాలనీలో మౌలిక వసతులు పూర్తి చేసి, సాధ్యమైనంత త్వరలో బాధితులుకు అంద,చేస్తాం


ప్రస్తుతం బాధితులందరికీ నిత్యావసర వస్తువులు, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పిస్తాం. పంటలు దెబ్బతిన్న వారికి తగిన నస్టపరిహారం ఇస్తాం.

అదే విధంగా, నష్టపోయిన పంటలపై అంచనాలు వేగంగా పూర్తిచేసి రైతులకు పంటనష్ట పరిహారం అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది.’ అని సంతోష్‌ చెప్పారు.


పునరావాస కాలనీకి సంతోష్‌ పేరు

ఫెడరల్‌ తెలంగాణ కథనం చూసి కదిలి పోయిన కలెక్టర్‌

తండాకు చేరుకొని రైతులు, గ్రామస్తులతో మాట్లాడి ముంపు ప్రభావం, పంటల నష్టాలు, నివాస ప్రాంతాల్లో పెరిగిన మురుగు నీటి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. గ్రామస్తుల సమస్యలు శ్రద్ధగా నమోదు చేసుకుని వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఇతర అధికారులకు కలెక్టర్‌ ఆదేశించారు.

‘ మా బాధలు వినడానికి కలెక్టర్‌ మా గ్రామానికి వస్తారని మేము అస్సలు ఊహించ లేదు.


మా సమస్యలన్నీ శ్రద్ధగా విన్నారు. వరద పాలైన పత్తి, ఇండ్లలో దాచుకున్న బియ్యం బస్తాలను చూశారు. అన్నింటికి నష్టపరిహారం ఇస్తామని మాటిచ్చారు. వీలైతే ప్రతీవారం తండాకు వస్తానని మాటిచ్చారు. సకల సౌకర్యాలతో పునరావాస కాలనీ ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. మా కోసం శ్రద్ధ తీసుకుంటున్న కలెక్టర్‌ గారికి గుర్తుగా కొత్త కాలనీకి సంతోష్‌ తండా అని పేరు పెట్టుకోవాలని మా గ్రామస్తులంతా తీర్మానం చేసుకున్నాం’ అని మర్లపాడు తండా ప్రజలు ఫెడరల్‌ తెలంగాణ ప్రతినిధికి చెప్పారు.

యువ కలెక్టర్‌ సంతోష్‌ ఒక పద్ధతిగా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రణాళిక చేస్తున్నారు. ఇటీవల ముంపుకు నష్టపోయిన ప్రతీ కుటుంబానికి తక్షణం రూ. 15,000 అందిస్తున్నారు. గ్రామస్తులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి అందరూ ఐకమత్యంగా కాలనీ ఏర్పాటులో కలసి పని చేసేలా చూస్తున్నారు. అసుపత్రి, బడి, కమ్యూనిటీ హాలు వంటి సౌకర్యాలతో కాలనీ నిర్మాణం చేపడుతున్నారు.


ప్రాజెక్టు నీళ్లు ఎప్పుడొస్తాయో, ఏ క్షణం ఇళ్లను మింగేస్తాయో తెలియకుండా

బిక్కుబిక్కుమంటూ బతుకుతూ, పునరావాసం ఎక్కడ? భవిష్యత్తు ఎక్కడ? పిల్లలను ఎక్కడికి తీసుకెళ్లాలి? ‘ఎక్కడికి వెళ్లాలి? అన్న ప్రశ్నలకు,

ఈ పర్యటన ద్వారా కలెక్టర్‌ అంతులేని, ఆత్మవిశ్వాసం కలిగించారు.నక్కలగండి ప్రాజెక్ట్‌ ముంపు బాదితులకు ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుంది. ప్రతి కుటుంబానికి అవసరమైన సాయం చేరేలా చర్యలు తీసుకుంటున్నాం. ముంపును ఎదుర్కొనే మౌలిక వసతులు కల్పిస్తాం అని భరోసా ఇచ్చారు.

నక్కలగండి రిజర్వాయర్‌ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ కోసం దాదాపు రూ.750 కోట్ల వ్యయంతో అంచనాలు వేశారు. దాదాపు 3,155 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది, ఇందులో అందులోని అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో

మన్నెవారిపల్లి, కేశ్యపాడు తండా, మర్లపాడు తండా వంటి ప్రాంతాలున్నాయి.

మర్లపాడు తండా మిగతా తండాలకంటే లోతట్టు ప్రాంతం అవ్వడం వల్ల ఇటీవల భారీ వానలకు ముంపుకు గురైంది.

Read More
Next Story