శేఖర్ కమ్ముల ‘కుబేర’ రివ్యూ
x

శేఖర్ కమ్ముల ‘కుబేర’ రివ్యూ

ఇది కమ్ముల మార్క్‌ ఎమోషన్‌తో కొత్తగా చెప్పిన ప్రయోగమా? లేక అందరి అంచనాల్ని మించే అనుభవమా? రివ్యూలోకి వెళ్దాం.

సినిమాను ఒక ‘ఎమోషనల్ ప్రయాణం’గా చూడాలనుకునే వాళ్లకు శేఖర్ కమ్ముల చిత్రాలు ఎప్పుడూ వెల్కమ్ చెప్తూంటాయి.ఆయన సినిమా చూడటం ఒక ప్రత్యేక అనుభూతిగా చెప్తూంటారు అభిమానులు. ‘ఆనంద్’, ‘హ్యాపీ డేస్’, ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ వంటి సినిమాల ద్వారా తన మార్క్‌ను ఖరారు చేసుకున్న ఆయన, ఇప్పుడు ‘కుబేర’ అంటూ ఓ కొత్త ప్రయోగం తో వచ్చారు. ఈ సినిమా కథ ఏమిటి? ఎక్సపెక్టేషన్స్ ని రీచ్ అయ్యారా.. ఇది కమ్ముల మార్క్‌ ఎమోషన్‌తో కొత్తగా చెప్పిన ప్రయోగమా? లేక అందరి అంచనాల్ని మించే అనుభవమా? ‘కుబేర’ రివ్యూలోకి వెళ్దాం.

స్టోరీలైన్:

గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్‌ సీఈవో నీరజ్ మిత్ర (జిమ్ సర్బ్), ప్రపంచ ధనవంతుడిగా నిలవాలనేది జీవితాశయం. తన గ్లోబల్ అజెండాతో, కేంద్ర ప్రభుత్వ “ఆపరేషన్ సాగర్” ప్రాజెక్ట్‌ను తన స్వలాభం కోసం వాడుకోవాలనుకుంటాడు. అందుకోసం రాజకీయ నాయకుడు సిద్ధప్పతో రూ.లక్ష కోట్ల బ్లాక్ & వైట్ డీల్ కుదుర్చుకుంటాడు.

అయితే లక్ష కోట్లు చేతులు మారటం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. అందుకే ఈ భారీ లావాదేవీని ఏ ఇబ్బంది లేకుండా ఫెరఫెక్ట్ గా నిర్వహించేందుకు జైల్లో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్ తేజ్ (నాగార్జున) సహాయాన్ని తీసుకుంటాడు. అందుకోసం దీపక్ ని జైలు నుంచి బయిటకు తెస్తాడు. దీపక్ తన ఆట మొదలెడతాడజు. తన మాస్టర్‌ మైండ్ ప్లాన్‌తో నలుగురు బిచ్చగాళ్లను సెట్ చేసి, వారి పేరిట విదేశాల్లో ఫేక్ కంపెనీలు, అకౌంట్లు సృష్టించి డబ్బు ట్రాన్స్‌ఫర్ ప్లాన్‌ చేస్తాడు.

అయితే డీల్ పూర్తికాగానే, బిచ్చగాళ్లను ఖతం చేయాలన్న నీరజ్ ప్లాన్‌. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకున్న టైమ్ లో ఒక్క దేవా (ధనుష్) మాత్రం తప్పించుకుంటాడు. ఇప్పుడు దేవాని స్విస్ అకౌంట్‌లో ఉన్న రూ.10,000 కోట్ల కోసం నీరజ్-దీపక్ గ్యాంగ్‌ చుట్టూ ముట్టుతుంది. అప్పుడు ఏమైంది..

దేవా నిజంగా బిచ్చగాడేనా?

అతని గతం ఏమిటి?

దీపక్ అతనికి సహాయం చేశాడా, మోసం చేశాడా?

సమీరా (రష్మిక) అతని జీవితం‌లో ఎలా ప్రవేశించింది?

ఆ డబ్బుతో చివరికి దేవా ఏం చేశాడు?

ఈ మల్టీ-లేయర్డ్ న్యారేషన్‌లో ఎలా పావులు మారతాయి...ప్లాన్ లు ఎలా పాముల్లా మలుపులు తిరుగుతాయి... ధన బలం ముందు మానవ విలువలు నిలబడతాయా అన్న ప్రశ్న కు తెరపై సమాధానం లభిస్తుంది.

ఎనాలసిస్ ...

“కుబేర” స్క్రీన్‌ప్లే పరంగా ఒక అర్బన్ పొలిటికల్ థ్రిల్లర్. ఈ సినిమా కథ లో అసలైన బ్యూటీ... పొలిటికల్ కరప్షన్, కార్పొరేట్ ప్రాబల్యంతో జాతీయ వనరుల దోపిడి, లార్జ్-స్కేల్ మనీ లాండరింగ్, మానవ జీవితాల విలువను లెక్కచేయని వ్యవస్థలపై విమర్శ. అలాగే బిచ్చగాళ్లను బినామీలుగా ఉపయోగించి లక్ష కోట్ల స్కీమ్‌ను నడిపించడం అన్నది కథలోని అద్భుతమైన, ఒరిజినల్ కాన్సెప్ట్. ఇది కథను థ్రిల్లర్ టోన్‌తో ప్రారంభించడమే కాకుండా, సామాజిక అసమానతల్ని చక్కగా చూపిస్తుంది.

అయితే ఈ ఎత్తుగడ ఎంత నీట్ గా డిజైన్ చేసారో..అందుకు పూర్తి వ్యతిరేకంగా మిగతా ట్రీట్మెంట్ నడుస్తుంది. ఫస్ట్ యాక్ట్‌లోనే స్క్రీన్‌ప్లే రెండు పారలల్ స్టోరీస్‌ను స్థాపిస్తుంది: నీరజ్ అనే మహాశక్తిమంతుడి దాహం, దేవా అనే చిన్న వ్యక్తిలోని పెద్ద విలువ. అలాగే నాగార్జున దీపక్‌ పాత్ర పరిచయం సమయంలోనే దర్శకుడు "Hero or Villain?" అనే ప్రశ్నను డ్రమిటక్ పాయింట్ లా ప్లాంట్ చేస్తాడు.

థర్డ్ యాక్ట్ లో లాగ్: శేఖర్ కమ్ముల తన గత సినిమాల లాగానే క్లైమాక్స్‌లో తాత్వికతను కలపాలని ప్రయత్నిస్తూ, కథను అవసరంలేని దిశగా సాగదీయటం కనిపిస్తుంది. ముఖ్యంగా రిపిటేటివ్ ఎపిసోడ్లు, డైలాగ్ బరువు, మెసేజ్ ఓవర్‌డోస్ అనిపించేలా ఉంటుంది. కథలో లోతు ఉంది. దాన్ని స్పష్టంగా అందించే కథనం లేదు. శేఖర్ కమ్ముల కథను "నేరం - విమర్శ - విముక్తి" అనే మూడు ప్రక్రియలుగా విడగొట్టి తీసుకెళ్లారు.

అయితే మూడవ భాగం వచ్చేసరికి అది ఫార్ములాగా మారింది . దానికి తోడు కథలో మూడో భాగాన్ని టైట్‌గా కట్ చేయకపోవటం ఇబ్బంది పెట్టింది.

టెక్నికల్ గా ...

శేఖర్‌ కమ్ముల కథ కొత్తగా ఉంది కానీ స్క్రీన్‌ప్లేని నడిపించిన తీరు కథకు తగ్గ స్దాయిలో లేదు. అయితే బలమైన పాత్రలు మాత్రం బాగా రాసుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ పాటలు ఎప్పటిలాగ హిట్ కాలేదు. శేఖర్ కమ్ముల సినిమా అంటే పాటలు రిలీజ్ కు ముందే సూపర్ హిట్. అవే థియేటర్ కు ఓపినింగ్స్ రప్పిస్తాయి. అయితే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో ఆ మ్యాజిక్ మిస్సైంది. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా సహజంగా ఉంది. ఎడిటింగ్ పరంగా ...సెకండాఫ్ చాలా బాగం ట్రిమ్ చేసి రన్ టైమ్ తగ్గిస్తే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ ..ఖర్చు తెరపై బాగా రిచ్ గా కనిపిస్తోంది. శేఖర్ కమ్ముల మార్క్ షాట్స్ చాలా చోట్ల పలకరిస్తాయి.

నటీనటుల్లో..

నాగార్జున ఈ సినిమాలో తన అనుభవాన్ని పూర్తిగా చూపించగలిగారు. ఇటీవల కాలంలో ఆయనకు లభించిన బెస్ట్ పాత్రలలో ఇది ఒకటి అనడంలో సందేహం లేదు – గంభీరత, అంతర్లీన ఉద్వేగాలను సమానంగా మేళవించారు. రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా “హీరోయిన్” అనాల్సిన అవసరం లేదు. శేఖర్ కమ్ముల కథ అవసరానికి అనుగుణంగా నిర్మించిన పాత్రలో ఆమె సహజంగా నటించారు. గ్లామర్‌కు కాక, కథకు ఉపయోగపడే పాత్రగా నిలిచారు. ధనుష్ అయితే అందరికన్నా హైలెట్ గా కనిపించారు.

విలన్‌గా జిమ్ సర్బ్ మాత్రం అసలైన హైలైట్. బిజినెస్ మేన్ గా ప్రారంభమై, క్లైమాక్స్‌లో ఊహించని రూపంలో ప్రత్యక్షమయ్యే ఆయన పెర్ఫార్మెన్స్ సూపర్బ్ గా ఉంది. మిగతా నటీ నటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ఫైనల్ థాట్

మ్యూజికల్ లవ్ స్టోరీల మ్యాజిక్ శేఖర్ కమ్ముల బ్రాండ్. ఈ సారి కొత్తదనం పేరుతో శేఖర్ కమ్ముల పూర్తిగా మాయమయ్యాడు. అర్బన్ థ్రిల్లర్ నేరేషన్ లో కథ చెప్పాలనేది శేఖర్ కమ్ములకు ఇష్టమేమో కానీ ఎందుకనో పూర్తి స్దాయి లో పే ఆఫ్ అవ్వలేదు. బాగోలేదని చెప్పలేం కానీ అద్బుతం అని మాత్రం అనలేం.

Read More
Next Story