
నారా రోహిత్ ‘సుందరకాండ’ మూవీ రివ్యూ
ఫ్యామిలీ ఫన్, ఫీల్‌గుడ్ ఉన్నా కానీ...
సిద్ధార్థ్ (నారా రోహిత్) నలభైల్లో పడిన ఓ పెళ్లి కానీ కుర్రాడు. అయితే ఇంతవయస్సు వచ్చినా అతనికి పెళ్లి కాకపోవటానికి కారణం డబ్బు లేకపోవటం కాదు, వృత్తిలో సెటిల్ కాకపోవటమూ కాదు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేసే సిద్దార్ద్ కు తను చేసుకోబోయే అమ్మాయి విషయంలో కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉంటాయి. అందుకు కారణం ..చిన్నతనంలో చదివే రోజుల్లో తనకన్నా సీనియర్ అయిన వైష్ణవి (శ్రీదేవి విజయ్‌కుమార్)పై అతనికి కలిగిన ఆసక్తి. ఆ క్రష్ కారణంగానే ఒక దశలో స్కూల్ నుంచి బహిష్కరింపబడిన చేదు జ్ఞాపకం అతన్ని ఎప్పటికీ వెంటాడుతుంది.
సంవత్సరాలు గడుస్తాయి. జీవితం లోకల్ బోయ్ నుంచి సక్సెస్ ఫుల్ ప్రొఫెషనల్‌గా ఎదిగినా, పెళ్లి విషయంలో మాత్రం తనకో స్పష్టమైన అంచనా,రూల్స్ ఉండటమే దెబ్బ కొడుతూ ఉంటుంది. తాను కోరుకునే జీవిత భాగస్వామి ఐదు ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉండాలని నిశ్చయించుకుంటాడు — అదే లక్షణాలు వైష్ణవిలో ఒకప్పుడు చూసినవి. అయితే ఇప్పుడు ఆ లక్షణాలు ఐరా (వృతీ వాఘానీ) అనే అమ్మాయిలో కనపడతాయి.
కాకపోతే చిన్న మెలిక ఆ అమ్మాయి తన కన్నా బాగా చిన్నది. అయినా వెనకాడడు. తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. వయసు తేడా ఉన్నా, ఐరా అతన్ని ఓకే చేస్తుంది. అయితే అప్పుడే అసలైన ట్విస్ట్ పడుతుంది. ఐరా మరెవరో కాదు అని ఓ విషయం తెలుస్తుంది. ఇంతకీ ఆమె ఎవరు...చివరికి అతని ప్రేమ,పెళ్లి జర్నీ ఎక్కడ, ఎలా క్లైమాక్స్ కు చేరుకుంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
నారా రోహిత్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ హీరోగా వచ్చిన సినిమా “సుందరకాండ”. ‘ప్రతినిధి 2’ లాంటి రాజకీయ డ్రామా తర్వాత ఆయన ఎంచుకున్న ఈ కథ, అసలు బలం ఒక ఇంటర్వెల్ ట్విస్ట్ మీదే ఆధారపడి ఉంటుంది. బాలీవుడ్, మలయాళ సినిమాల్లో ఇలాంటి థీమ్స్ కనిపించినా, మైన్‌స్ట్రీమ్ తెలుగు సినిమాలో ఇలాంటి ప్రయోగం కొత్తగానే అనిపిస్తుంది. హిందీలో లమ్హే చిత్రాల్లోని కాన్‌ఫ్లిక్ట్ గుర్తొచ్చినా ప్రెష్ గానే అనిపిస్తుంది.
మొదటి ముప్పై–నలభై నిమిషాలు లైటర్ వీన్ తో పై ..పైనే నడిచినా, ఇంటర్వెల్‌కు చేరుకునే సరికి దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి పేస్ పెంచి, కథలోకి పుల్ గా వచ్చేయటం బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ నిజంగానే హైలైట్ కొత్తగా ఉంది. దాని వల్ల సెకండ్ హాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. అయితే, సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ డెప్త్ కావాల్సినంతగా రాలేదు.
కథ ఇంట్రవెల్ లో సెట్ చేసిన పాయింట్ ని దాటి ముందుకు వెళ్ళదు. దాంతో సెకండాఫ్ ఓ మోస్తరు స్థాయిలో ఆగిపోవడంతో క్లైమాక్స్ కు వచ్చేసరికి అనుకున్న స్దాయిలో హై రాలేదు. మరీ ముఖ్యంగా ఎపిసోడ్‌లు రిపీట్, పొడిగించడం వల్ల స్క్రీన్‌ప్లే సరిగ్గా టైట్‌గా అనిపించదు.
అయినప్పటికీ, సినిమా చివరికి బాగుంది అన్నట్లుగానే ముగుస్తుంది. అక్కడక్కాడా లోపాలు ఉన్నా, ఫన్ మోమెంట్స్, ఇంటర్వెల్ ట్విస్ట్ – ఇవే సినిమాకు ప్లస్ లా నిలిచాయి.
టెక్నికల్ గా..
వయస్సు అయ్యిపోయి పెళ్లికాకుండా మిగిలిపోయిన నడివయస్సు వాడిగా నారా రోహిత్ (Nara Rohith) ఫెరఫెక్ట్ . తనకు అలవాటైన హాస్యం, ఎమోషన్ సీన్స్ చేసి వర్కవుట్ చేసారు. మిగతావాళ్లు కథలో ఫిట్ అయ్యారు. ప్రత్యేకంగా చెప్పుకునేందుకు సత్య కామెడీ తప్ప వేరేదేమీ లేదు. ప్రదీష్ వర్మ సినిమాటోగ్రఫీ బాగుంది. లియోన్ జేమ్స్ మ్యూజిక్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ సెకండాఫ్ లో కాస్త సాగినట్లు అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. డైలాగులు బాగున్నాయి. సినిమాని ఎక్కువ శాతం డైలాగులపైనే నడిపారు.
ఫైనల్ థాట్
“సుందరకాండ” ఒక సెన్సిటివ్ కాన్సెప్ట్ తో చేసిన ఫన్-డ్రామా. ఫ్రెష్ ట్విస్ట్, లైట్ మూమెంట్స్ బాగానే ఉన్నాయి. కానీ స్క్రీన్‌ప్లే మరింత టైట్‌గా, ఎమోషనల్‌గా ఉంటే ఇది నారా రోహిత్ కు స్ట్రాంగ్ రిటర్న్ అయ్యేది. ఇప్పుడు మాత్రం మిక్స్‌డ్ ఫలితమే.