ఆ "ఒక్కటి" మిస్ అయింది
నట కిరీటి అందరికీ కడుపుబ్బా నవ్వించి, మెసేజ్ ఇచ్చిన సినిమా ‘ఆ ఒక్కటి అడక్కు’. అదే టైటిల్‌తో తాజాగా నరేష్ సినిమా చేశాడు. ఆ సినిమా ఎలా ఉందంటే..
ఒక పెళ్లి చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథ ఈ సినిమా అని రచయిత అబ్బూరి రవి విడుదలకు ముందు చెప్పాడు. ఒక సీరియస్ కథని, ఎమోషన్స్‌ని కలిపి ప్రేక్షకులకు వినోదాన్ని పంచేలా తీసిన సినిమా అనీ చెప్పాడు. పెళ్లి ఆలస్యం కావడం వల్ల మానసికంగా ఒత్తిడికి గురి అవుతున్న చాలా మంది యువతీ యువకులను దృష్టిలో పెట్టుకొని, అనేక ఆసక్తికరమైన అంశాల్ని కలగలిపి తీసిన సినిమా అని కూడా చెప్పాడు. గతంలో అల్లరి నరేష్ తండ్రి ఈవీవీ సత్యనారాయణ ఇదే పేరుతో రాజేంద్రప్రసాద్ హీరోగా తీసిన సినిమాకు దీనికి ఎటువంటి సంబంధం లేదని అల్లరి నరేష్ చెప్పాడు. రెండు వేటికవి భిన్నంగా ఉంటాయని చెప్పారు. మొత్తం మీద చివరి వరకు నవ్వులు పంచుతూ, ఆఖరిలో ఒక సందేశాన్ని ఇచ్చామని చెప్పాడు. రెండు గంటలపాటు బాధలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునే సినిమా ఇది అని అల్లరి నరేష్ చెప్పుకొచ్చాడు. పై అంశాలన్నీ సినిమాల్లో ఉన్నాయో లేదో ఒకసారి చూద్దాం.
దాదాపు పాతిక సంవత్సరాల క్రితం వచ్చిన "ఆ ఒక్కటి అడక్కు" సినిమాకు, అదే పేరుతో ఇప్పుడు వచ్చిన ఈ సినిమాకు సంబంధం లేదు. మొదట వచ్చిన సినిమా ఆద్యంతం నవ్వులను పంచింది. మొదటి సినిమాలో ఆ ఒక్కటి అన్నది హీరో రాజేంద్రప్రసాద్, రంభల మధ్య జరగాల్సిన మొదటి రాత్రి. ఈ సినిమాలో ఆ ఒక్కటి హీరో పెళ్లి గురించి. కొత్త దర్శకుడు మల్లి అంకం కొన్ని కోట్ల రూపాయల మ్యాట్రిమోనీ స్కామ్ నేపథ్యంలో సినిమా తీయాలి అనుకున్నాడు. దాన్ని హీరో పెళ్లితో ముడిపడేలా చూసుకున్నాడు. ఒక ఇంటర్వెల్ ట్విస్ట్, చివర్లో కోర్టు సీను బాగానే రాసిన అబ్బూరి రవి, నవ్వులు పూయించే డైలాగులు సరిగా రాసుకోలేకపోయాడు. దర్శకుడు కూడా సినిమాను ఎలా తీయాలి అన్న దానిమీద సరైన హోంవర్క్ చేయలేదు. అందుకే సినిమా ఎలా పడితే అలా నడిచింది. ఈ సినిమాలో స్పష్టంగా కనిపించకుండా పోయిన విషయం హాస్యం. ఆ ఒక్కటి లేకుండా చాలా స్లోగా, కొన్నిచోట్ల బోరింగ్‌గా, మరికొన్ని చోట్ల కాసింత నవ్వించేలా తీసిన సినిమా ఇది.
దర్శకుడికి అనుభవం లేకపోవడం ఒక ఎత్తు, సరిగా రాసుకోలేకపోవడం మరో ఎత్తు, వినోదాన్ని సందేశాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వల్ల ఈ సినిమా అస్పష్టంగా, గందరగోళంగా తయారయింది. సరే, అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు నవ్వించే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. నిజానికి ఓటీటీలో యాక్షన్ థ్రిల్లర్‌గా తీయవలసిన సినిమాని, కొన్ని నవ్వుల రంగులను కలిపి, వినోదాన్ని కాస్త చిలకరించి థియేటర్లో ప్రదర్శించాల్సిన సినిమాగా తీశారు. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు పెద్దగా లేవు. ఒకటి రెండు పాటలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతాయి అంతే. ఇలాంటి సినిమాల్లో ఫోటోగ్రఫీ, సౌండ్‌కు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఇందులో కూడా దర్శకుడు వీటికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కథ, మాటలు రాసిన అబ్బూరి రవి, కొంతవరకు ప్రయత్నం చేసినప్పటికీ, నవ్వుల దారంలో చక్కగా పేర్చవలసిన సన్నివేశాల పువ్వులను కుప్పగా మాత్రం పోసేసి అలరించే ప్రయత్నం చేశాడు.
చివర్లో కోర్టు సన్నివేశం లాజిక్‌కి చాలా దూరంగా ఉన్నా, కొంత మ్యాజిక్ చేసే ప్రయత్నంలో కాసింత సఫలమైంది. అలనాటి నటి గౌతమి జడ్జిగా హుందాగా కనిపించింది. చక్కటి టాలెంట్ ఉన్న నటుడు మురళీ శర్మ లాయర్‌గా తన వంతు ప్రయత్నం చేశాడు. ఈయనకు ఒక ప్రధాన పాత్ర ఇచ్చి ఉంటే బాగుండేది అని ప్రేక్షకులకు అనిపిస్తే అది ఆయన తప్పు కాదు. ఇక నటీనటుల్లో నరేష్ స్లో అయిపోయాడు అని అర్థమవుతుంది. నటనపరంగా ఓకే అయినప్పటికీ, పాత్ర పరంగా న్యాయం చేయలేకపోయాడు. ఇదివరకు "జాతి రత్నాలు" సినిమాలో నటించిన ఫరియా అబ్దుల్లా కొంత వరకు పరవాలేదు. మ్యాట్రిమోనీ నడిపే మేనేజర్ పాత్రలో హరితేజ చేసిన ప్రయత్నం అక్కడక్కడ నవ్విస్తుంది.
అదేమని దర్శకుడిని అడిగితే, "ఆ ఒక్కటి అడక్కు" అనే పరిస్థితిని రచయిత అబ్బూరి రవి, యువ దర్శకుడు మల్లి అంకం కలిసి సృష్టించుకున్నారని చెప్పొచ్చు. ఇంతకుముందు నటుడు నరేష్, దర్శకుడు రచయిత చెప్పినట్లు వినోదాన్ని, సందేశాన్ని కలిపి ఇచ్చిన ఈవివి సత్యనారాయణ సినిమా "ఆ ఒక్కటి అడక్కు" కు దీనికి ఎటువంటి సంబంధం లేదు. దాంతో దీన్ని పోల్చడం అనేది సరైనది కాదు. రెండు గంటల 14 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో 14 నిమిషాల పాటు "నవ్వు" కనిపించింది. రెండు గంటల సినిమా ప్రేక్షకులు నవ్వు కోసం వేచి చూడడంలో గడిచిపోతుంది. అదే ఈ సినిమాకు మైనస్ అయింది. ప్రేక్షకులను ఊరించి, ఊరించి ఎన్నో వాయిదాల తర్వాత విడుదలైన ఈ సినిమా చివరికి ఉసూరుమనిపించింది.
తారగణం: అల్లరి నరేష్,ఫారియాఅబ్దుల్లా,వెన్నెలకిషోర్,జామీలివర్,హర్ష చెముడు, మురళి శర్మ, అనీష్ కురవిల్ల, అరియానా గ్లోరీ
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం :మల్లి అంకం
మాటలు,రచనా సహకారం: అబ్బూరి రవి
సంగీత దర్శకుడు: గోపీ సుందర్
సినిమాటోగ్రాఫర్: సూర్యా
ఎడిటర్: ఛోటా కె. ప్రసాద్
నిర్మాత :రాజీవ్ చిలక
నిర్మాణ సంస్థ: చిలక ప్రొడక్షన్స్
విడుదల తేది:3 మే 2024