అడాలసెన్స్ (Adolescence):ఎక్కడ విన్నా ఈ సీరిస్ గురించే, ఏముంది ఇందులో?
x

అడాలసెన్స్ (Adolescence):ఎక్కడ విన్నా ఈ సీరిస్ గురించే, ఏముంది ఇందులో?

ఓటీటీలలో అనేక సీరిస్ లు వస్తుంటాయి, పోతుంటాయి. అలా ఇప్పుడు ప్రపంచమంతటా మాట్లాడుతున్న బ్రిటన్ సీరిస్ ఎలా ఉందో చూద్దాం

ఓటీటీలలో అనేక సీరిస్ లు వస్తుంటాయి, పోతుంటాయి. అనేక వైవిధ్యమున్న కంటెంట్ ని అన్ని దేశాల నుంచి మనవాళ్ల ముందుకు వస్తున్నాయి. నెట్ ప్లిక్స్,అమెజాన్ వంటి అంతర్జాతీయ ఓటీటీ సంస్దలు వీటిని మన ముందుకు తెస్తున్నాయి. అయితే వాటిలో కొన్నే మనం చూడగలం, మాట్లాడగలం. అలా ఇప్పుడు ప్రపంచమంతటా మాట్లాడుతున్న బ్రిటన్ సీరిస్... అడాలసెన్స్ (Adolescence).

ముఖ్యంగా మన దేశంలో ఈ సీరిస్ కు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. అనురాగ్ కశ్యప్, కరణ్ జోహార్, జాహ్నవి కపూర్ వంటివారు ఈ సీరీస్ గురించి ఇప్పటికే మాట్లాడారు. మన తెలుగువారు సోషల్ మీడియాలో ఈ సీరిస్ గురించి చాలా మాట్లాడుతున్నారు. ఇక యీ సిరీస్ ని UK లోని స్కూల్స్ లో చూపించాలని.. UK ప్రధాన మంత్రి అన్నారు. ఏముంది ఇందులో ఇంతలా జనాలని హత్తుకోవటానికి?

ఈ నాలుగు పార్ట్ ల బ్రిటన్ డ్రామా ఇప్పుడు 71 దేశాల్లో నెట్ ప్లిక్స్ లో నెంబర్ వన్ షో గా ప్రసంశలు అందుకుంటూ ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఉన్న తల్లి,తండ్రులు ఈ సీరిస్ ని తమ కోసమే తీసారన్నట్లు, ఇందులో కొన్ని విషయాలు తాము తెలుసుకోవాల్సినవి ఉన్నాయని అంటున్నారు. సోషల్ మీడియా ఇన్ఫూలియన్స్, టీనేజర్స్ జీవితాలు వాటితో ఎలా ముడి పడుతున్నాయో, ఎలా ప్రభావితం అవుతున్నాయో, ఆడవాళ్లపై హింస కు వీటితో కారణాల కు లింక్ పెట్టి మరీ చూపించారు.

టీనేజ్ పిల్లల మనస్తత్వం ఏ కాలంలో అయినా పట్టుకోవటం జనరేషన్ గ్యాప్ ఉండే పేరెంట్స్ కు కష్టమే. ముఖ్యంగా కౌమార ప్రాయంలో ఉండే విషయాలను మారుతున్న తరానికి అణుగుణంగా మారే పరిస్థితులకు తగినట్లుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఈ స్పీడ్ యుగంలో కష్టమే. మనమందరం ఆ ఏజ్ దాటి వచ్చినవాళ్లు,వాటి గురించి మాట్లాడేది ఏముంది అన్నట్లుగా తల్లిదండ్రులు ప్రవర్తిస్తుంటారు. అయితే అసలు ఆ వయస్సు ని అర్థం చేసుకోవడం, ఆ క్షణాల ఆలోచనలను, వాటిని ప్రభావితం చేస్తున్న సోషల్ మీడియాను అర్థం చేసుకోవడం మరీ మరీ కష్టం. అదే విషయం అరటిపండొలిచినట్లు ఓ డ్రామాగా చేసి చూపించారు.

ఫోన్ వదలని పిల్లలను,సోషల్ మీడియాలో నిరంతరం మునిగితేలే యూత్ ని, ఎమోజీల దాడి వెనక ఉండే విషయాలను పట్టిచ్చే సాధనం ఏది. అదే ఈ సీరిస్ లో జరిగింది. అందుకే చాలా మందికి నచ్చుతోంది. ఎక్కడా తల పక్కకు తిప్పని స్క్రిప్ట్, మనలో ఉప్పెన లాంటి ఆలోచనలును రేకెత్తించే సీన్స్ ఈ సీరిస్ ని మస్ట్ వాచ్ గా మార్చేసాయి.

టెక్నికల్ గానూ ఎక్కడా కట్ అనేది లేకుండా సింగిల్ లాంగ్ టేక్ లతో నడిపించారు. అయితే ఆ విషయం కూడా కంటెంట్ లో లీనమైన మనకు తెలియనివ్వని దర్శకత్వపు పనితనం ఆశ్చర్యపరుస్తుంది. మనస్సంతా ఉక్కపోత లాంటి వాతావరణం అలుముకుంటుంది. సోషల్ మీడియాలో ఏం చూస్తున్నరనేదాని కన్నా, ఆ చూసే దాని ప్రభావం అప్పుడిప్పుడే పసితనం వదిలించుకునే టీనేజ్ పిల్లలపై ఏ మేరకు ఉంటుందనేది ఇక్కడ ప్రధాన విషయం.

కథగా చెప్పుకోవటానికి పెద్దగా ఏమీ లేదు. కానీ అర్థం చేసుకోవడానికి,ఆలోచనలో పడటానికి చాలా ఉంది. ఈ సీరిస్ లో 13 ఏళ్ల పిల్లాడు జమీని పోలీసులు హత్యా నేరం కింద అరెస్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది. అసలు అతను హత్య చేసాడా..చేస్తే అందుకు ప్రేరేపించిన కారణాలు ఏమిటి, అతనికేం కావాలని హత్య చేసాడు. చివరగా హత్య సమాజంలో భాగమైన సోషల్ మీడియా చేసిందా, అసలేం జరిగిందనేది ఇంట్రస్టింగ్ గా చెప్పుకొచ్చారు. ఇందులో జమీ మిల్లర్ పాత్రలో చేసిన ఓవన్ కూపర్ Owen Cooper మనింట్లోనే లేక మన చుట్టాలబ్బాయో అనిపిస్తాడు. ఇందులో సైకాలజిస్ట్ ఎపిసోడ్ హైలెట్.

అనురాగ్ కశ్యప్ వంటి విషయ జ్ఞానం ఉన్న దర్శకుడు ఇండియాలో ఉన్న నెట్‌ఫ్లిక్స్ నిర్వాహకులు ఎందుకు అలాంటి కథలు తెరకెక్కించే ప్రయత్నం చేయరు అని ఘాటుగానే ప్రశ్నించారంటేనే ఈ సీరిస్ గొప్పతనం అర్దం చేసుకోవాలి. "అలాంటి షోస్ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే ధైర్యం, నిజాయితీ, నైతికత మీకు లేవు" అని అని తేల్చి పారేసారు. అందుకే అడాలసెన్స్ లాంటి షోను మీరు ప్రొడ్యూస్ చేయలేరని అనురాగ్ అన్నారు. మీకు ( నెట్‌ఫ్లిక్స్ ఇండియా మేనేజ్మెంట్ ) నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్స్ పెంచుకోవడంపై ఉన్న ఆసక్తి కంటెంట్‌పై లేదని తిట్టిపోసారు.

ఏదైమైనా నెట్ ప్లిక్స్ లో పనికొచ్చే కంటెంట్ ని అప్పుడప్పుడు తెస్తోంది.రీసెర్చ్ మెటీరియల్ లాంటి ఈ సీరిస్ రాసిన Jack Thorne... Stephen Graham లు, దర్శకుడు ఫిలిప్ Philip Barantini కలిసి మన ప్రపంచాన్నే , మనకి తెలియని విషయాలను మన ముందు ఉంచారు. చూస్తే కాస్త డిస్ట్రబ్ గా అనిపించవచ్చు కానీ ఖచ్చితంగా చూడాల్సిన సీరిస్ . సీరిస్ చూసాక సోషల్ మీడియా, ఆన్‌లైన్ ఫోరంస్ విషయంలో మనం ఎంత కఠినంగా ఉండాలో, మన పిల్లలను ఎంత జాగ్రత్తగా వీటి ప్రభావం నుంచి కాపాడుకోవాలో అర్థమవుతుంది.

ఈ సీరీస్ గురించి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు,నిర్మాత కరణ్ జోహార్ మాట్లాడుతూ.. "పిల్లల పెంపకం కష్టమైన బాధ్యత అని నాకు ఎప్పుడూ తెలుసు, అయితే అందుకు ఏ పుస్తకం లేదా పాడ్‌క్యాస్ట్ మిమ్మల్ని సిద్ధం చేయదు లేదా తల్లిదండ్రులుగా మీ యొక్క బెస్ట్ వెర్షన్‌ చూపించటం మీకు నేర్పించదు … " Adolescence సిరీస్ కంటే ఎక్కువ, ఇది ఎప్పటికీ పాఠం,నేను కవలలను పెంచుతున్నాను … వారి పెంపకం విషయంలో నా అవగాహనను పెంపొందించినందుకు ఈ షోకు ధన్యవాదాలు" ." అన్నారు.

Read More
Next Story