
ఓటిటీలకు సెన్సార్ ఉందా లేదా? క్లారిటి ఇచ్చిన కేంద్రం
స్పష్టతతో ముగిసిన గందరగోళం
గత కొంతకాలంగా ఇంటర్నెట్ కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్న చర్చలు అంతటా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపధ్యంలో ఓటిటీల విషయంలో మాత్రం కేంద్రం ఒక స్పష్టమైన గీత గీసింది. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫాంలపై కొత్త నియమాలు తెస్తున్నా, ఓటిటీలకు సెన్సార్ బోర్డు నియంత్రణ ఉండదని కేంద్రం మరోసారి తేల్చిచెప్పింది. ఇటీవలి లోక్‌సభ సమాధానాలు ఈ అంశంపై నెలకొన్న సందేహాలకు పూర్తిగా తెరదించాయి.
సినిమాలకే సెన్సార్...ఓటిటీలకు కాదు
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలను సీబీఎఫ్‌సీ సర్టిఫికేషన్ చేయాల్సిందే. కానీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ఓటిటి ప్లాట్‌ఫాంల కంటెంట్ సెన్సార్ బోర్డు పరిధిలోకి రాదని కేంద్రం స్పష్టంగా చెప్పింది. డిజిటల్ కంటెంట్‌కు సినిమాటోగ్రాఫ్ యాక్ట్ వర్తించదని, ఓటిటీలను పూర్తిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 కిందనే నియంత్రిస్తున్నామని వెల్లడించింది.
సెన్సార్ లేదంటే నియంత్రణ లేదన్న మాట కాదు
ఇక్కడే చాలామందికి కలిగే సందేహాన్ని కేంద్రం తొలగించింది. ఓటిటీలకు సెన్సార్ బోర్డు లేకపోయినా, నియంత్రణ లేకుండా వదిలేశారని అర్థం కాదు. ఐటీ రూల్స్‌లోని కోడ్ ఆఫ్ ఎథిక్స్ ప్రకారం చట్టానికి విరుద్ధమైన కంటెంట్, అశ్లీలత, పిల్లలకు హానికరమైన అంశాలు ప్రసారం చేయకూడదు. కంటెంట్‌ను వయస్సుల ఆధారంగా వర్గీకరించడం ఓటిటీల బాధ్యత.
మూడు స్థాయిల పర్యవేక్షణ వ్యవస్థ
ఓటిటీల కంటెంట్ నియంత్రణకు మూడు దశల వ్యవస్థ అమలులో ఉంది. మొదటగా సంబంధిత ఓటిటి ప్లాట్‌ఫామ్ స్వయంగా ఫిర్యాదులను పరిష్కరించాలి. అక్కడ న్యాయం జరగకపోతే, ఓటిటీలే ఏర్పాటు చేసిన స్వ నియంత్రణ సంస్థలు జోక్యం చేసుకుంటాయి. చివరగా కేంద్ర ప్రభుత్వం తుది పర్యవేక్షణ చేస్తుంది. అంటే సెన్సార్ ముందు అనుమతి లేదు కానీ తర్వాత పూర్తి బాధ్యత తప్పదు.
చర్యలు లేకపోలేదు....43 ఓటిటీలకు బ్రేక్
కేంద్రం మాటలకే పరిమితం కాలేదని ఇప్పటికే జరిగిన చర్యలే సూచిస్తున్నాయి. అశ్లీల కంటెంట్ ప్రదర్శించిన కారణంగా 43 ఓటిటి ప్లాట్‌ఫాంల యాక్సెస్‌ను నిలిపివేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇది ఓటిటీలకు స్పష్టమైన సందేశం. సెన్సార్ లేకపోయినా, నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.
సోషల్ మీడియాతో పోలిస్తే ఓటిటీల స్థితి వేరు
సోషల్ మీడియాపై కేంద్రం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. డీప్‌ఫేక్స్, ఏఐ ఇంపర్సనేషన్, అశ్లీలత వంటి కంటెంట్‌పై 24 నుంచి 72 గంటల్లో తొలగించాల్సిన నిబంధనలు అమలులో ఉన్నాయి. 50 లక్షలకుపైగా యూజర్లు ఉన్న ప్లాట్‌ఫాంలకు ఆటోమేటెడ్ నిఘా, స్థానిక అధికారుల నియామకం, కంప్లయన్స్ రిపోర్ట్స్ తప్పనిసరి. అయితే ఈ కఠినత్వం ఓటిటీలపై సెన్సార్ బోర్డు రూపంలో లేదు.
మొత్తం సారాంశం ఇదే
ఓటిటీలకు సెన్సార్ లేదు అనే విషయం ఇప్పుడు పూర్తిగా క్లియర్. సినిమాల్లా ముందే కత్తెర పడే పరిస్థితి లేదు. కానీ స్వేచ్ఛ పేరుతో చట్టాన్ని దాటే అవకాశం కూడా లేదు. కేంద్రం తీసుకున్న తాజా వైఖరి ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. ఓటిటీలకు సెన్సార్ లేదు, కానీ బాధ్యత మాత్రం తప్పనిసరి. ఇదే ఈ డిజిటల్ యుగంలో ప్రభుత్వం చెప్పిన అసలు లైన్.

