ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా?
x
Source: Twitter

ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా?

మల్టీస్టారర్ ట్రెండ్ ప్రస్తుతం బాగా నడుస్తోంది. కానీ ఈ ట్రెండ్‌ ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్ హయాంలో సెట్ చేశారని తెలుసా..? వాళ్లు కలిసి ఎన్ని సినిమాలు చేశారో తెలుసా..?


ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీస్‌లో మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తోంది. దాదాపు ప్రతి దర్శకుడు కూడా ఇద్దరు ముగ్గరు హీరోలను పెట్టి బాక్సా‌ఫీస్ కొట్టేయాలని ప్లాన్స్ చేస్తున్నారు. నిర్మాతలు కూడా మల్టీస్టారర్ సినిమాలతో కుంభస్థలాన్ని కొట్టేయాలని ఆశపడుతున్నారు. కానీ హీరోలే అంతగా ఒప్పుకోవట్లేదు. అయినా నిర్మాతలు, దర్శకులు నానా తిప్పలు పడి హీరోలను ఒప్పించి మల్టీస్టారర్ సినిమాలు తీస్తున్నారు. దీంతో మల్టీస్టారర్ ట్రెండ్ పెరుగుతోందని అందరూ అనుకుంటున్నారు. కానీ మన టాలీవుడ్‌లో మల్టీస్టారర్ ట్రెండ్ మొదలైంది ఇప్పుడు కాదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం అందుకున్న లెజెండ్రీ హీరోలు ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్‌లో మల్టీస్టారర్ సినిమాలకు కేరాఫ్‌ అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఇప్పటికి కూడా మల్టీస్టారర్ మూవీస్‌లో వీళ్లదే రికార్డ్.


ఇద్దరూ ఇద్దరే

ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్ తెలియని తెలుగువాడు ఉండడనడంలో అతిశయోక్తేమీ లేదు. వారిద్దరూ కలిసి చేసిన అనేక సినిమాలు ఇప్పటికీ హిట్ మూవీస్‌గా ఉంటాయి. వీరు తమ సోలో సినిమాలను చేస్తూనే ఈ మల్టీస్టారర్ సినిమాలతో దుమ్మురేగ్గొట్టారు. వీరిద్దరూ కలిసి మొత్తం 14 సినిమాలు చేశారు. వాటిలో దాదాపు అన్ని సినిమాలు కూడా ఇప్పటికి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతూనే ఉంటాయి. ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్ కలిసి చేసిన ఏ సినిమా చూసినా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కూడా ఖుష్ అయిపోతారు. ఎందుకంటే సినిమాలో ఎక్కడా కూడా ఎవరూ తగ్గరు.. పెరగరు. ఇద్దరూ ఇద్దరే అన్నట్లు ఉంటారు. అదే వాళ్ల మల్టీస్టారర్ మూవీ హిట్ ఫార్ములా కూడా. ఇద్దరు హీరోల అభిమానులను ఒకే సినిమాతో సంతృప్తి పరచడం కూడా అంత ఈజీ పని కాదు. అది చేతకాకనే కొత్త తరం డైరెక్టర్లు మల్టీస్టారర్ సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పటికి కూడా కథ నచ్చి హీరోలు ఒప్పుకోవడమే తప్ప డైరెక్టర్లు ఒప్పించడం అంతంత మాత్రంగానే ఉంది.


ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్ కలిసి చేసిన సినిమాలివే


తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక సినిమాలు చేసిన హీరోల్లో ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్ పేర్లు తప్పక ఉంటాయి. అయితే మల్టీస్టారర్ సినిమాలు చేయడంలో కూడా వీరిదే రికార్డ్. వీళ్లు ఇద్దరూ కలిసి మొట్ట మొదటిసారి 1950లో వచ్చిన ‘పల్లెటూరి పిల్ల’ సినిమాలో కలిసి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు. అప్పట్లో ఈ సినిమా ఒక ప్రభంజనంలా మారింది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో అనడంతో సినిమాకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక సినిమా విడుదలైన తర్వాత దూర ప్రాంతాల నుంచి ఎడ్లబండ్లపై వచ్చి చూశారు ప్రేక్షకులు.


ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత వీరితో మరో మల్టీస్టారర్ చేయడానికి నిర్మాతలు క్యూ కట్టారు. ఆ మరుసటి ఏడాదే 1951లో ‘సంసారం’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాకు కూడా ప్రేక్షకుల ఆదరణ బాగానే లభించింది. ఆ తర్వాత వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలు కొన్నేళ్ల పాటు వరుసగా వచ్చాయి. 1954లో పరివర్తన, 1955లో మిస్సమ్మ, 1956లో తెనాలి రామకృష్ణ, 1956లో చరణదాసి, 1957లో మాయాబజార్, 1958లో భూకైలాస్ సినిమాలు వరుసగా వచ్చాయి. ఇవన్నీ అప్పట్లోనే భారీ కలెక్షన్లు రాబట్టాయి.


ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు ఒక్కసారిగా ఆగాయి. మల్టీస్టారర్ సినిమాలకు దాదాపు నాలుగేళ్లు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత 1962లో ‘గుండమ్మ కథ’ సినిమాతో వీరిద్దరూ మళ్లీ కలిసి తెరపై కనిపించారు. ఈ ఒక్క సినిమా మల్టీస్టారర్‌ సినిమాలకు వచ్చిన నాలుగేళ్ల గ్యాప్‌ను చిటికెలో అంటే చిటికెలో మరిచిపోయేలా చేసింది. ఆ సినిమాలో ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్ కంటే సూర్యకాంతం నటనకు ప్రేక్షకులు సెల్యూట్ చేశారు. ఎన్‌టీఆర్, ఏఎన్ఆర్ లాంటి దిగ్గజ నటులు కూడా ఆమె ముందు దిగదుడుపే అన్న విధంగా సూర్యకాంతంపై పొగడ్తలు కురిపించారు.


ఇదిలా ఉంటే ఆ తర్వాత 1963లో శ్రీకృష్ణార్జునయుద్ధం సినిమా వచ్చింది. ఇందులో కూడా ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్ కలిసి నటించారు. కృష్ణుడిగా ఎన్‌టీఆర్ చేయగా, అర్జునుడి పాత్రలో ఏఎన్‌ఆర్ మురిపించాడు. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరి మల్టీస్టారర్ సినిమాలకు గ్యాప్ వచ్చింది. 1977లో చాణక్య చంద్రగుప్త సినిమాలో మళ్లీ వీరిద్దరూ కలిసి నటించారు. 1978లో రామకృష్ణులు, 1981లో సత్యం శివం చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు లేవు. ఆ తర్వాత ఏడాది ఎన్‌టీఆర్.. రాజకీయాలవైపు అడుగు వేశారు.


(సేకరణ- వలేటి గోపీచంద్, విశ్రాంత ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆల్‌ఇండియా)



Read More
Next Story