ఆపరేషన్ వాలెంటైన్ మూవీ రివ్యూ
x

'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ రివ్యూ

చాలా వరకు సక్సెస్ అయిన "ఆపరేషన్". బాగా రీసెర్చ్ చేసి రాసుకున్న కథను కొంతవరకు బిగువైన కథనంతో, కొంతమంది నటీనటుల చక్కని నటన తో తీసిన సినిమా. మరిన్ని వివరాలు లోపుల


గత ఏడాది డిసెంబర్ 23 తేదీన విడుదల చేయాలనుకున్న " ఆపరేషన్ వాలెంటైన్", సినిమా వాయిదా పడిన తర్వాత ఫిబ్రవరి 16 కు విడుదల చేయాలనుకున్నప్పటికీ, మరోసారి వాయిదా పడి చివరకు మార్చి 1న థియేటర్లలో వచ్చింది. 45 కోట్ల బడ్జెట్ లో ఐదు కోట్లు విఎఫ్ఎక్స్ కోసం ఖర్చు చేశారు. హీరో హీరోయిన్లు కలిపి ఓ 10 కోట్లు తీసుకుంటే మిగిలిన 30 కోట్లలో సినిమాను భారీ స్థాయిలో తీశామని దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా విడుదలకు ముందే చెప్పాడు.2019 పుల్వామా దాడి లో సూసైడ్ బాంబర్ సి ఆర్ పి ఎఫ్ కాన్వాయ్ ని ఢీకొట్టగా 40 మంది దాకా జవాన్లు చనిపోయారు. తర్వాత, ప్రతీకారంగా భారతదేశ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ లోని బాలాకోట్ పై దాడి చేసి దాపు 300 మంది టెర్రరిస్టులను మట్టు పెట్టింది. ఇది సినిమా కథ. దీనికన్నా ముందు ఈ సంవత్సరం రిపబ్లిక్ డే ముందు రోజు ఇదే కథతో "ఫైటర్" హిందీ సినిమా వచ్చింది. అది ఓ మాదిరి సక్సెస్ అయింది.


ఈ సినిమానే బెటర్

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా గురించి చెప్పాలంటే, కొన్ని అంశాల్లో “ఫైటర్” కన్నా బెటర్ గా ఉంది. ఈ సినిమాకి సర్ప్రైజ్ ప్యాకేజీ 2017 మిస్ ఇండియా మానుషి చిల్లర్(అహనా గిల్ పాత్ర లో) బాగా రాణించింది. ఫైటర్ సినిమాలో(ఇదే పాత్రలో) దీపిక కన్నా బెటర్ అనిపించింది. ఈ అమ్మాయి కూడా కొంతకాలం పాటు భారత దేశ వివిధ భాషల సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది. గతంలో గని, గాండీవధారి అర్జున సినిమాలు అంత బాగా పోకపోవడం వల్ల కొంత వెనకబడిన వరుణ్ తేజ్ కెరీర్ గ్రాఫ్ ఈ సినిమాతో కొంత పైకి వెళ్ళవచ్చు.

ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య లవ్ కొంత ఆహ్లాదకరంగానే ఉంది. ఫైటర్ సినిమా కన్నా ఈ సినిమాలో చాలా వరకు మెరుగ్గా ఉన్న అంశాల్లో, విక్కి జే మేయర్ నేపథ్య సంగీతం. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ జెట్లతో తలబడినప్పుడు బ్యాగ్రౌండ్ లో పాట రావడం బాగుంది.. ఒకటి రెండు పాటలు వినదగ్గవిగా ఉండి, చూడడానికి కూడా బానే ఉన్నాయి. ఈ సినిమాకు మాటలు రాసిన బుర్ర సాయి మాధవ్ డైలాగులు పర్వాలేదు అనిపించే స్థాయిలో ఉన్నాయి. " ప్రతికారాలు తీర్చుకుంటూ పోతే దేశాలు మిగలవు. బోర్డర్లు మాత్రమే మిగులుతాయి" "భారతదేశమంటే గాంధీ దేశమే కాదు. సుభాష్ చంద్రబోస్ దేశం కూడా" అన్న ఒకటి రెండు డైలాగులు బాగున్నాయి. అయితే వరుణ్ తేజ్, మనుషి చిల్లర్ మధ్య జరిగిన సన్నివేశాల్లో సాయి మాధవ్ కలం బాగానే పనిచేసింది.

మూడ్ ని ఎలివేట్ చేసిన సంగీతం

ఈ సినిమాలో హరి వేదాంతం సినిమాటోగ్రఫీ ఆహ్లాదకరంగా ఉంది. ఈ సినిమా మూడ్ ని ఎలివేట్ చేయడంలో, సంగీతంతో కలిసి ఓ లెవెల్ కి తీసుకెళ్ళింది. ఇది సినిమాకు ఒక బలం. మరో అంశం ఆకాశంలో భారత పాక్ ఫైటర్ విమానాల మధ్య ఆకాశంలో జరిగిన యుద్ధ సన్నివేశాలు విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ అవి నిజమేనా అనిపించేలా ఉండడం సినిమాకు కలిసి వచ్చిన అంశం. ఇంకో ముఖ్యమైన అంశం దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాకు బానే రీసెర్చ్ చేయడం. ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన అంశాలు చాలా బాగా చిత్రీకరించాడు. గతంలో వచ్చిన ఫైటర్ సినిమా కన్నా ఇవి రియల్స్టిక్ గా ఉన్నాయి. ఈ విషయంలో దర్శకుడిని అభినందించాలి.

"50 కోట్ల బడ్జెట్ లో ఇలాంటి సినిమాని ఫినిష్ చేయడం అంటే మాటలు కాదు. స్క్రిప్ట్ పక్కాగా ఉండటం వల్లే అది కుదిరింది". అని నిర్మాత, దర్శకుడు చెప్పారు. ఇది కొంతవరకు నిజమే. ఈ సినిమాలో కథ కథనం కొంచెం టైట్ గానే ఉంది. అందుకే ఇది బెటర్ సినిమా అయింది. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమా కన్నా ముందు 2020 లో " ఎండ్ రన్(end run)" అనే షార్ట్ ఫిలిం తీశాడు. ఇది కూడా పుల్వామా దాడి తర్వాత, భారతదేశం ఎయిర్ ఫోర్స్ చేసిన " బాలా కోట్" ప్రతిదాడి ఇన్స్పిరేషన్తో తీసిన షార్ట్ ఫిలిం. అది బాగానే సక్సెస్ అయింది.

రాణించిన నటీనటులు
ఇంతకు ముందు చెప్పినట్లు ప్రధాన పాత్రధారులైన మానుషి చిల్లర్, వరుణ్ తేజ్ లు ఇద్దరు బాగానే చేశారు. అయితే ఇద్దరిలో మొత్తం మీద ఎక్కువ మార్కులు మానుషి చిల్లర్ కే పడతాయి. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ బాగానే కసరత్తు చేసినట్టు స్క్రీన్ మీద కనబడుతుంది. చాలా సన్నివేశాల్లో పరిణితి చెందిన నటనతో ఆకట్టుకుంటాడు. కానీ మనిషి చిల్లర మాత్రం సినిమా మొత్తం చక్కని నటన కనపరిచింది. చూడ్డానికి అందంగా ఉండడం అనేది అదనం. ఎయిర్ ఫోర్స్ కంట్రోల్ రూమ్ లో, తర్వాత ఒకటి వరుణ్ తేజ్ తో ఘర్షణ పడే సన్నివేశాల్లో చాలా మంచి నటన కనబరిచింది. ఈ సినిమా సక్సెస్ కావడానికి ఈమె ఒక ముఖ్యమైన కారణం. మిగతా నటీనటుల్లో ఉన్నది కొంచెం సేపు అయినా రుహాని శర్మ(తాన్యాశర్మ) కూడా ఆకట్టుకుంటుంది. ఈమె లో కూడా మంచి ఈజ్ ఉంది. మంచి భవిష్యత్తు కూడా ఉంది. ఈ సినిమాలో ఒకరిద్దరూ నటులు ఓవర్ డ్రమెటిక్ గా అనిపించినా సినిమా నడపడంలో నటీనటులది ముఖ్యమైన పాత్ర.

"టీం వర్క్" సఫలమైంది

దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ స్క్రిప్టును చాలా వరకు పకడ్బందీ గానే రాసుకున్నాడు. కథనంలో అక్కడక్కడ వేగం తగ్గినా, మొత్తంగా చూస్తే బాగానే నడిపాడు. ఇది మొదటి సినిమా అయినప్పటికి కూడా, ఒక ప్రొఫెషనల్ సీజన్ దర్శకుడిలా తీయడం ప్రశంసించదగ్గది. ఇతనికి కూడా భవిష్యత్తు ఉంది. ఫైటర్ హిందీ సినిమా చూసిన చాలామంది ప్రేక్షకుల కు ఈ సినిమా ఎక్కువగా నచ్చుతుంది. చూడని వారికి కూడా ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయి.
కొన్ని సన్నివేశాలు ఆశ్చర్యపోయేలా చిత్రీకరించడంలో శక్తి ప్రతాప్ సింగ్ సాంకేతిక బృందం విజయం సాధించింది. ముఖ్యంగా సినిమాకు ముఖ్యమైన ఇంటర్వెల్ ముందు వచ్చే) సన్నివేశాలను థ్రిల్లింగ్ గా తీయడంలో జట్టు సఫలం అయింది. ఈ సినిమా బాలా కోట్ లో తీవ్రవాదుల అడ్డాలపై ఎయిర్ ఫోర్స్ దాడి తర్వాత కొన్ని పరిణామాల గురించి ఊహించి చిత్రీకరించడం బాగానే ఉంది. నిడివి విషయంలో కూడా దర్శకుడు కొంత జాగ్రత్త తీసుకున్నట్టు అనిపిస్తుంది. నవీన్ నూలి ఎడిటింగ్ ఇందుకు సహకరించింది. ఈ మధ్యకాలంలో రెండు గంటలకు కొంచెం పైగా(132 నిమిషాలు) నిడివి తో వచ్చిన సినిమాలు తక్కువే.

బాగా రీసెర్చ్ చేసి రాసుకున్న కథను కొంతవరకు బిగువైన కథనంతో, కొంతమంది నటీనటుల చక్కని నటన తో తీసిన ఈ సినిమా కొన్ని లోపాలను పట్టించుకోకుండా ఉంటే చూడదగ్గ సినిమానే. గత సంక్రాంతి నుంచి ఇంతవరకు విడుదలైన చాలా సినిమాలు కన్నా ఈ సినిమా కొంచెం బెటరే అని చెప్పవచ్చు
అన్నట్టు ఈ సినిమాకు " ఆపరేషన్ వాలెంటైన్" అని పేరు పెట్టడానికి కారణం పుల్వామా దాడి జరిగింది 2019,ఫిబ్రవరి 14వ తేదీన!


దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ హడ
రచన: శక్తి ప్రతాప్ సింగ్ హ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్
తెలుగు డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
నిర్మాత :సందీప్ ముద్ద, నందకుమార్ అబ్బినేని
తారాగణం: వరుణ్ తేజ్, మానుషి చిల్లర్, రుహానీ శర్మ, అలీ రెజా, నవదీప్, మీర్ సర్వర్
ఛాయాగ్రహణం: హరి కే వేదాంతం
కూర్పు : నవీన్ నూలి
సంగీతం: మిక్కీ జె. మేయర్
నిర్మాణ సంస్థలు: సోనీపిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్, రెనాయ్సెన్స్ పిక్చర్స్
విడుదల తేదీ: 2024 మార్చి 1


Read More
Next Story