తలకిందులైన OTT .. సంక్రాంతి సంగతేమిటి?
పెద్ద నిర్మాతలు సినిమా థియేటర్ బిజినెస్ కన్నా ఓటీటీకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్న రోజులివి. ప్రేక్షకులు సైతం ఓటీటీ (OTT ) రిలీజ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు.
పెద్ద నిర్మాతలు సినిమా థియేటర్ బిజినెస్ కన్నా ఓటీటీకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్న రోజులివి. ప్రేక్షకులు సైతం ఏదైనా సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు ఓటీటీల్లోకి (OTT ) వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓటీటీ సంస్థల నుంచి నిర్మాతలకు రకరకాల సమస్యలు వస్తున్నాయి. రాబోయే సంక్రాంతి రిలీజ్‌లకు ఇది పెద్ద సమస్యగా మారిందని, రేట్లు విషయంలో చాలా కండీషన్స్ పెడుతున్నట్లు సమాచారం. నిర్మాతలు ఈ విషయమై డిస్కషన్స్ చేస్తున్నా తేలటం లేదు. అసలు ఎక్కడుంది సమస్య..ఓటీటీ అమ్మకాలలో ఏం జరుగుతోందనే విషయమై ఎక్సక్లూజివ్ స్టోరీ.
కరోనా – లాక్‌డౌన్ తర్వాత కొన్ని సినిమాలు డైరక్ట్‌గా థియేటర్లలోనే వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు అయితే ఓటీటీ ప్రేక్షకుల్ని ఉద్దేశించి చేసినవే . ఓటీటీ లో రిలీజ్ అవ్వాలనే రూల్ ప్రకారం థియేటర్‌లో ఓ వారం వేస్తున్నారు. వాళ్లు థియేటర్ రెవెన్యూ లెక్కలోకి తీసుకోవటం లేదు. అందుకు తగినట్లుగానే ఆ సినిమాలకు థియేటర్ జనం కూడా ఎవరూ ఉండటం లేదు. ఇది కేవలం తెలుగు సినిమాకే పరిమితం కాదు. అన్ని భాషల్లోనూ ఇదే పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఓటీటీలో.. నిర్మాతలను శాసించటంలో వింతేముంది?
చాలా పెద్ద సినిమాలు పైకి చెప్పకపోయినా ఓటీటీ అగ్రిమెంట్ అయ్యి వాళ్లు చెప్పిన తేదీకే థియేటర్ కు వస్తున్నారు. మొదట్లో ఓటిటిలపై నియంత్రణ తేవాలని నిర్మాతల మండలి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఓటీటీ రిలీజ్ కు థియేటర్ రిలీజ్ కు మధ్య గ్యాప్ ఎంత ఉండాలనే దానిపై చర్చలు జరిపి కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. అయితే అవేమీ చెల్లుబాటు కావడం లేదు. రూల్స్ పెట్టిన నిర్మాతలే తమ సినిమాలు దగ్గరకు వచ్చేసరికి రిజల్ట్ ని బట్టి మార్చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ సమస్య కొండలా మారింది.
ప్రతీ నిర్మాత ఓటీటీ సంస్దలు చుట్టూ ప్రదిక్షణాలు చేస్తున్నారు. మొదట్లో ఓటిటి సంస్దలు ..నిర్మాతలు చుట్టూ తిరిగి మీ సినిమాలు ఇవ్వండి అనే పరిస్థితి రివర్స్ అయ్యింది. ఓటీటీ సంస్దలకు కావాల్సిన కంటెంట్ కన్నా ఎక్కువ ఉండటమే అందుకు కారణం. రిలీజ్ కు ముందే ఏ ఓటీటీలో ఆ సినిమా వస్తుందనే విషయం బయిటకు వచ్చేస్తోంది. ఓటిటి ప్లాట్ ఫామ్ పేరుని పోస్టర్ల మీద, టైటిల్ కార్డ్స్‌లో వేసేస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్రాంతి సినిమాల రిలీజ్ లకు ఓటీటీ పెద్ద అడ్డంకిగా మారిందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఆ సమస్య ఏమిటి..ఏమిటా అడ్డంకి?
సంక్రాంతి 2025 సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో నిర్మాతలు చాలా టెన్షన్ గా ఉన్నారు. ఇంతకు ముంది తమ సినిమాకు సంక్రాంతికి థియేటర్స్ దొరుకుతాయా లేదా అనే టెన్షన్ ఉండేది. ఇప్పుడు ఓటీటీ స్లాట్ దొరుకుతుందా లేదా అనే పరిస్థితి. ఈ క్రమంలో రిలీజ్ డేట్ల మార్పులు ఎలా చేయాలనే చర్చ మొదలైంది. సినిమాల డేట్స్ మారితే ఓటీటీ వారు తీసుకునే రేట్లలో మార్పులు వచ్చేస్తున్నాయి అంటున్నారు. డిసెంబరులో రావాల్సిన సినిమాలు జనవరికి వెళ్తే ఓ సమస్య. అంటే ఓటీటీ లెక్కలు ప్రకారం ఒక నెల ఆలస్యంగా వస్తాయంటే మొదట అనుకున్నంత రేట్లు ఇవ్వలేం అని ఓటీటీలు చెబుతున్నాయని తెలుస్తోంది.
ఈ విషయంలో ఓటీటీ వారి వాదన ఏంటంటే....సంక్రాంతికు కేవలం థియేటర్స్‌కి మాత్రమే కాదు ఓటీటీలకు బాగా డిమాండ్ ఉంటుంది. కాబట్టి సంక్రాంతికి ముందే రిలీజై ఓటిటిలోకి వస్తే తమకు లాభం. అదే సంక్రాంతికి రిలీజైతే ఏ పిభ్రవరి లేదా మార్చిలోకి తమ స్ట్రీమింగ్ డేట్స్ వెళ్తాయి. అప్పుడు తమకు పెద్దగా డిమాండ్ ఉండదు కాబట్టి వ్యూయర్ షిప్ లాస్ వస్తుంది అని చెప్తున్నారు. నిర్మాతలకు అయితే సంక్రాంతికి సినిమా వస్తే కంటెంట్ ఏ మాత్రం బాగున్నా రికార్డ్‌లు క్రియేట్ చేస్తాయని నమ్మకం. దాంతో సంక్రాంతికి వచ్చే సినిమాలకు రేట్లు ఓటీటీ సంస్దల నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. రెండు కావాలంటే కుదరదు అని తేల్చి చెప్తున్నారు. ఇది నిర్మాతలకు పెద్ద సమస్య క్రిందే మారింది.
చిన్న సినిమాలకు ఇది సమస్య కాదు. కానీ సూపర్ స్టార్స్ సినిమాలకు మాత్రం ఇది పరిగణనలోకి తీసుకునే సమస్యే. దాంతో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఓ కొత్త ప్లాన్ తో నిర్మాతలు ముందుకు వస్తున్నారు. టాప్ ఓటీటీ సంస్దలు అయిన అమేజాన్ ప్రైమ్, నెట్‌ప్లిక్స్ ఓ కొత్త స్ట్రాటజీని ముందుకు తీసుకొచ్చారు. వాళ్లు కొంత అడ్వాన్స్ ను నిర్మాతలకు అగ్రిమెంట్ సమయంలో ఇస్తారు. సినిమా బాగుండి, కలెక్షన్స్ బాగుంటే ఓ రేటు, సినిమా తేడా కొడితే ఓ రేటు. అంటే రిలీజ్ తర్వాత రేటు పెంచాలా, తగ్గించాలా అనే విషయం డిసైడ్ చేస్తారు.
వంద కోట్లు దాటితే కొంత అమౌంట్ యాడ్ చేస్తారు. అదే రూ.200కోట్లు కలెక్షన్స్ దాటితే మరికొంత అమౌంట్ కలుస్తుంది. దాంతో ఓటీటీ ద్వారా ఎంత వస్తుంది రాబడి అనే క్లారిటీ నిర్మాతకు లేదు. గతంలో ఉన్న పరిస్థితి తలకిందులైంది. ఓటీటీ సంస్దలు రిలీజైన పెద్ద సినిమాలు థియేటర్స్ ఎలా ఆడుతున్నాయి అనే విషయమై దృష్టి పెడుతున్నాయి. ఓ రకంగా దీన్ని win-win సిట్యువేషన్ గా చెప్తున్నాయి ఓటీటీ సంస్దలు. నిర్మాతలకు ఇది మింగుడు పడని సిట్యువేషన్. శాటిలైట్ రైట్స్ విషయంలోనూ టీవి ఛానెల్స్ వారు ఇదే పద్దతిని ఫాలో అవుతున్నారు.