టాలీవుడ్ ఓవర్సీస్ కలెక్షన్లకు ట్రంప్ బ్రేక్
x

టాలీవుడ్ ఓవర్సీస్ కలెక్షన్లకు ట్రంప్ బ్రేక్

ఇక అమెరికా బిజినెస్ కరువేనా?

తెలుగులో ప్రతి పెద్ద సినిమా రిలీజ్‌ అప్పుడు ఓవర్సీస్ లెక్కల హడావిడి తప్పనిసరి. అమెరికాలో ఎన్ని స్క్రీన్లు దక్కుతున్నాయి, ప్రీమియర్ షోలు ఎన్ని చోట్ల జరుగుతున్నాయి, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎక్కడి వరకు వెళ్తాయన్న దానిపై అంతా దృష్టి కేంద్రీకరిస్తారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ లెక్కల ఆధారంగానే పెట్టుబడులు పెట్టే స్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ బంగారు బాటకే బ్రేక్ పడేలా ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన 100% టారిఫ్‌ నిర్ణయం అమల్లోకి వస్తే టాలీవుడ్‌ ఓవర్సీస్ బిజినెస్ మొత్తానికి పెద్ద దెబ్బ తగలనుంది. వివరాల్లోకి వెళితే...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ప్రకటించిన “100% టారిఫ్‌” నిర్ణయం ప్రపంచ సినిమా మార్కెట్‌ను షేక్‌ చేస్తోంది. ఈ కొత్త రూల్ ప్రకారం అమెరికా బయిట నిర్మితమైన ఏ సినిమా అయినా విడుదల కావాలంటే సమాన మొత్తంలో పన్ను కట్టాల్సి ఉంటుంది. అంటే ఒక సినిమాను మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేస్తే, ఇంకో మిలియన్‌ డాలర్లు పన్నుకే వెళ్ళిపోతాయి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే తెలుగు పరిశ్రమతో సహా భారతీయ సినిమాలన్నింటికీ భారీ దెబ్బ తగలనుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ఇది పెద్ద దెబ్బ.

అమెరికా మార్కెట్: టాలీవుడ్‌కు బంగారు బాట

భారతీయ సినిమాలకున్న అతిపెద్ద ఓవర్సీస్‌ మార్కెట్ అమెరికా. 30–40% వరకు వసూళ్లు అక్కడి నుంచే వస్తున్నాయి. కొన్ని సినిమాలు ఓవర్సీస్‌ కలెక్షన్లతోనే ఖర్చులు తిరిగి తెచ్చుకుంటున్నాయి. పెద్ద సినిమాలు మాత్రమే కాదు, మధ్యతరహా, చిన్న సినిమాలు కూడా అక్కడ విడుదలై మంచి ఆదాయం సాధిస్తున్నాయి.

తెలుగు సినిమాలకు 15–25 డాలర్ల మధ్య సాధారణ టికెట్‌, ప్రీమియర్‌ షోలకైతే 30 డాలర్ల వరకు వసూలు అవుతోంది. అమెరికా థియేటర్‌ కలెక్షన్లతో పాటు OTT డీల్స్ కూడా చాలా వరకు అక్కడి మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి. అంటే అమెరికా = లైఫ్‌లైన్. అలాంటి సమయంలో ట్రంప్‌ 100% టారిఫ్‌లు → బిజినెస్ మోడల్‌కే కుదుపు.

ఇప్పుడు దెబ్బ ఎక్కడ పడుతుంది?

కలెక్షన్లలో సగం నేరుగా పన్నుకే వెళ్ళిపోతుంది.

టికెట్ ధరలు రెట్టింపు అవుతాయి → ప్రేక్షకులు తగ్గిపోతారు.

చిన్న సినిమాలకు అమెరికా రిలీజ్ అసాధ్యం అవుతుంది.

OTT రైట్స్ కూడా ఖరీదవుతాయి → వినియోగదారుల సభ్యత్వ ధరలు పెరుగుతాయి.

అమెరికాలో ఇండియన్ ఆడియన్స్‌ ప్రాముఖ్యత

అమెరికా మొత్తం జనాభాలో భారతీయులు సుమారు 1.6%. వీరితో పాటు పాకిస్తానీలు, బంగ్లాదేశీలు, ఇతర దక్షిణాసియన్లు కూడా మన సినిమాలపై ఆసక్తి చూపిస్తారు. స్థానిక అమెరికన్లు కూడా విభిన్న కంటెంట్‌ కోసం భారతీయ సినిమాలు చూస్తున్నారు. అంటే అమెరికాలోని మన వాళ్ల మార్కెట్‌ కేవలం NRIలకు మాత్రమే కాదు, విస్తృతమైన ఆడియన్స్‌ బేస్‌ తో నడుస్తోంది.

హాలీవుడ్‌కూ కష్టం, కానీ టాలీవుడ్‌కే పెద్ద షాక్‌

ట్రంప్‌ ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం → హాలీవుడ్‌ని బలోపేతం చేయడం, అమెరికాలోనే షూటింగ్‌లు పెంచించడం. ఈ క్రమంలో ఇలా కేవలం అమెరికాలోనే షూట్ చేయాలనే నిర్ణయంతో హాలీవుడ్ స్టూడియోలకు కొంత భారమే అవుతుంది. కానీ టాలీవుడ్‌కి మాత్రం ఇది శరాఘాతం.

ఎందుకంటే మన సినిమాలు అమెరికాలో షూట్‌ చేయడం చాలా అరుదు → టారిఫ్‌ తప్పించుకునే మార్గం దాదాపు మూసుకుపోయింది.

అసలు సమస్య ఎక్కడ?

ప్రస్తుతం అమెరికా విదేశీ సినిమాల్ని డిజిటల్ గూడ్స్ / ఇంటెలెక్చువల్ ప్రాపర్టీగా పరిగణిస్తుంది. అందుకే సంప్రదాయ సుంకాలేవీ లేవు. టికెట్‌ అమ్మకాలపై రాష్ట్రాలవారీగా సాధారణ పన్నే. ఇప్పుడు ట్రంప్‌ నిర్ణయం ఆ ప్రాక్టీస్‌నే మార్చేస్తుంది.

లీగల్ యాంగిల్

కొంతమంది న్యాయనిపుణులు అంటున్నారు: టారిఫ్‌లు సాధారణంగా వస్తువుల (Goods) పైనే వర్తిస్తాయి. సినిమాలు, స్ట్రీమింగ్ రైట్స్ సర్వీసెస్ (Services) కిందకు వస్తాయి. కాబట్టి ట్రంప్‌ ఆర్డర్‌ కోర్టులో నిలబడకపోవచ్చు. అయినా పరిశ్రమలో భయం పెరుగుతోంది.

“ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ వస్తే సరిపోతుంది, మార్కెట్‌లో గందరగోళం మొదలవుతుంది. క్లారిటీ వచ్చేంతవరకూ డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడులకి వెనుకడతారు.” అని ట్రేడ్ అంటోంది.

టాలీవుడ్‌ భవిష్యత్తు?

ఇప్పటికే తెలంగాణలో టికెట్‌ ధరల పెంపుపై అనిశ్చితి నెలకొన్నది. దానికితోడు ఈ US టారిఫ్‌ షాక్‌... డబుల్ ఇంపాక్ట్. రాబోయే పెద్ద సినిమాలు ఓవర్సీస్‌ కలెక్షన్లను లెక్కలో పెట్టి బడ్జెట్‌లు పెంచుకున్నాయి . ఇప్పుడు వాటి రిస్క్ పెరుగుతుంది. ముఖ్యంగా చిన్న సినిమాల కలలు అమెరికా రిలీజ్ లేకుండా ఆగిపోవచ్చు.

ఫైనల్ గా..

అమెరికా మార్కెట్‌ టాలీవుడ్‌కు కేవలం ఓవర్సీస్‌ వసూళ్ల కోసం కాదు, మొత్తం ఇండస్ట్రీ ఆర్థిక వ్యవస్థకు బలమైన స్థంభం. ట్రంప్‌ 100% టారిఫ్‌లు అమల్లోకి వస్తే ఆ స్థంభాన్నే కొట్టేసినట్లే అవుతుంది. ఇప్పుడు వ్యాపారవర్గాలు, డిస్ట్రిబ్యూటర్లు, లీగల్ నిపుణులు కలిసి పరిష్కారం కనుక్కోకపోతే, టాలీవుడ్‌ డ్రీమ్‌ రన్‌కి గట్టి బ్రేక్‌ పడటం ఖాయం.

ఈ టారిఫ్‌లు అమల్లోకి వస్తే టాలీవుడ్‌కి “ఓవర్సీస్‌ కలలు” ఒక రాత్రిలోనే కఠిన వాస్తవాలుగా మారిపోతాయి.

Read More
Next Story