OMG 2 ...ఓటీటీ మూవీ రివ్యూ
అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ఓ మై గాడ్ 2 తెలుగు వచ్చేసింది. అసలు ఈ సినిమాకు అంత క్రేజ్ ఎందుకు..
లాస్ట్ ఇయర్ ఆగస్ట్‌లో ఓ మై గాడ్ 2(OMG2) వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం సినిమా ప్రియులకు గుర్తుండే ఉంటుంది. ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర భరతనాట్యమే చేసింది. రూ. 200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. 2012లో విడుదలైన ఓ మై గాడ్ చిత్రానికి ఇది సీక్వెల్. అక్షయ్ కుమార్ శివుడి దూత పాత్రలో ఆకట్టుకున్నారు. మొదట ఈ సినిమాపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డ్ కూడా A సర్టిఫికెట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఎన్నో వివాదాలను కూడా ఎదుర్కొంది. అయినా ఈ చిత్రం అన్నింటినీ దాటుకుని వచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
గతేడాది బాలీవుడ్‌లో హైయ్యెస్ట్ కలెక్షన్స్ అందుకున్న టాప్ టెన్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. వరస ఫ్లాపుల్లో ఉన్న అక్షయ్ కెరీర్‌కు కాస్త బూస్ట్ ఇచ్చింది. అలానే ఓటీటీలోనూ హిందీ వెర్షన్లో విడుదలై మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. దాంతో ఈ మూవీ తెలుగులో కూడా వస్తే బాగుండు అని తెలుగు తమ్ముళ్లు ఉత్సాహపడ్డారు. చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే అది కార్యరూపం దాల్చటానికి ఏడాది పట్టింది. మొత్తానికి నెట్ ప్లిక్స్ ఓటిటి కరుణించింది. తెలుగు వెర్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
తొమ్మిది నెలల తర్వాత ఇప్పుడు గురువారం(ఏప్రిల్ 25) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌తో పాటు పంకజ్ త్రిపాఠి, యామి గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అమిత్ రాయ్ దర్శకత్వం వహించారు. ఇంతకీ ఇందులో అంతగా ఎదురుచూసేటంత కంటెంట్ ఏముంది.. వివాదం కాకుండా అంటే...
చిత్రం కథచూస్తే...
పరమ శివుడికి మహా భక్తుడు కాంతి శరణ్ ముద్గల్ (పంజక్ త్రిపాఠి) . ఆయనది మహాకాల్ నగరిలో కాంతి శరణ్ ముద్గల్ (పంజక్ త్రిపాఠి) పూజా సామగ్రి అమ్మే షాప్. ఆయనకో కొడుకు వివేక్ (ఆరుష్ వర్మ), కూతురు దమయంతి. హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూంటాడు. అయితే ఊహించని విధంగా వయాగ్రా ఎక్కువ డోసేజ్ తీసుకోవటంతో వివేక్ ఒక రోజు ఆసుపత్రి పాలవుతాడు. మరో పక్క స్కూల్ టాయ్‍లెట్‍లో వివేక్ హస్తప్రయోగం చేసుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది.
దీంతో స్కూల్ ప్రిన్సిపాల్ అటల్ నాథ్ మహేశ్వరి (అరుణ్ గోవిల్).. వివేక్‍ను స్కూల్ నుంచి తీసేస్తారు. ఫ్యామిలీని తీసుకొని వేరే ఎక్కడికైనా వెళ్లాలని ముద్గల్‍కు ప్రిన్సిపాల్ సూచిస్తారు. పరువు పోయిందని భావించిన ముగ్దల్ కుటుంబాన్ని తీసుకుని ఆ ఊరు నుంచి వెళ్లిపోవాలనుకుంటాడు. అదే సమయంలో శివుని దూత (అక్షయ్‌కుమార్) ప్రత్యక్షమవుతాడు. ముగ్దల్‌తో కుమారుడు చేసిన పనికి భయపడి పారిపోకుండా దానిపై పోరాటం చేయాలని సూచిస్తాడు.
మరి ఆ దేవదూత మాటలు విన్న ముగ్దల్ ఎలాంటి పోరాటం చేశాడు? అందుకు అతడు ఎంచుకున్న మార్గం ఏంటి? పరిస్థితి కోర్టు వరకూ ఎందుకు వచ్చింది? ముద్గల్ ఎలా పోరాడారు? ఆయనకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? విజయం సాధించారా లేదా? అనేదే ఈ సినిమా ప్రధానమైన కథ.
భారతదేశ జనాభా 140 కోట్లు. శృంగారం గురించి మాట్లాడితే అందరూ ఛీ అంటారు. మన భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ ఇప్పటికీ నిషిద్ధమైన వ్యవహారమే. అయితే ఇప్పుడిప్పుడే డిజిటల్ మీడియా ప్రవేశంతో సెక్స్ ఎడ్యుకేషన్ డైరక్ట్‌గా కాకపోయినా ఇండైరక్ట్‌గా అయినా జరుగుతోంది. అలాగే ఈ సినిమా కూడా సెక్స్ ఎడ్యుకేషన్ అవసరాన్ని నొక్కి చెప్తుంది. అందుకోసం దేవుళ్ల సాయం తీసుకుంది. అలాగే వ్యంగ్య ధోరణి అనుసరించింది.
పిల్లలకు లైంగికపరంగా అనవసర భయాలు ఉంటే ఎంత ఇబ్బంది పడతారు. మానసికంగా ఎలా కుంగిపోతారో వివరించే ప్రయత్నం చేశారు. సమాజంలోని చాలా విషయాలను ఆ కథలో ప్రస్తావించారు. సినిమా ఫన్‌గా బాగుంటుంది. స్క్రీన్‍ప్లే కూడా గ్రిప్పింగ్‍గా ఉంది. పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ ఎందుకు ముఖ్యమో ఈ చిత్రంలో చెప్పారు దర్శకుడు. అలాగే సినిమాలో కోర్టు సీన్స్ ఎక్కువగా ఉన్నా.. ఎక్కడా బోర్ అనిపించదు. కామెడీ డైలాగులతో సున్నితమైన విషయాన్ని సింపుల్‌గా చెప్పారు.
చూడచ్చా
తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన సినిమా ఇది.
ఎక్కడ చూడచ్చు
నెట్‌ఫ్లిక్స్‌లో (తెలుగులో ఉంది)