మార్కెట్ మ‌హాల‌క్ష్మీ  ఓటిటి రివ్యూ
x

'మార్కెట్ మ‌హాల‌క్ష్మీ' ఓటిటి రివ్యూ

ఓటీటీలో దూకుడుమీదున్న సినిమా ‘మార్కెట్ మహాలక్ష్మీ’. చిన్నా బడ్జెట్ సినిమా అయినా.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పెద్ద సినిమాలకు తీసిపోవడం లేదు. ఈ సినిమా ఎలా ఉందంటే..


ఓటిటిలో కామెడీ లవ్ స్టోరీలు బాగానే నడుస్తున్నాయి. అవి ఏ భాష అయినా, అందులో ఎవరు హీరో అయినా పట్టించుకోకుండా జనం చూసేస్తున్నారు. అయితే ఒకటే కండీషన్ కంటెంట్ బాగుండాలి. బాగుందని చెప్పుకోవాలి. ఈ విషయంలో మలయాళ సినిమాలు ముందు ఉంటున్నాయి. ఆహా ఓటీటీ మొదట్లో మలయాళ డబ్బింగ్ సినిమాలతోనే కాలక్షేపం చేసింది. ఇప్పుడు తెలుగు చిన్న సినిమాలను కూడా స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ క్రమంలో వచ్చిందే మార్కెట్ మహాలక్ష్మి . కేరింత ఫేమ్ పార్వతీశం ఉండటంతో ఫన్ కు లోటు ఉండదనే నమ్మకం జనాలకు ఉంది. ఆ ఫన్ ఏ మేరకు సినిమాలో పండింది. అసలు ఈ కథేంటి వంటి వివరాలు చూద్దాం.

స్టోరీ లైన్

హీరో(పార్వతీశం) మొదటి నుంచి తండ్రి(కేదార్ శంకర్) చాటు బిడ్డ. తనకు స్థాయి లేకపోయినా కొడుకుకు ఓ స్థాయి ఉండాలని, అమెరికా వెళ్లాలని డబ్బులు అప్పు చేసి మరీ ఇంజినీరింగ్ చదివిస్తాడు. హీరోగారు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవుతాడు. ఇక కొడుకు చదువు కోసం పెట్టిన ఆ డబ్బులు రికవరీ కావాలంటే మార్గం ఒకటే అనిపిస్తుంది. అది తన కొడుకు పెళ్లి ద్వారా వచ్చే కట్నం. అందుకోసం డబ్బున్న సంబంధాలు వెతుకుతుంటారు. కానీ హీరోకు ఏ అమ్మాయి నచ్చదు. అలా అందరి అమ్మాయిలను రిజెక్ట్ చేస్తున్న హీరోకు ఓ రోజున ఓ అమ్మాయి కనపడుతుంది. అంతే ప్రేమలో పడిపోతాడు.

అయితే ఆ అమ్మాయి కూరగాయల మార్కెట్‌లో ఉండే మహాలక్ష్మి (ప్రణీకాన్విక). మార్కెట్ మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపే ఆమె తెలివికి ఫిదా అయిపోయి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేస్తాడు. అంతేకాకుండా తన తల్లి (జయలక్ష్మి నాయుడు) ఆమెతో గొడవ పడుతున్న సమయంలో ఐ లవ్ యు చెప్పి చెంప దెబ్బలు తింటాడు. అయినా పట్టుదల విడవకుండా ఆమెను ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకోవాలని ఆమె స్నేహితుల సహాయం తీసుకుని ట్రై చేస్తూంటాడు. అయితే ఆమె ప్రేమలో పడినా పెద్ద కలిసొచ్చేదేముంది. ఎందుకంటే మార్కెట్‌లో పనిచేసే అమ్మాయిని తమ ఇంటి కోడలుగా తెచ్చుకోవటానికి హీరో ఫ్యామిలీ సిద్ధంగా లేదు. మరో ప్రక్క మ‌హాల‌క్ష్మి మాత్రం అత‌డి ప్ర‌పోజ‌ల్‌ను రిజెక్ట్ చేస్తుంది. అసలు హీరోని ఎందుకు మ‌హాల‌క్ష్మి ప్రేమ‌ను రిజెక్ట్ చేసింది. చివరకు ఏమైంది?అనేదే ఈ చిత్రం స్టోరీ లైన్.

ఎలా ఉందంటే...

చిన్న సినిమాకు అన్ని విభాగాలు నాశిగానే ఉంటున్నాయి చాలా సార్లు. అందుకు ఆర్థిక పరిస్థితులు కారణం అనుకోవచ్చు. అయితే స్క్రిప్ట్ కూడా వీక్‌గా ఉంటే చెప్పేదేముంది. సినిమా చివరి దాకా కథ లాగి లాస్ట్ పావు గంటలో అసలు కాంప్లెక్స్‌లోకి వచ్చి ఇలాంటి కథలు సాధించిదేమీ ఉండదు. కొన్ని జోక్స్ పేలి ఉండవచ్చు. కొన్ని సీన్స్ బాగుండవచ్చు. అయితే ఓవరాల్ అవుట్ ఫుట్ ని చూసి కదా బాగుందా బాగోలేదా అని ప్రేక్షకుడు తేల్చేది. ఈ సినిమాలో విభిన్నత ఏమైనా ఉందా అంటే అది మెయిన్ పాయింట్. లక్షల్లో జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనలాంటి ఏ సాఫ్ట్వేర్ అమ్మాయినో చూసి ప్రేమలో పడటం సర్వసాధారణం. కానీ సినిమాలో హీరో మాత్రం మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునే మహాలక్ష్మిని చూసి ప్రేమలో పడటమే డిఫరెంట్. అదొక్కటే నమ్మి నిర్మాతలు సినిమా చేసినట్లున్నారు. ఫస్టాఫ్ ఫన్ తో వెళ్లిపోయినా సెకండాఫ్ మాత్రం ఎమోషన్స్‌కు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటంతో సాగింది.

ఎవరెలా చేశారు

పార్వ‌తీశం నటుడుగా పికప్ అవుతున్నాడు. సెట్టిల్డ్ గా పెర్ఫామెన్స్ తో మెప్పించాడు. ఎమోష‌న‌ల్ సీన్స్‌ కూడా బాగా చేసారు. ఇక హీరోయిన్ ప్రణీకాన్వికా కొత్త అమ్మాయి అయినా బాగా చేసింది. ఆమెకే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. కొన్ని సీన్స్‌లో పార్వ‌తీశాన్ని డామినేట్ చేసింది. మిగతా పాత్రల్లో ముక్కు అవినాష్‌, బాషా , హర్షవర్ధన్, కేదార్ శంకర్, జయ, పద్మ తదితరులు తమ ప‌రిధుల మేర‌కు న్యాయం చేశారు. టెక్నికల్ గా ఈ సినిమా జస్ట్ ఓకే అన్నట్లుంది. సీన్స్ బలంగా లేకపోవటంతో డైలాగులు మీదే సినిమా మొత్తం భారం పడింది. నిర్మాణ విలువలు సోసోగా ఉన్నాయి.

చూడచ్చా

మన స్ట్రెయిట్ తెలుగు కామెడీ సినిమా కాబట్టి ...ఓ లుక్కేయవచ్చు. అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్స్ ఎంజాయ్ చేయొచ్చు.

ఎక్కడుంది

ఈ సినిమా ఆహా ఓటిటిలో తెలుగులో ఉంది.

Read More
Next Story