శభాష్ పవన్ ..ఈ ఒక్క మాటతో జనాలకు తెగ నచ్చేశావ్
x

శభాష్ పవన్ ..ఈ ఒక్క మాటతో జనాలకు తెగ నచ్చేశావ్

అభిమానులు లేనిదే తను ఇక్కడ దాకా రాడు..రాలేడు. అలాగని ఇప్పుడు నమ్మి ఓట్లేసిన ప్రజలకు (వాళ్లలో అభిమానులు ఉంటారు) సేవ చెయ్యాలి. ఏది ముందు ఎంచుకోవాలి?


అభిమానులా..ప్రజలా వీళ్లలో ఎవరిని మొదట సంతోష పరచాలి? ఇది పెద్దప్రశ్నే. అభిమానులు లేనిదే తను ఇక్కడ దాకా రాడు..రాలేడు. అలాగని ఇప్పుడు నమ్మి ఓట్లేసిన ప్రజలకు (వాళ్లలో అభిమానులు ఉంటారు) సేవ చెయ్యాలి. ఏది ముందు ఎంచుకోవాలి?

మన ప్రయారిటీలే మన సక్సెస్, ఫేట్ ని డిఫైన్ చేస్తాయనేది అందరూ చెప్పేదే. అయితే ఆచరించేవాళ్లు తక్కువ. కానీ పవన్ కళ్యాణ్ ఈ విషయాలను బాగా అర్దం చేసుకున్నారు. పనుల ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు.. నాలుగైదు పనులు మనమే చెయ్యాల్సినవి ఉన్నా ఏది ముందు ఏది వెనక చెయ్యాలి అనేది డిసైడ్ చేసుకోవటంలో మన ప్రతిభ ఆధారపడి ఉంటుంది. పవన్ రీసెంట్ గా మాట్లాడిన 'ఓజీ' , 'క్యాజీ' మాటలను బట్టి ఆ పనుల ఎంపిక విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారని అర్దమవుతోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) హీరోగా చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ(OG). డైరెక్టర్ సుజీత్(Sujeeth) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. పవన్ నుండి వస్తున్న సినిమాల్లో ఓజీ సినిమాకు సెపరేట్ క్రేజ్ ఉంది. దానికి కారణం ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టార్గా కనిపించటమే. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండింగ్ లోకి వస్తోంది.

తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటన సందర్భంగా ఆయన పవన్ సినిమాల గురించి అడిగితే అవి చేస్తూ కూర్చుంటే ప్రజలు నన్ను తిట్టుకుంటారు అని అన్నారు. తాను సినిమాలు చేయడానికి వెళ్తే... కనీసం కొత్త రోడ్లు వేయకున్నా, గుంతలు కూడా పూడ్చలేదని ప్రజలు తిడతారన్నారు. గెలిపించిన ప్రజలు తిట్టకుండా చూసుకోవాలి కదా అన్నారు. నేను 'ఓజీ... ఓజీ' అని వెళితే ప్రజలు తనను 'క్యాజీ' అని సమస్యలపై ప్రశ్నిస్తారని సరదాగా వ్యాఖ్యానించారు.

ఓజీ ఓజీ అని సినిమా షూటింగులకు వెళితే ప్రజలు క్యాజీ అని ప్రశ్నిస్తారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించటం వినటానికి సరదాగా అనిపించినా ఆయన ప్రయారిటీస్ ఏమిటనేది ఆ మాటల ద్వారా అర్దమవుతోంది. డిప్యూటీ సీఎం గా ఆయన నుంచి చాలా ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. వాటిని అందుకోవటానికి ఆయన నిరంతరం శ్రమించాలని భావిస్తున్నారని అర్దమవుతోంది. అందుకే ఇపుడు సినిమాలు చేసే సమయం ఉందా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు సేవ చేసుకునే అవకాశమివ్వాలని నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు. మూడు నెలల తర్వాత సినిమా షూటింగుల కోసం నెలలో మూడు నాలుగు రోజుల సమయం కేటాయిస్తానని తెలిపారు. నిజానికి ఈ నిర్ణయం పవన్ రాజకీయ జీవితానికి కలిసొచ్చేదనే చెప్పాలి.

పవన్ చాలా పట్టుదల మనిషి. 2019లో జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఘోర పరాజయాన్ని పొందారు. అయినా వెనుతిరగలేదు. తాను పోటీ చేసిన విశాఖ, భీమవరం నుంచి మాత్రమే కాదు.. ఒక్క రాజోలు నియోజక వర్గం ఎమ్మెల్యే రాపాక మినహా మిగిలిన జనసేన అభ్యర్ధులు కూడా ఓటమి పాలయ్యారు. అప్పుడు సర్వత్రా విమర్శలను ఎదుర్కొన్నాడు. చాలా మంది ప్రజారాజ్యం బాటలో జనసేన కూడా మూత అనే దిశగా సాగాయి విమర్శలు.. ఎవరు ఏమన్నా.. ఎంతగా విమర్శించినా .. వ్యక్తిగత జీవితం మీద మాత్రమే కాదు.. తన ఫ్యామిలీని రాజకీయాల్లోకి లాగి దారుణంగా మాట్లాడినా పవన్ సహనంతో ముందుకు వెళ్లారు. మాటలతో కాదు చేతలతో సమాధానం చెప్పాలనే దిశగా అడుగులు వేశాడు..

ఆ క్రమంలోనే వైసిపీ ప్రభుత్వం, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరుపై విమర్శలు చేస్తూ.. ప్రజలు కష్టాల్లో తానున్నాను అంటూ భరోసాగా నిలిచాడు. అవసరమైనప్పుడు తన సొంత డబ్బులకు బాధిత కుటుంబాలకు ఇచ్చి అండగా నిలిచాడు. అంతేకాదు.. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండగా వైసిపీకి చెక్ పెట్టె విధంగా రాజకీయ చతురతను చాటుకున్నాడు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో పరామర్శకు వెళ్ళిన పవన్ హటాత్తుగా మీడియా ముందుకు వచ్చి ఎన్నికల్లో టిడిపీ, జనసేన కలిసి పోటీ చేస్తుంది అని ప్రకటించాడు. పిఠాపురం నుంచి బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ ను ఓడించడం కోసం అధికార వైసిపీ ప్రభుత్వం రాజకీయ ఉద్దండులను రంగంలోకి దింపినా ఫలితం లేకపోయింది. స్వయంగా సిఎం జగన్ .. వైసిపీ అభ్యర్ధి వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సిఎం పదవిని ఇస్తానని ప్రకటించారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది. కాబట్టి పవన్ తలుచుకుంటే ఏదైనా చెయ్యగలరు అనేది ప్రూవ్ అయ్యింది.

ఇక సినిమా నటులు పదవుల్లో ఉండగా సినిమాలు చేయవచ్చా అంటే... అప్పట్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా చేస్తూ కూడా బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా చేయటం గుర్తు చేసుకోవాలి. ఆయన మళ్ళీ సినిమాలో నటించటానికి పూనుకోవటం ప్రతిపక్ష వర్గాలవారిని కలవర పెట్టింది. తిరిగి ఎన్టీఆర్ సినిమాల్లో నటిస్తే మునుపటిలా తన చిత్రాలతో ప్రజలను మరింత ప్రభావితం చేసి ఇంకా జనాదరణ పొందుతాడని భయపడ్డారు. దాంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. రాజకీయాల్లో ప్రవేశించి అదీకాక ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ సినిమాలో నటించటం తగదని విమర్శించారు, కోర్టులకూ ఎక్కారు. అయితే తాను ముందొక నటుడినని, తనలోని నటున్ని కట్టడి చేయడం అంటే వ్యక్తి భావాలనే నిర్భందించటం లాంటిదని వాదించాడు. కోర్టులు కూడా ఎన్టీఆర్ నే సమర్ధించాయి.

ఓజీ విషయానికి వస్తే.. ప్రొడ్యూసర్ DVV దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో పవన్కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుండగా..తమిళ నటుడు అర్జున్ దాస్ , శ్రియ రెడ్డి , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్గా నటిస్తున్నాడు.

Read More
Next Story