
హరిహర వీరమల్లు సూపర్ హిట్ అంటూ పవన్ ఫ్యాన్స్ సందడే సందడి
పవన్ కల్యాణ్ ప్యాన్స్ కేరింతలు, థియేటర్లలో సంబరాలు
ఐదేళ్ల కల తీరింది. బొమ్మ హిట్టయింది. అభిమానుల ఆకలి తీరింది. నిర్మాత ఏవీ రత్నం నిలిచాడు. పార్ట్-2 గ్యారంటీ.. ఇప్పుడు ఏనోట విన్నా.. అదే టాక్. పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విడుదలైంది. పుంఖానుపుంఖాలుగా రెవ్యూలు మొదలయ్యాయి. అభిమానుల కేరింతలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
పవన్‌కల్యాణ్ సినిమా అభిమానులకే కాదు, బాక్సాఫీస్‌కూ అదో పెద్ద పండగనే చెప్పాలి. అందుకే ఆ పండగ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. సుదీర్ఘ విరామం తర్వాత పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా (Pawan Kalyan New Film) నటించిన చిత్రం ‘హరి హర వీరమల్లు’ బాక్సాఫీస్ బద్దలు కొట్టడం ఖాయమనే చెబుతున్నారు. ఇటీవలి కాలంలో పుష్ప-2 తర్వాత ఈ సినిమాకే ఇంత క్రేజ్ వచ్చిందని అభిమానుల మాట.
పవన్ కెరీర్‌లో నటిస్తున్న తొలి పీరియాడిక్ మూవీ కావడం, ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా పవన్ స్వయంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆ అంచనాలు పెరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వంటి వారెందరో పని గట్టుకుని ప్రచారం చేయడం గమనార్హం.
మరోపక్క జనసేన పార్టీ నాయకులు రంగంలోకి దిగి ర్యాలీలు, బెనిఫిట్ షో లు వేస్తున్నారు. ఎన్నడూ లేనిది ఈసారి మహిళా అభిమానులు కూడా పోస్టర్లు, బ్యానర్లు కట్టారు. మొత్తం మీద థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం మాటల్లో చెప్పనలవి కాకుండా ఉంది. మరో పది రోజుల వరకు టికెట్లు దొరకని పరిస్థితి ఎదురైంది.
ఇక, సినిమా గురించి ఫస్ట్ హాఫ్ అదిరిందనే వారు కొందరైతే మొత్తం సినిమాయే బాగుందనే వారు మరికొందరు. కీరవాణి ఇరగదీశారని కొందరు, సినిమా మొత్తం పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో అనే వారూ మరికొందరు.. సినీనటుడు పృద్వీరాజ్ అయితే కాలర్ ఎగరేసుకుని సినిమా చూడండని పిలుపిచ్చారు.
16వ శతాబ్దంలో మొదలయ్యే కథ అలా బందరు నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి చేరుతుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఢిల్లీ పీఠంపై కూర్చొని పాల్పడే ఎన్నెన్నో దురాగతాలకి భరత వాక్యం పలకడం ఈ సినిమా సందేశంమని అభిమానులు చెబుతున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్- వీర మల్లు పాత్రలో ఒదిగిపోయారట. పెద్దవాళ్ల దగ్గరున్న సంపదని దోపిడీ చేసి పేదలకి పంచి పెట్టే సీన్లలో బాగా నటించాడని కుర్రకారు హోరెత్తిస్తోంది.
ఈ సినిమా తీయడానికి దాదాపు ఐదేళ్లు పట్టింది. దర్శకులు ఒకళ్లకి ఇద్దరయ్యారు. వంద కోట్లనుకున్నది 250 కోట్లు అయింది. Hari Hara Veera Mallu కొన్ని నెలలుగా ఊరిస్తూ ఇవాళ విడుదల అయింది. చారిత్రాత్మక నేపథ్యంలో ఈ కథ ఐదేళ్లు అయినా అలాగే కొనసాగింది. ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్న సనాతన ధర్మం (Pawan Kalyan Sanatana Dharma) నేపథ్యాన్ని ఇందులో ప్రస్తావించారట.
ఫస్ట్ హాఫ్ అంతా యాక్షన్ సీక్వెన్స్, పాటలతో సరిపోతే సెకండ్ హాఫ్ ఫైట్లు, థ్రిలింగ్ సీన్లతో ఆసక్తిగా సాగిందని, కీరవాణి సంగీతం ఈ సినిమాకి పెద్ద ఎసెట్ అని ప్రేక్షకులు చెబుతున్నారు.
పవన్‌కల్యాణ్ నటించిన తొలి పీరియాడిక్ డ్రామా సినిమా ఇది. వీరమల్లుగా ఆయన కనిపించిన విధానం, అందులో చూపించిన హీరోయిజం, ఆయన చేసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకి ప్రాణం పోశాయాయని అభిమానులు చెబుతున్నారు.
దర్శకులుగా క్రిష్, జ్యోతికృష్ణ పని చేశారు.
Next Story