‘రక్షణ’ మూవీ రివ్యూ
x

‘రక్షణ’ మూవీ రివ్యూ

ఆర్ఎక్స్ 100లో అందాలు ఆరబోసిన గ్లామర్ తార పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాకి ఒక సర్ప్రైజింగ్ ప్యాకేజీ.


ఆర్ఎక్స్ 100 లో గ్లామర్ క్వీన్‌గా ఎంట్రీ ఇచ్చి, చాలా బోల్డ్‌గా నటించి ఆ సినిమా హిట్ కావడానికి కారణమైన పాయల్ రాజ్ పుత్, పోలీస్ ఆఫీసర్‌గా నటించిన సినిమా "రక్షణ" . గ్లామర్‌ను పక్కన పెట్టి, పాటలు డాన్సులు లేకుండా పాయల్ రాజ్ పుత్ నటించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. నిర్మాతతో ఆర్థికపరమైన వివాదం వల్ల సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనని పాయల్ తర్వాత ఆ వివాదాన్ని పరిష్కరించుకొని సహకరించడం జరిగింది. అయితే ఈ శుక్రవారం (7.5.24) కాజల్ నటించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ "సత్యభామ" కూడా (హీరోయిన్ పోలీస్ ఆఫీసర్) విడుదల కావడం వల్ల ఈ సినిమా మీద కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.

ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలో థ్రిల్లర్స్ ఎక్కువగా వచ్చాయి, వస్తున్నాయి కూడా. ఈ సినిమా కూడా ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రాసుకున్న కల్పిత కథే. ప్రణదీప్ ఠాకూర్ ఈ సినిమాకు దర్శకనిర్మాత. గుణశేఖర్ లాంటి దర్శకుడి దగ్గర కో-డైరెక్టర్, ఓ పెద్ద కథ ఆధారంగా సినిమా తీయాలనుకున్నాడు ప్రణదీప్ ఠాగూర్. అది వీలు కాకపోవడం వల్ల, ఒక చిన్న సినిమా తీసి, తన ప్రతిభను నిరూపించుకోవాలని అనుకొని ఈ సినిమా తీశాడు.

ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్న దర్శకుడు

అన్ని ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ మాదిరే, ఈ సినిమా కథ కూడా, వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు, హత్యల మీద ఆధారపడి రాసుకున్నదే. ఓ విధంగా చెప్పాలంటే దర్శకుడు ప్రణదీప్ ఈ సినిమా ద్వారా, కొంత ప్రతిభను కనబరిచాడు. కొన్ని చోట్ల ఈ సినిమా దర్శకత్వం చాలా బాగుంది. అయితే, ఈ సినిమా చాలా చోట్ల అవసరం లేకపోయినా సాగతీతకు గురి కావడం వల్ల బాగుండాల్సిన సినిమా కాస్తా పర్వాలేదు అనే స్థాయికి పడిపోయింది. ఈ మధ్యకాలం వస్తున్న తెలుగు సినిమాల్లో ఉన్న నిడివి సమస్య దీనికి కూడా ఉంది. ఇలాంటి సినిమా 139 నిమిషాలు ఉంటే, దాన్ని ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీయడం చాలా కష్టం. సినిమా ప్రధానమైన పాయింట్ బాగున్నప్పటికీ, దాన్ని సరిగా తీయకపోవడం వల్ల, సినిమా మంచి థ్రిల్లర్‌గా మారే అవకాశాన్ని, దర్శకుడు చేజేతులా జారవిడుచుకున్నాడు. ఇది దర్శకుడి స్వయంకృతాపరాధం. దీనికి మొదటి సినిమా కాబట్టి, అనే వెసులుబాటు కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే దర్శకుడికి అనుభవం ఉంది. . ,

ప్రతిభ చూపిన పాయల్ రాజ్ పుత్

ఆర్ఎక్స్ 100లో అందాలు ఆరబోసిన గ్లామర్ తార పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాకి ఒక సర్ప్రైజింగ్ ప్యాకేజీ. ఒక ఏసీపి పాత్రలో బాగానే చేసింది. తనలో కూడా ఒక నటి ఉందని ఈ సినిమా ద్వారా తెలియపరిచింది. కొన్ని సన్నివేశాల్లో, ముఖ్యంగా క్లైమాక్స్ లో పరిణితి చెందిన నటనతో సినిమాను నడిపించింది. ఏసిపి సస్పెండ్ కు గురైన తర్వాత, వరుసగా అవుతున్న యాక్సిడెంట్లు, చావులు, ఆత్మహత్యల మధ్య కనెక్షన్ ఉందని కనుక్కోవడం, అందుకోసం కోసం చేసిన ప్రయత్నాలు సినిమాలో బాగానే తీశాడు దర్శకుడు. పాయల్ రాజ్ పుత్ తన పాత్రకు దాదాపుగా న్యాయం చేసింది. మిగతా నటీనటుల్లో, విలన్ గా నటించిన రోషన్ బాగానే నడిపించాడు. సైకో గా తన పాత్రను పండించాడు. మరొక శాడిస్ట్ పాత్రలో మానస్ కూడా కొంత వరకు సినిమా మూడ్‌ని ఎలివేట్ చేయడానికి సహకరించాడు. ఇక నేపథ్య సంగీతం, ఫోటోగ్రఫీ కూడా పర్వాలేదు అనే స్థాయిలో ఉన్నాయి.

ఉత్కంఠ భరితం కాకపోయినా..చూడొచ్చు

ఈ సినిమాకు ఉన్న మైనస్ పాయింట్ ఇలాంటి థ్రిల్లర్స్‌కి ఉండవలసిన ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు ఎక్కువగా లేకపోవడం. అయితే లోపాన్ని సరిచేయడం కోసం, ఎసిపి ఒక్కొక్క ముడి విప్పుకుంటూ వెళ్లి, ఒక దానికి ఒకటి కనెక్ట్ చేసుకుంటూ, చివరికి ఈ హత్యలకి ఆత్మహత్యలకి మూల కారణమైన వాడిని కనుక్కోవడం అన్నది సినిమాలో బాగానే చూపించాడు దర్శకుడు. అయితే ఇలాంటి సినిమాలకి కావలసిన అంశాలు, తక్కువగా ఉండడం, ఉన్నవాటిని ఎక్కువ సేపు చూపించి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడం వంటివి దర్శకుడు చేసిన చిన్న చిన్న తప్పులు. వాటి వల్ల సినిమా కథనంలో వేగం తగ్గిపోయి, సినిమా చాలా చోట్ల తేలిపోయింది. ఇక సంగీతం అన్నది ఇలాంటి సినిమాలు ఎలా ఉండాలో చాలావరకు అలానే ఉంది.

ఈ సినిమా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ త్రిల్లర్ కాకపోయినా,థ్రిల్లర్స్ ఇష్టపడేవారు కొంత ఓపికగా ఉండగలిగితే, ఈ సినిమాను చాలావరకు ఎంజాయ్ చేయవచ్చు.

Read More
Next Story