
‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా పై హైకోర్టులో కేసు
45 కోట్ల రూపాయల అక్రమ సంపాదన రికవరీ కోసం వ్యాజ్యం
మన శంకరవరప్రసాద్ గారు సినిమా టికెట్ల ధర పెంపు వివాదం హైకోర్టు కెక్కింది. టికెట్ ధరలు పెంచడం అన్యాయం,చట్టవిరద్ధం అంటే పెంచిన డబ్బులను ప్రభుత్వానికి రికవరీ చేయించాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. తెలంగాణ ప్రభుత్వం 08.01.2026న విడుదల చేసిన మెమో నెం. 94-P/GENERAL.A1/2026 ద్వారా టికెట్ ధరలను పెంచడం చట్టబద్ధంగా చెల్లుబాటు కాదని ఈ పిటిషన్ లో పేర్కొన్నారు.
దీని ప్రకారం 11.01.2026 రాత్రి 8:00 గంటలకు ప్రదర్శించబడే ఒక షోకు రూ. 600/- (జీఎస్టీతో కలిపి) వసూలు చేయడం జరిగింది. 12.01.2026 నుండి 18.01.2026 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ. 50/-, మల్టీప్లెక్స్‌లలో రూ. 100/- (జీఎస్టీతో కలిపి) అదనంగా ధరలను పెంచడం జరిగింది. ఇది మొత్తం చట్టవిరుద్ధంమని ఈ అక్రమ పద్ధతుల ద్వారా ఆర్జించిన రూ. 45 కోట్ల రికవరీ కోరుతూ డాక్టర్ పాదూరి శ్రీనివాస రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్ లోని ముఖ్యాంశాలు:
1) 08.01.2026 నాటి మెమో నెం. 94-P/General A1/2026 (anti) ద్వారా పొందిన అక్రమ లాభాలను జీఎస్టీతో కలిపి మొత్తం రూ. 42 కోట్ల (నలభై రెండు కోట్ల రూపాయలు) మొత్తాన్ని ప్రతివాదులు సంయుక్తంగా లేదా వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రభుత్వ సంచిత నిధికి (Consolidated Fund) లేదా హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించేలా ఆదేశించాలి.
2) మొదటి ప్రతివాదిగా ఉన్న అధికారి (తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ) ని, తన వ్యక్తిగత హోదాలో (6వ ప్రతివాదిగా), హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి రూ. 15 లక్షల జరిమానా చెల్లించేలా ఆదేశించాలి.
3) 7వ ప్రతివాది (Shinescreens India LLP) సినిమా అయిన 'మన శంకర వరాప్రసాద్ గారు' చిత్రానికి టికెట్ ధరలను పెంచుతూ మొదటి ప్రతివాది తీసుకున్న చర్య చట్టవిరుద్ధమని, ఏకపక్షమని, అన్యాయమని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ప్రకటించాలి.
ఈరోజు కోర్టు నంబర్ 19లో మోషన్ లిస్ట్‌లో ఐటమ్ నంబర్ 32గా నమోదైన ఈ రిట్ పిటిషన్ మీద నేడు వాదనలు విన్న అనంతరం, తెలంగాణ హైకోర్టు ఈ రిట్ పిటిషన్ నంబర్ 2098/2026ని విచారణకు స్వీకరించి ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.
అలాగే దీనిని గతంలో దాఖలైన పుష్ప-2, గేమ్ ఛేంజర్, అఖండ-2, రాజా సాబ్ వంటి సినిమాల టికెట్ ధరల పిటిషన్లతో కలిపి తదుపరి విచారణకు జాబితా చేసింది.
అదే సమయంలో, ఐఏ (IA - మధ్యంతర దరఖాస్తు) అంటే డైరెక్షన్ పిటిషన్ ప్రకారం.. 'మన శంకర వరాప్రసాద్ గారు' సినిమాకు సంబంధించి 11.01.2026 రాత్రి 8:00 గంటలకు జరిగిన ఒక షో టికెట్ ధర రూ. 600/- (జీఎస్టీతో కలిపి) మరియు 12.01.2026 నుండి 18.01.2026 వరకు పెంచిన ధరలు (సింగిల్ స్క్రీన్‌లకు రూ. 50/-, మల్టీప్లెక్స్‌లకు రూ. 100/- జీఎస్టీతో కలిపి) ప్రకారం విక్రయించిన టికెట్ల వాస్తవ గణాంకాలను సమర్పించాలని జీఎస్టీ అధికారులను కోర్టు ఆదేశించింది.

