
పొలిటికల్ సెటైర్: 'లక్ష్మీ కటాక్షం' మూవీ రివ్యూ!
ఈ పొలిటికల్ సటైర్ లో పాలిటిక్స్, సటైర్ ప్రజలకు నచ్చుతాయా?
గత సంవత్సరం తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల సమయంలో పొలిటికల్ సెటైరికల్ గా వచ్చిన చిత్రం ‘లక్ష్మీ కటాక్షం’. అయితే అప్పుడు ఈ సినిమాని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.
ఆ సినిమా ఇన్నాళ్లకు ఓటిటిలో దిగింది. వ్యంగ్యం ప్రధానంగా సాగిన ఈ చిత్రం ఏ మేరకు కామెడీని పండించింది. సగటు ప్రేక్షకుడుని ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయా. ఈ చిత్రం కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
ధర్మా (సాయికుమార్)ఎమ్మల్యేగా ఎలక్షన్స్ లో నిలబడతాడు. ఎలాగైనా గెలవాలని, తన పాతికేళ్ళ పొలిటికల్ కెరీర్ ను నిలబెట్టుకోవడం కోసం ఎలక్షన్స్ ను చాలా ప్రస్టేజ్ గా తీసుకుంటాడు.
అందుకోసం ఎంత డబ్బైనా ఖర్చు చేయడానికి సిద్ధపడతాడు. ఎలక్షన్స్ దగ్గరపడుతూ ఉండటంతో. ఓటుకు 5 వేలు పంచాలని ధర్మా నిర్ణయించుకుంటాడు.
అందుకు అవసరమైన సన్నాహాలు మొదలుపెడతాడు. ఎలక్షన్స్ లో పంచటానికి అవసరమైన 100 కోట్లను ధర్మా స్థావరానికి తరలించడానికి 'లక్ష్మీ కటాక్షం' అనే కోడ్ తయారు చేస్తారు.
ఇక అనాథగా పెరిగిన అర్జున్ (వినయ్), పోలీస్ ఆఫీసర్ గా అదే ఊరుకు వస్తాడు. ధర్మా ఎలాంటి పరిస్థితుల్లోను డబ్బులు పంచడకుండా చేయాలి, ఎమ్మల్యేగా అతను ఓడిపోయేలా చేయాలి అనేది అతని టార్గెట్. దాంతో ఎలక్షన్స్ లో ధర్మా పంచాలనుకున్న 100 కోట్లు రహస్యంగా ఎక్కడ పెట్టారో తెలుసుకోవడానికి అర్జున్ గట్టి నిఘా పెడతాడు.
ఇక అదే ఊళ్లో 'చింటూ' అతని స్నేహితుడు ఫుడ్ డెలివరీ బాయ్స్ గా పనిచేస్తూ ఉంటారు. వాళ్లు అత్యాశాపరులు. కష్టపడకుండానే ఓవర్ నైట్ కోట్లకు అధిపతులు కావాలనేది వారి కోరిక. దాంతో వాళ్ళను ధర్మా ట్రాప్ చేస్తాడు. తన పనికి ఉపయోగించుకోవాలనుకుంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది?
ఆ పోలీస్ బందోబస్త్ నుండి, తక్కువ టైంలో 100 కోట్లని, రెండు లక్షల మంది ఓటర్లకు, ఓటుకు 5000 చొప్పున ఎలా పంచుతారు, ధర్మాపై అర్జున్ పగ పట్టడానికి కారణం ఏమిటి? చివరికి ఆ 100 కోట్లు ఏమయ్యాయి? అనేది మిగతా కథ.
ఎనాలసిస్
ఎలక్షన్ ఫండ్ రావడం ఒక ఛాలెంజ్ అయితే, ఇంకో పక్క లాస్ట్ మినిట్ లో వచ్చిన ఫండ్ ఎలా పంచాలి అనేది ఎప్పుడూ రాజకీయనాయకులకు పెద్ద ఛాలెంజ్. దీని చుట్టూనే కథను ,కామెడీని అల్లుకుందామనుకున్నారు.
అయితే కథలో ముడి సరిగా పడలేదు. పై పైన లేయిర్స్ అయితే ఉన్నాయి కానీ కథలో ఎక్కడా డెప్త్, ఎమోషన్ అనేది కనపడదు. కానీ వ్యంగ్యం అయినా పండిందా అంటే అదీ లేదు.
అన్ని దారులు మూసుకున్న సాయి కుమార్ లక్ష్మీ దేవిని ఎలక్షన్ ఫండ్ కటాక్షించమని డిమాండ్ చేస్తారు, లక్ష్మి దేవి ప్రత్యేక్షమవుతారు, ఇలాంటి సీన్స్ సినిమాపై ఉన్న గౌరవాన్ని తగ్గించుకుంటూ పోతాయి.
ఇంటర్వెల్ వరకూ ఏదోలా లాకొచ్చిన ఈ కథకి అసలు కష్టాలు సెకండ్ హాఫ్ లో మొదలౌతాయి.సరైన కాంప్లిక్ట్ లేక, ఏ పాత్ర ఏం చేస్తోందో అర్దకాక విసుగొస్తుంది. దాంతో సెకండ్ హాఫ్ అంతా వృధా ప్రయాస.
సెకండ్ హాఫ్ నుంచి ఒకొక్క సీన్ ని పనికి వస్తుందా లేదా అని తీసేస్తే వెళ్తే ఏదీ మిగలదేమో. ఇక కామెడీ పేరట బలవంతంగా నవ్వుకోవడం ప్రేక్షకులు వంతు. ఇక ముగింపు కూడా చాలా అర్టిఫిషియల్ గా వుంటుంది.
టెక్నికల్ గా ..
ఇలాంటి చిన్న సినిమాలకు కావాల్సింది రైటింగ్ బలం. అదే మిస్సైంది. సాదాసీదా కథని అంతకన్నా సాదాసీదాగా చెప్పారు కొత్త దర్శకుడు. బేస్ లేకుండా పైపైన ఎంత కామెడీ చేయాలని చూసినా అతకలేదు. సినిమా కథకే సరైన బేస్ ఉండాలి.
అది లేకపోవటంతో ఏదీ పండలేదు. ఏ పంచ్ పేలలేదు. కెమరా వర్క్ బావుంది. సంగీతం ఓకే అనిపిస్తుంది.
కొత్త దర్శకుడు సూర్య ఓ పాయింట్ పట్టుకున్నారు కానీ దాన్ని సరిగ్గా వర్కవుట్ చేయలేకపోయారు. కథలో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయిపోయింది. అటు కామెడీ కూడా గొప్పగా పండలేదు.
ఈ సినిమాకి లక్ష్మీ కటాక్షం అనే మంచి టైటిల్ ని వాడుకున్నారు. అయితే దానికి సరైన న్యాయం జరగలేదనే చెప్పాలి. సాయి కుమార్ గంభీరంగా ఉన్నాడు. కానీ హీరో ముందు రొటీన్‌గా కుదేలైపోయాడు.
చూడచ్చా
అక్కడక్కడా నవ్వించే ఈ చిత్రం జస్ట్ ఓకే అనిపిస్తుంది. మరీ కాలక్షేపం లేకపోతే ఓ లుక్కేయచ్చు
ఎక్కడ చూడచ్చు?
ఆహా ఓటిటిలో తెలుగులో ఉంది
బ్యానర్: మహతి ఎంటర్టైన్మెంట్,
నటీ నటులు: వినయ్, అరుణ్, దీప్తి వర్మ, చరిస్మా శ్రీకర్, హరి ప్రసాద్, సాయి కిరణ్ ఏడిద, ఆమనీ తదితరులు.
మ్యూజిక్: అభిషేక్ రుఫుస్,
డి ఓ పి: నని ఐనవెల్లి,
ఎడిటర్: ప్రదీప్ జే,
సౌండ్ డిజైన్: మురళీధర్ రాజు,
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఆర్. రంగనాథ్ బాబు,
నిర్మాతలు: యు. శ్రీనివాసుల రెడ్డి, బి. నాగేశ్వర రెడ్డి, వహీద్ షేక్, కే. పురుషోత్తం రెడ్డి,
రచన, దర్శకత్వం: సూర్య
Next Story