ప్రభాస్ సినిమాకు సుభాష్ చంద్రబోస్ కనెక్షన్, కలిసొచ్చేనా?
ప్రభాస్ సినిమాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర ఉంటుందని, అప్పటి కథ ఒకటి తెరకెక్కబోతోందనే విషయం ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేసింది.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ సినిమా ఎంత పెద్ద హిట్టైందో తెలుసు. అప్పటినుంచి మనవాళ్లు అలాంటి స్వతంత్ర్య సమరయోధులు కథను, పోరాటాన్ని గుర్తు చేస్తే సాగే కథాంశాలు కోసం అన్వేషిస్తున్నారు. అయితే ధైర్యం చేసిన వాళ్ళు తక్కువే. ఎందుకంటే బడ్జెట్ లు ఎక్కువ అవి డిమాండ్ చేస్తాయి. స్టార్ హీరో ఉన్నప్పుడే అవి వర్కవుట్ అవుతాయి. ఈ క్రమంలో ఇప్పుడు ప్రభాస్ సినిమాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర ఉంటుందని, అప్పటి కథ ఒకటి తెరకెక్కబోతోందనే విషయం ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే తెలుగులో సుభాష్ చంద్రబోస్ రిఫెరెన్స్ తో వచ్చిన సినిమాలు వర్కవుట్ కాలేదు. దాంతో అసలు ఇప్పటిదాకా ఏ సినిమాలు నేతాజి జీవితం ఆధారంగా వచ్చాయి.. ప్రభాస్ సినిమా మ్యాటరేంటో చూద్దాం.
భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ సినిమా వాళ్లను ఎప్పుడూ ఎట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆయన జీవితం, మరణం లో ప్రతీ అంశం సంచలనమే. యాక్షన్ తో కూడుకున్నదే. ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించిన ఆయనపై చాలా మంది సినీ నిర్మాతలు సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపించారు. దీనికి కారణం అతని వీరోచిత పోరాటం, శౌర్యం, అతని మరణం వెనకాల దాగిన రహస్యమే. హిందీలో ఎక్కువ సినిమాలు వచ్చాయి. తెలుగులో ఆ పాత్రను బేస్ చేసుకుని కొన్ని సినిమాలు వచ్చాయి. తాజాగా ప్రభాస్ హీరోగా ప్రారంభమయ్యే కొత్త సినిమాలోనూ సుభాష్ చంద్రబోస్ కు చెందిన రిఫరెన్స్ లు ఉంటాయని తెలుస్తోంది.
సీతారామం వంటి క్లాసిక్ లవ్ స్టోరీని తీసిన హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో ప్రభాస్ ఆజాద్ హిందు ఫౌజ్ సభ్యుడిగా కనిపిస్తాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈ సినిమా కోసం ‘ఫౌజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ ఓ బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తాడని చెప్తున్నారు. ఆగస్టు 22 నుంచి షూటింగ్ ప్రారంభం అయ్యే ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని రూపొందించనుంది. ఇదంతా బాగానే ఉంది. అయితే మనకు సుభాష్ చంద్రబోస్ రిఫరెన్స్ తో వచ్చిన చిత్రాలు ఆడిన దాఖలాలు తెలుగులో లేవు.
అప్పట్లో వెంకటేష్ హీరోగా కే. రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన సుభాష్ చంద్రబోస్ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. వెంకటేష్, శ్రెయా శరణ్, జెనీలియా హీరోయిన్లుగా, ప్రకాష్ రాజ్ కీ రోల్‌లో నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమాలో స్వాతంత్రం ముందు బ్రిటిష్ వారు వారి దేశానికి వెళ్లబోయే దశను చూపించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
అలాగే నిఖిల్ పాన్-ఇండియన్ మూవీ, నేషనల్ థ్రిల్లర్ ‘స్పై’ తుమ్ ముజే ఖూన్ దో, మై తుమ్హే ఆజాదీ దూంగా (మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను) అని నినాదం ఇచ్చిన సుభాష్ చంద్రబోస్ యొక్క రహస్యాల ఆధారంగా రూపొందించబడిందని ప్రచారం చేసారు. సినిమాలో ఆ ఎపిసోడ్ చిన్నదే. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఈడీ ఎంటర్ టైన్ మెంట్స్ పై కె రాజశేఖర్ రెడ్డి, సి ఇ ఓ గా చరణ్ తేజ్ ఉప్పలపాటి నిర్మించారు.
ఇక 1966 తర్వాత చాలా మంది బాలీవుడ్ సినీ నిర్మాతలు సుభాష్ చంద్రబోస్ పై సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపించారు. సమాధి- 1950 అనే టైటిల్ తో సినిమా వచ్చింది. ఈ చిత్రం సుభాస్ జీవితం చుట్టూ తిరుగుతుంది. కానీ ఇందులో ఆయన ఐఎన్ఏ సైనికుడుగా కనిపిస్తాడు. దేశం కోసం తన సోదరి ప్రేమను వదులుకోవడానికి కూడా సిద్ధపడతాడు.
అలాగే సుభాష్ చంద్ర - 1966 అనే టైటిల్ తో పీయూష్ బోస్ ఓ బెంగాలి చిత్రం రూపొందించారు. ఈ సినిమా బోస్ విశ్వాసాలు ఎలా పరిణామం చెందాయి.. అతను భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడటానికి రాజకీయ కార్యకర్తగా ఎలా పరిణామం చెందాడు అనే దాని గురించి ఈ సినిమాలో చూపెట్టారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్: ది ఫర్గాటెన్ హీరో-2004 అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమాకు ప్రముఖ చిత్ర నిర్మాత శ్యామ్ బెనగల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ బయోపిక్‌లో నేతాజీగా సచిన్ ఖేడేకర్ నటించారు. ఇతర ముఖ్యమైన పాత్రలను జిషు సేన్‌గుప్తా (సిసిర్ బోస్‌గా), కులభూషణ్ ఖర్బండా (ఉత్తమ్‌చంద్ మల్హోత్రాగా) పోషించారు. ఈ చిత్రంలో బోస్ గృహనిర్బంధం నుండి తప్పించుకోవడం, భారతదేశం నుండి నిష్క్రమించడం, ఐఎన్ఏ స్థాపనపై చూపించారు. బ్రిటీష్ పాలన నుండి భారతదేశాన్ని విముక్తి చేయడానికి ఆజాద్ హింద్ ఫౌజ్ చేసిన ప్రచారం ఈ చిత్రంలో చూపబడింది.
అలాగే మిధున్ చక్రవర్తి హీరోగా అమీ సుభాష్ బోల్చి- 2011 సినిమా, రాగ్ దేశ్- 2017 అనే సినిమా , రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో బోస్: డెడ్/అలైవ్ - 2017 అనే వెబ్ సీరిస్, గుమ్నామీ - 2019 సినిమా, ది ఫర్గాటెన్ ఆర్మీ - 2020 అనే డాక్యుమెంటరీ వచ్చాయి.
ఇలా ఇప్పటికే చాలా సినిమాలు, వెబ్ సీరిస్ లు సుభాష్ చంద్రబోస్ పై వచ్చాయి. అయితే మన తెలుగులో తక్కువ. ప్రభాస్ ప్యాన్ ఇండియా హీరో అయ్యారు కాబట్టి ఆయన సినిమాలో ఆ రిఫరెన్స్ లు ఉంటే వర్కవుట్ అవుతాయని దర్శకుడు భావించి ఉండవచ్చు. అలాగే ఈ సినిమాలో సైనికుడుగానే ప్రబాస్ కనిపిస్తారు. కానీ సుభాష్ చంద్రబోస్ వేరే స్టార్ కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. అది ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా హిట్ కొడితే మనవాళ్లు కాస్తంత స్వాతంత్ర్య సమర యోధులు కథలను గుర్తు చేస్తే సినిమాలు తీసే అవకాసం ఉంటుంది.