ప్రేమలు తెలుగు వర్షన్  మూవీ రివ్యూ
x

'ప్రేమలు' తెలుగు వర్షన్ మూవీ రివ్యూ

ట్విస్టులు ఏమీ లేవు. చివరికి ఏమౌతుందో కూడా అందరికీ తెలిసిపోతుంది. అయితే కథను నడిపిన విధానం కొత్తది, సినిమా సాంతం నవ్వుల విరబూస్తుంది...


"ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందుబాటులో తెచ్చినందుకు నీకు థాంక్స్ కార్తికేయ. సినిమా చూస్తున్నంత సేపు నేను నవ్వుతూనే ఉన్నా. నాకే కాదు నా కుటుంబ సభ్యులకు కూడా ఈ సినిమా బాగా నచ్చింది. నటీనటులందరూ చాలా బాగా చేశారు. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు" అంటూ ఈ చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడు, ఎస్ ఎస్ కార్తికేయను అభినందిస్తూ ట్వీట్ చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

100 కోట్ల క్లబ్ లో చేరిన సినిమా
దీన్నిబట్టి ఈ సినిమాలో నవ్వులు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ఒక మాటలో మహేష్ బాబు చెప్పింది చెప్పాలంటే, ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు నవ్విస్తుంది, ఎంటర్టైన్ చేస్తుంది(ముఖ్యంగా ఈ కాలపు యువతను). మలయాళం లో తీసిన "ప్రేమలు" సినిమా ఫిబ్రవరిలో మలయాళ భాషలో రిలీజ్ అయింది. మార్చిలో తెలుగు వెర్షన్ రిలీజ్ చేశారు. ఇప్పటిదాకా ఈ సినిమా నూరు కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. మలయాళ ఆల్ టైం బాక్సాఫీస్ సినిమాల్లో ఇది ఐదో స్థానంలో ఉంది.మరో బ్లాక్ బస్టర్ మలయాళీ సినిమా " మంజు మెల్ బాయ్స్" ప్రపంచవ్యాప్తంగా 177 కోట్ల వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది.
నవ్వుల పూలు పూయించింది
ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే ఒక సాధారణమైన ప్రేమ కథ. సచిన్ సంతోష్ అనే అబ్బాయి, రీను రాయ్ అనే అమ్మాయి ప్రేమకథ. సాఫ్ట్ వేర్ వాతావరణంలో జరుగుతుంది. సాఫ్ట్ వేర్ లో ఉన్న ఇద్దరు మలయాళీ అమ్మాయిలు, ఇద్దరు మలయాళీ అబ్బాయిల మధ్య జరిగే కథ ఇది.
ఇందులో ట్విస్టులు ఏమీ లేవు. చివరికి ఏమౌతుందో కూడా అందరికీ తెలిసిపోతుంది. అయితే కథను నడిపిన విధానం లో కొత్తదనం, సినిమా సాంతం విరబూసిన నవ్వుల పువ్వులు ఈ సినిమాను హిట్ చేశాయి. కథ మొదట్లో కొంచెం నిదానించినప్పటికీ, మళ్లీ పుంజుకుంటుంది. అక్కడక్కడ ప్రేమలు అనే ఈ దీపం కొడిగట్టినప్పుడు దర్శకుడు దాన్ని నవ్వు అనే చమురు తో మళ్లీ వెలిగేలా చేశాడు.
రాణించిన నటీనటులు
ఇలాంటి సినిమాలు గతంలో అన్ని భాషల్లో ఎన్నో వచ్చాయి. కానీ ఈ సినిమాలో కొన్ని అంశాలు దీన్ని ఒక వినోద భరిత ప్రేమ కథ చిత్రం గా మలిచాయి. ఇంతకు ముందే మహేష్ బాబు తన ట్వీట్ లో చెప్పినట్లు, ప్రధాన పాత్రలో ఉన్న నటీనటులందరూ చలాకీగా, చక్కగా తమ పాత్రలు పోషించారు. అదే సినిమాకు ప్రధాన బలం. నవ్వు ఈ సినిమా ప్రధాన దినుసు గా కథను వండి వార్చాడు దర్శకుడు గిరీష్. గతంలో ఇతను తీసిన "తన్నీర్ మథన్ దినంగళ్"( పుచ్చకాయల రోజులు), "సూపర్ శరణ్య", రెండు సినిమాలు కూడా కామెడీ సినిమాలే. సూపర్ శరణ్య సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించిన గఫూర్, మమత బైజులను ఈ సినిమాలో ప్రధాన పాత్రల కి ఎన్నుకున్నాడు దర్శకుడు. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ(కొంత వరకు ఫిజిక్స్ కూడా) బాగా వర్కౌట్ అయింది. సచిన్ స్నేహితుడి పాత్రలో సంగీత ప్రతాప్, శ్రీను స్నేహితురాలి పాత్రలో అఖిల భార్గవన్ తమ వంతు పాత్ర పోషించారు, నవ్వులు పూయించారు. ప్రత్యేకంగా చెప్పవలసింది ప్రతినాయక ఆది పాత్రలో నటించిన శ్యామ్ మోహన్. తన వంతు పాత్ర పోషించాడు. సినిమా మొత్తం ఈ ఐదు పాత్రల మధ్య నడుస్తుంది.
తెలుగుతనం తొణికిసలాడే డైలాగులు
ఈ సినిమాలో నవ్వులు పూయించడంలో ప్రధాన పాత్ర వహించింది డైలాగులు. ఈ తరం యువతకు సరిపోయేలా, సన్నివేశాలకు అణువుగా మాటలు రాసింది, గతంలో (ఓటీటీలో వచ్చిన) "90'స్ మిడిల్ క్లాస్ బయోపిక్" సినిమా తీసిన దర్శకుడు ఆదిత్య హసన్. కేవలం వారం రోజుల్లో ఈ సినిమా డైలాగులు రాయడం విశేషం! మలయాళీ సినిమా అయినప్పటికీ, దానికి తెలుగుదనం అద్దిన మాటలు సినిమా లో నవ్వులు వెదజల్లాయి. దీనివల్ల సినిమా తెలుగు యువతకు బాగా కనెక్ట్ అయింది.
హైదరాబాదులోనే తీసిన మలయాళీ సినిమా
ఈ సినిమాలో దర్శకుడు ఒక తెలివైన పనిచేశాడు. మలయాళీ సినిమా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కావడం అంటే కొంచెం కష్టమే. అందుకే సినిమా కథను హైదరాబాద్ నేపథ్యంలో రాసుకున్నాడు, హైదరాబాదులోనే తీశాడు. దాంతో దర్శకుడి పని సులువు అయింది. తెలుగు యువత సినిమాకు బాగా కనెక్ట్ అయింది. అందిన వార్తలకు ప్రకారం ఈ సినిమాను చూస్తున్న వారిలో చాలామంది తెలుగు సాఫ్ట్ వేర్ ఉద్యోగులే ఉన్నారు. దాదాపు 5కోట్లు ఖర్చు అయిన సినిమా నూరుకోట్ల వసూళ్లు చేయడం గొప్ప సంగతే.

ఒక సాధారణ కథని, ఎక్కువ హంగులు, ఆర్భాటాల జోలికి వెళ్లకుండా, నేల విడిచి సాము చేయించకుండా సింపుల్ గా నవ్వులతో వినోదాన్ని మిళితం చేసి తెలుగు ప్రేక్షకులు సైతం ఎంజాయ్ చేసేలా మలయాళీ దర్శకుడు గిరీష్ తీసిన ఈ సినిమా నవ్వులతో వినోదాన్ని పంచిన విజయవంతమైన సినిమా. ఎవరైనా సరే ఈ సినిమాని చూడవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు.
నటీనటులు: నస్లెన్ గఫూర్, సంగీత్ ప్రతాప్, మమితా బైజు
అఖిల భార్గవన్,శ్యామ్ మోహన్, మీనాక్షి రవీంద్రన్ తదితరులు.
దర్శకుడు: ఎ.డి. గిరీష్
సంగీత దర్శకుడు: విష్ణు విజయ్
సినిమాటోగ్రాఫర్: అజ్మల్ సాబు
ఎడిటింగ్: ఆకాష్ జోసెఫ్ వర్గీస్
నిర్మాత: ఫాహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్
నిర్మాణ సంస్థ: భావన స్టూడియోస్


Read More
Next Story