పూరీ జగన్నాథ్ కు ఏమయింది?
x

పూరీ జగన్నాథ్ కు ఏమయింది?

ఎక్కడ ‘బ‌ద్రి’..ఎక్కడ ‘బొక’..ఏమైంది పూరి నీ మ్యాజిక్?

'డబుల్ ఇస్మార్ట్' సినిమా ఫ్లాఫ్ అయ్యినందుకు కన్నా డైరక్టర్ గా పూరి జగన్నాథ్ మీద పెట్టుకున్న నమ్మకం పోయినందుకు ఎక్కువ బాధ కలిగించింది చాలా మందికి. అది ఓ రకంగా పూరి జగన్నాథ్ కి మెచ్చుకోలే. ఎందుకంటే ఆయన ఎన్ని ప్లాఫ్ లు ఇచ్చినా హిట్ వచ్చి చాలా కాలం అయినా మేము నమ్ముతూనే ఉన్నాం అని మంచి ఓపినింగ్స్ ఇచ్చారు. అయితే వాళ్లు అభిమానంతో పెట్టుకున్న నమ్మకాన్ని పూరి లెక్క చేసినట్లు లేదు. చాలా నిర్లక్ష్యంగా తీసిన సినిమా అనిపిస్తుంది. ఎలా తీసినా జనం చూస్తారు..అని తేలిగ్గా తీసిన సినిమా అనిపిస్తుంది. లేకపోతే సినిమాలో ఎక్కడా పూరి మార్క్ మ్యాజిక్ కనపడదు.

ఆయన స్టైల్ డైలాగులు లేవు. తన సినిమాని తానే కాపి కొట్టినట్లుగా ఇస్మార్ట్ శంకర్ ని యాజటీజ్ కొంచెం మార్చి తీసినట్లు తెలిసిపోతుంది. లైగర్ వంటి డిజాస్టర్ ఇచ్చాక వేరే డైరక్టర్ కోలుకుని సినిమా అయితే తీస్తారని నమ్మలేం. కానీ పూరి తీసాడు. అలాగే పిచ్చ క్రేజ్ క్రియేట్ చేసాడు. అయితే రిలీజ్ కు ముందే అదంతా..ఒక్కసారి థియేటర్ లో వెళ్లాక... ట్రైలర్ చూసి మోసపోయాం గురూ అని హోరెత్తిపోయే జన సమూహమే.

అసలు పూరి జగన్నాథ్ ఎవరు... తెలుగు సినిమాకు హీరో క్యారక్టరైజేషన్ నుంచి టైటిల్స్, డైలాగ్స్ అన్ని మార్చేసి కొత్తగా వినిపించి, కనిపించే కొత్త క‌మ‌ర్షియ‌ల్ పాఠం నేర్పిన ద‌ర్శ‌కుడు.ఆయన కెరీర్ లో ఎన్ని హిట్స్... ‘బ‌ద్రి’, ‘ఇడియ‌ట్’, అమ్మా నాన్నా తమిళ అమ్మాయి, ‘పోకిరి’, ఏక్ నిరంజన్, … ఓ టైమ్ లో వరసపెట్టి వందల రోజులు ఆడే సినిమాలు తీసిన వాడు. అలాగే ఆయన మరో ప్రత్యేకత ఏమిటి అంటే...స్పీడు. అతి తక్కువ టైమ్ లో కథ రాసి, అంతకన్నా తక్కువ టైమ్ లో తెరకెక్కించి ఎక్కువ రోజులు ఆడించగల సత్తా ఉన్నావాడు. అందుకే పూరి జగన్నాథ్ కు ఓ టైమ్ లో సినీ లవర్స్ లో కల్ట్ ఫాలోయింగ్ ఉంది.

తన సినిమాల కన్నా తన వ్యక్తిత్వం, తన యాటిట్యూడ్ ద్వారా ఎక్కవ పాపులర్ అయ్యారు. తనకు నచ్చింది చేయాలి, ఆత్మ గౌరవంతో ఉండాలి, అన్నిటికన్నా ప్రాక్టికల్ గా లైఫ్ లో ముందుకు వెళ్లాలి అనేది కుర్రాళ్లకు తెగ నచ్చేసింది. అలాగే ఆయన సినిమాలు కూడా కాలం కన్నా ముందుండేవి. పూరీ హీరోలు తెరపై ఓ రకమైన యాటిట్యూడ్ తో ఉండేవారు. అలాగే సినిమాలో సోది ఉండేది కాదు. చాలా స్పీడుగా సినిమా ముందుకు పరుగెత్తేది. అలాగే అప్పటివరకు సాఫ్ట్ టైటిల్స్ తో పోతున్న ఇండస్ట్రీకి ఇడియట్, పోకిరి అంటూ డిఫరెంట్ టైటిల్స్ పెట్టి ట్రెండ్ సెట్ చేశాడు పూరి. అందుకే ఆయన్ని డేరింగ్ అండ్ డేషింగ్ డైరక్టర్ ని ముద్దుగా పిలుచుకునేవారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. కొత్త జనరేషన్ కు ఆయన కనెక్ట్ కావటం లేదు అనిపిస్తోంది. ప్లాఫ్ లు రావటం మొదలై అది ‘లైగ‌ర్‌’తో పీక్స్ కు వెళ్లింది. లేదు పూరి గోడకు కొట్టిన బంతి మళ్లీ వచ్చేస్తాడు అని అంతా నమ్మారు. డబుల్ ఇస్మార్ట్ తో డబుల్ దెబ్బ కొడతాడు అనుకోలేదు.

ఇంకా కామెడీ ఏమిటంటే.. ‘ఈ సినిమాని ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని తీశా’ అని పూరి ప్రమోషన్స్ లో చెప్పాడు. అయితే అదేమీ సినిమాలో క‌నిపించ‌లేదు. ఫైట్లు, పాట‌లూ.. క‌మ‌ర్షియ‌ల్ మీట‌ర్ లో సరిపోతున్నాయా లేవా అన్నదాకానే చూసుకున్నాడు పూరి. కానీ.. సినిమాకు కీలకమైన క‌థే వదిలేసాడు. ఇక పూరి లో మ్యాజిక్ పోయిందనటానకి సాక్ష్యం అలీ ట్రాక్. ఈ సినిమాని ముప్పావు భాగం నాశనం చేసిందే ఈ ట్రాక్. అలీ ఎన్నో సినిమాల్లో పూరి కు ఉపయోగపడ్డారు. అయితే ఈ సినిమాని నాశనం చేసేందుకు తనదైన టచ్ ఇచ్చాడు.

మామూలుగా పూరి జగన్నాథ్ సినిమాలోనే అలీ కామెడీ ట్రాక్‌లు అన్నీ.. కథతో సంబంధం లేకుండా ఉంటాయి. ఇడియట్‌లో ఇసుక ట్రాక్ కానీ.. పోకిరిలో ‘బ్బబ్బాబూ ట్రాక్’ కానీ.. సూపర్‌లో ‘మెషీన్ అరిచే ట్రాక్ కానీ.. ఇలా చాలా విభిన్నంగా ఉంటే ఓ రేంజిలో వర్కవుట్ అయ్యాయి. అలాగే డబుల్ ఇస్మార్ట్‌లో బొక ట్రాక్ కూడా క్లిక్ అవుతుందని పూరి అనుకున్నారు కానీ.. అది దారుణంగా బెడిసికొట్టింది. ఈ ట్రాక్ రాగానే యాక్ థూ అనేసారు జనం. అంత వరస్ట్ గా ఉంది.

ఈ సీన్లు వస్తున్నప్పుడు థియేటర్స్ నుంచి జనం లేచి వెళ్లిపోతుండమే సాక్ష్యం..దాంతో ఎక్కడ బ్లాక్ బస్టర్ సినిమాలు ఎక్కడ బొకా ట్రాక్. పూరి ఏంటి ఇలా ట్రాక్ తప్పేసాడు అని ఫ్యాన్స్ బాధ పడిపోతున్నారు. అయితే ఓ సినిమా ఫ్లాఫ్ అవటమే ఓ డైరక్టర్ కు క్రియేటివిటి మిస్సైనట్లు కాదు. కాబట్టి పూరి మనస్సు పెట్టి జాగ్రత్తపడితే భవిష్యత్తులో మళ్లీ పోకిరిలు, ఇడియట్ లు వచ్చే అవకాసం ఉంది.

హాలీవుడ్ స్టార్ డైరక్టర్ క్వెంటీన్ టరంటీనో మాటలు ఈ సందర్బంలో ఓ సారి గుర్తు చేసుకోవాలి.

" నా సినిమాకి టిక్కెట్ మీరు కొనాలనుకుంటే అది నా బెస్ట్ వర్క్ అవ్వకపోవచ్చు. కానీ అందుకు మాగ్జిమం అవకాసం ఉన్నదే అవ్వాలి. అలాగే నా బెస్ట్ ప్రాజెక్టు ఎల్లప్పుడూ నేను నెక్ట్స్ చేయబోయేదై ఉండాలని కోరుకుంటాను. అలా అప్పటిదాకా నేను చేసిన సినిమాల కన్నా గొప్పది నేను చేస్తున్నాను అనే ఎగ్జైట్మెంట్ లేనప్పుడు చేయను..దాన్ని ఆపేసి వేరే పనులు చేసుకుంటాను ." అంటారు.

Read More
Next Story