రాముడికి ఉడత సాయం.. రామానంద్ సాగర్‌కు కాకి సాయం
x

రాముడికి ఉడత సాయం.. రామానంద్ సాగర్‌కు కాకి సాయం

రామానంద్ సాగర్ డైరెక్ట్ చేసిన ‘రామాయణ్’ సీరియల్‌కు ఇప్పటికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ ఈ సీరియల్ కోసం డైెరెక్టర్ ఓ కాకిని వేడుకున్నారన్న విషయం తెలుసా..


కొన్ని సంఘటనలు ఆసక్తిగా ఉంటాయి. ఎప్పుడో జరిగినా అవి వాటి ప్రాభవాన్ని కోల్పోవు. నిత్య నూతనంగా మనల్ని అలరిస్తుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి రామానంద్‌ సాగర్‌ ‘రామాయణం’ సమయంలో జరిగిన ఓ అరుదైన ఘటన. ఓ కాకి.. షూటింగ్ సమయంలో రామానంద్ సాగర్‌కు సాయపడింది. ఈ విషయాన్ని రామానంద్ సాగరే స్వయంగా చెప్పుకొచ్చారు.

భారతీయులకు అత్యంత ఇష్టమైన పౌరాణిక గాథ రామాయణం. హిందువులు ఇష్టపడే, గౌరవించే పురాతన ‘రామాయణం’ని అంతే మహిమాన్వితంగా రామానంద్‌ సాగర్‌ సీరియల్‌గా మలిచి మన ముందు ఉంచారు. ఎనభైల నాటి ఈ సీరియల్‌ ప్రతి ఆదివారం ప్రసారమయ్యేది. అప్పట్లో ఈ సీరియల్‌ వచ్చే సమయంలో రోడ్లపై నిశ్శబ్దం అలుముకునేది. దాదాపు ప్రతి ఇంట్లో సీరియల్‌లోని పాత్రలపై చర్చలు జరిగేవి. అంటే ఈ సీరియల్ ఎంత ప్రజాదరణ పొందిందో తెలుస్తోంది. ఆ మధ్యన కరోనా మహమ్మారి సమయంలో మళ్లీ ఈ సీరియల్‌ను ప్రసారం చేసిన విషయం తెలిసిందే. సీరియల్స్‌ ఎపిసోడ్‌లు రికార్డ్‌ స్థాయిలో టీఆర్పీని సాధించాయి.

టీఆర్పీల లెక్కలు ప్రక్కన పెడితే.. రామాయణం షూటింగ్ గురించి అసంఖ్యాకమైన కథలు ఉన్నాయి. అవన్నీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది కాకి కనపడే ఎపిసోడ్. ఈ ప్రత్యేక ఎపిసోడ్ ఉత్తర రామాయణంలోనిది. కాకుల రాజు కాక్ భూషండి... దశరథ రాజు రాజభవనంలో పాల కోసం ఏడుస్తున్న ఈ చిన్న పిల్లవాడు విష్ణు అవతారమైన శ్రీరాముడని నమ్మలేకపోతాడు. దాంతో పరీక్షించటానికి మానవ శిశువులా ఏడుస్తున్న పసి బాలుడు శ్రీరాముడి గదిలోకి ప్రవేశించాడు. అనుమానాస్పదంగా చూస్తూ పసిబాలుడైన శ్రీరాముని చేతిలోని రోటీ (రొట్టె)నీ లాక్కుంటాడు.

దాంతో ఆ రాముడు సాధారణ శిశువులందరిలాగే మరింత ఏడవడం ప్రారంభిస్తాడు. దశరథుడి గదిలో ఉన్న చిన్న బాలుడైన రాముడు... మానవుడే తప్ప తనను తాను రక్షించుకునే శక్తి ఉన్న దేవుడు కాదని కాక్ భూషండి నిర్ణయించుకుని గాల్లోకి ఎగురుతాడు . అలా ఆకాశంలోకి ఎగురుతున్నప్పుడు చిన్న బాబు అయిన రాముడు తన పాదాలను పట్టుకుని తనతో పాటు ఎగురుతున్నట్లు గ్రహించాడు. దాంతో దిగ్భ్రాంతికి గురైన కాక్ భూషండి విదిలించుకోవటానికి ప్రయత్నిస్తాడు. విఫలమవుతాడు. దాంతో వేరే దారిలేక అతను దశరథుని రాజభవనానికి తిరిగి వస్తాడు . అయితే చూస్తే అక్కడ అదే శిశువు శ్రీరాముడు ఇప్పటికీ గదిలో కూర్చుని బిగ్గరగా ఏడుస్తున్నాడని చూసి నమ్మలేకపోతాడు. ఇదీ సీన్. దీన్ని తీయాలి.

కాకులను రప్పించి ఎలా షూట్ చేయాలో రామానంద్ సాగర్‌కు అర్థం కాలేదట. ట్రైనింగ్ కాకులు ఉండవు కదా. కానీ ఖచ్చితంగా ఆ ఎపిసోడ్ తీయాలని నిర్ణయంచుకున్నారు ఆయన. అప్పుడు బృందావన్ స్టూడియోలో షూట్ చేస్తున్నాడు ఆయన. అక్కడ చెట్టుపై చాలా కాకులు ఉండటం గమనించాడు. అప్పుడే సాయంత్రం సూర్యాస్తమయం అవడంతో కాకులన్నీ అరవడం ప్రారంభించాయి. రామానంద్ సాగర్.. ఓ కాకిని పట్టుకోమని తన యూనిట్ మొత్తాన్ని పంపాడు. ఖచ్చితంగా వాళ్లకు చెప్పాడు...ఉదయం షూట్ కోసం నాకు కాకి అవసరం అని.

అయితే కాకిని పట్టుకోవడం అంత సులభం కాదు. ఏదో విధంగా, నానా తిప్పలు పడితే 4 కాకులు దొరికాయి. రాత్రి సమయంలో, భద్రత కారణంగా ఆ కాకులను అల్యూమినియం గొలుసుతో కట్టారు. కాకులు గోల గోల చేస్తూ ఈ గొలుసులతో ఎగరడానికి ప్రయత్నించడం ప్రారంభించాయి. మొత్తానికి ఉదయం 9 గంటలకు షూటింగ్ ప్రారంభం అయ్యింది. వాటిని విప్పుతూంటే పట్టుబడిన కాకులలో మూడు పారిపోయాయి. ఒక్కటే మిగిలి ఉంది.

మరుసటి వారం, ఈ ఎపిసోడ్ దూరదర్శన్‌లో ప్రసారం చేయాలి. దాంతో రామానంద్ సాగర్ టెన్షన్ పడ్డారు. కాసేపటికి ఓ ఆలోచన వచ్చి ఆయన ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఆయన లేచి, చుట్టూ చూశారు. షూటింగ్ కు అంతా రెడీగా ఉంది. ఆయన ఎప్పుడు యాక్షన్ చెప్తే అప్పుడే మొదలు. ఓ ప్రక్కన రాముడుగా చేసే ఆ పిల్లవాడు సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు రామనంద్ సాగర్ "ఆ కాకినిని చూశాడు. అది ఒంటరిగా ఉండి స్వేచ్ఛ కోసం అల్లకల్లోలం సృష్టిస్తోంది.

అప్పుడు రామానంద్ సాగర్.. మౌనంగా ప్రార్ధించాడు. ఆ కాకి దగ్గరకు వెళ్లి భక్తిగా పలకరించాడు. “కాక్ భూషండీజీ ఈ ఎపిసోడ్ ఈ ఆదివారం ప్రసారం చేయాలి.. నేను మీ శరణు జొచ్చాను.. దయచేసి నాకు సహాయం చెయ్యండి” అని అన్నాడు. అక్కడ పూర్తిగా నిశ్శబ్దం. కాకి కూడా ప్రశాంతపడింది. నిజంగానే కాకుల రాజు ఆయన ప్రార్థన విని… ఆ కాకి శరీరంలోకి వచ్చినట్లు అనిపించింది.

రామానంద్ సాగర్ 'కెమెరా.. రోలింగ్' అని అరిచాడు. కాకిని బంధించలేదు.. వదిలేశారు. పదినిముషాలు పాటు కెమెరా ఆన్‌లో ఉంది. రామానంద్ సాగర్ సూచనలను ఇస్తూనే ఉన్నాడు "కాక్ భూషండీజీ బాలుడైన రాముడు వద్దకు వెళ్లి అతని రోటీని లాక్కో..." అన్నారు. ఆ సూచనలను కాకి అనుసరించింది. ఏం చెప్తే అదే పది నిముషాలు పాటు చేసింది. ఆ షూటింగ్ అయ్యిపోగానే ఆ కాకి పైకి ఎగిరిపోయింది. నిస్సందేహంగా కాక్ భూషండీజీ అయినా కాకుల రాజు ఆ కాకి శరీరంలోకి భూమిపైకి దిగి రామానంద్ సాగర్ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చాడు అన్నారంతా.

అంతలా ఆధ్యాత్మికంగా భావనకులోనై రామానంద్ సాగర్ ఈ సీరియల్ చిత్రీకరించాడు కాబట్టే 1980ల్లో ప్రసారమైన ఈ రామానంద్‌ సాగర్‌ ‘రామాయణం’ నేటికీ అభిమానులను అలరిస్తూనే ఉన్నది. ఈ దృశ్య కావ్యంలో పాత్రలు పోషించిన నటీనటులందరూ చిరస్థాయిగా గుర్తింపు పొందారు. ఈ సీరియల్‌లో అరుణ్‌ గోవిల్‌ రాముడిగా, సీతగా దీపికా చిఖ్లియా, రావణుడిగా అరవింద్‌ త్రివేది, హనుమంతుడిగా ధారాసింగ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Read More
Next Story