జయప్రద అంత తప్పేం చేశారు?
x
జయప్దర ఫైల్ పోటో

జయప్రద అంత తప్పేం చేశారు?

ఆంధ్ర నా జన్మ భూమి కానీ ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి అంటూ ఉత్తర ప్రదేశ్ రాంపూర్ నియోజవర్గం నుంచి 2004లో లోక్ సభకు ఎన్నికైన జయప్రదకు కోర్టు హుకుం ఇచ్చింది


రాజ్యసభ మాజీ సభ్యురాలు, అలనాటి అందాల నటి జయప్రదను అరెస్టు చేయాలని రాంపూర్ కోర్టు ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులంటే అంత నిర్లక్ష్యమా అంటూ ప్రశ్నించింది. ఆమెను తక్షణమే అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచాలని హుకుం జారీ చేసింది.

ఇంతకీ ఆమె చేసిన తప్పేంటీ?

ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో జయప్రద ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనేది ఆరోపణల. దీనిపై రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఏడు సార్లు ఆమెకు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. అయినా ఆమె స్పందించలేదు. తన లాయర్ తో సమాధానాలు ఇప్పించారే తప్ప కోర్టుకు వెళ్లలేదు. దీంతో కోర్టు వారికి కోపం వచ్చింది.

కోర్టుకు హాజరుకాకపోవడంతో ఉత్తరప్రదేశ్‌ రాంపూర్‌లోని ఎంపీ, ఎమ్మెల్యేల కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. “జయప్రదపై జారీ చేసిన ఏడో వారెంట్‌ ఇది. అయినా ఆమె స్పందించలేదు. ఆమెను వెంటనే అరెస్టు చేసి కోర్టుకు తీసుకురండి“ అని కోర్టు న్యాయమూర్తి రాంపూర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

ఐదేళ్ల కిందటి కేసులివి...

2019 ఎన్నికల సమయంలో జయప్రద ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలు వచ్చాయి. రెండు కేసులు నమోదయ్యాయి. ఆమె 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాంపూర్ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు.

“ఒక కేసు కామ్రీ పోలీస్ స్టేషన్‌లో, మరొకటి స్వర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది“ అని ఒక అధికారి తెలిపారు. ప్రాసిక్యూషన్ వాంగ్మూలం పూర్తయింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 313 కింద జయప్రద వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. “జయప్రద తన స్టేట్‌మెంట్ ఇవ్వడానికి కోర్టు అనేక తేదీలను నిర్ణయించింది. అయినా ఆమె కోర్టుకు రాలేదు. దీంతో కోర్టు ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. అయినప్పటికీ ఆమె హాజరుకాలేదు“ అని పోలీసు అధికారి చెప్పారు. ఈ నేపథ్యంలో నిన్న కూడా ఆమె కోర్టుకు రాలేదు, ఆ తర్వాత రెండు కేసులకు సంబంధించి మరో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 27న జరుగుతుంది.

మన తెలుగింటి బిడ్డ ఈ జయప్రద..

తెలుగునాట పుట్టి టాలివుడ్, కోలీవుడ్, బాలివుడ్ లో రాణించిన మహానటి జయప్రద. తెలుగు సినీ రంగంలో జయప్రద లేదా జయప్రద నహతాగా పరిచితురాలైన ఆమె అసలు పేరు లలితారాణి. జయప్రద 1962 ఏప్రిల్ 3న ఏపీలోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబం జన్మించారు. ఆమె తల్లిదండ్రులు కృష్ణ, నీలవేణి. డాక్టరు కాబోయి యాక్టర్ అయ్యానంటుంటారు ఆమె. ఏడో ఏటి నుంచే నాట్య సంగీత శిక్షణ పొందిన జయప్రద ఆ తర్వాత ఏడేళ్లకు సినీ చాన్స్ దక్కించుకున్నరు. తండ్రి, బాబాయిలు సినిమా పెట్టుబడిదారులైనప్పటికీ ఈమెకు సినీరంగ ప్రవేశం దొరకలేదు. 14 ఏళ్ల వయసులో ఓ నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం.ప్రభాకరరెడ్డి ఈమెను చూసి చాన్స్ ఇచ్చారు. ఆమె పేరు కూడా మార్చేశారు. జయప్రద అని పేరుపెట్టి 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో ఓ పాత్ర ఇచ్చారు. అలా మొదలైన ఈమె సినీ ప్రస్థానం 2005 వరకు మూడు దశాబ్దాలలో ఆరు భాషలలో అప్రతిహాతంగా సాగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలి భాషల్లో సుమారు 300కు పైగా సినిమాలలో నటించింది. ఈమె 1986 జూన్ 22న సినీనిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహమాడారు.

ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి...

నందమూరి తారక రామారావు ఆహ్వానంతో 1994 అక్టోబర్ 10 న తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం చీలిపోయినప్పుడు జయప్రద చంద్రబాబు నాయుడు వైపు చేరారు. టీడీపీ మహిళా విభాగానికి అధ్యక్షురాలయ్యారు. 1996 ఏప్రిల్ లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత పార్టీ నాయకులతో వచ్చిన గొడవలతో టీడీపీకి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ కు చెందిన సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆంధ్ర నా జన్మ భూమి కానీ ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి అన్న నినాదంతో ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నియోజవర్గం నుంచి 2004 మే 13న లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చారు.

Read More
Next Story