రవితేజ ‘ఈగల్’ మూవీ రివ్యూ
"క్రాక్", ఆ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’, ‘ధమాకా’ తప్ప హిట్స్ లేని రవితేజ ఫాన్స్ కు ఇది ముఖ్యమైన చిత్రం. అయితే, ‘ఈగల్’ ఎక్కువ ఎత్తుకు ఎగరలేకపోయిందా?. మూవీ రివ్యూ
సంక్రాంతి బరిలో దిగవలసిన "ఈగల్" సినిమా ఒక నెల ఆలస్యంగా వచ్చింది. ఈ మధ్యకాలంలో "క్రాక్" సినిమా, మధ్యలో ఓ మేరకు సక్సెస్ అనిపించిన వాల్తేరు వీరయ్య, ధమాకా తప్ప పెద్దగా హిట్ సినిమాలు లేని రవితేజ కు, ఫ్యాన్స్ కు కూడా ఇది ముఖ్యమైన సినిమా. అలాగే "సూర్య వర్సెస్ సూర్య" తో డైరెక్టర్ గా మొదలుపెట్టిన ఒక సక్సెస్ ఫుల్, స్టైలిష్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని కి కూడా ఇది చాలా ముఖ్యమైన సినిమా. ఈ పదేళ్ల కాలంలో కార్తీక్ దర్శకుడిగా ఒక సినిమా మాత్రమే తీశాడు. సినిమా ఇండస్ట్రీ కూడా ఈ సినిమా గురించి వెయిట్ చేస్తోంది.
“ఈగల్ కాన్సెప్ట్ విధ్వంసం. ఇందులో రవితేజది పత్తిని పండించే రైతు పాత్ర(సహదేవ్ వర్మ). ఇది అంతర్జాతీయ సమస్య మీద పోరాటం చేసే పాత్ర. సమస్య ఏంటో తెరపై చూడాలి. మనం సాధారణంగా రాంబో, టెర్మినేటర్ సినిమాలు చాలా ఎంజాయ్ చేస్తాం. అలాంటి ఓ చిత్రం తీసుకురావాలని ఈగల్ సినిమా తీశాను. ఇది ఒక అద్భుతమైన యాక్షన్ డ్రామా. ఈ సినిమా సౌండ్ డిజైన్ ఆరు నెలలు చాలా కష్టపడ్డాం. రియల్ గన్స్ తో షూట్ చేసి సౌండ్ రికార్డ్ చేశాము. విదేశాల్లో జరిగిన ఒక నిజ సంఘటన పైన ఆధారపడి దీన్ని రాసుకోవడం జరిగింది. గద్ద చూపు చాలా పవర్ ఫుల్. ఈ సినిమాలో హీరోకి అంత శక్తి ఉంటుంది. ఈ పాత్రకు సినిమాలో కూడా కోడ్ నేమ్ ఈగల్. అందుకే ఆ టైటిల్ పెట్టాం. చిత్రానికి మేము పరిపూర్ణమైన ముగింపు ఇచ్చాం. అలాగే ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందని క్లూ కూడా ఇచ్చాం. నాకు కథలు చెప్పడం చాలా ఇష్టం. అయితే సినిమాటోగ్రాఫర్ గా మారడం అనేది అనుకోకుండా జరిగింది. ఇకనుంచి సినిమాటోగ్రఫీతో పాటు దర్శకత్వం కూడా చేస్తాను" తన సినిమా గురించి తనే ఒక రివ్యూ లాగా దర్శకుడు మీడియాతో చెప్పిన కొన్ని విషయాలు ఇవి.
ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే, నళిని(అనుపమ పరమేశ్వరన్) అనే ఒక జర్నలిస్టు రాసిన చిన్న వార్తతో మొదలై విధ్వంసం దిశగా నడుస్తుంది. "ఈగిల్" అనబడే ఒక దయదాక్షిణ్యాలు లేని కిల్లర్ సృష్టించిన విధ్వంసం ఈ సినిమా కథ. నిజంగానే తెరమీద విధ్వంసం సృష్టించిన సినిమా. ఈగిల్ బ్యాగ్రౌండ్ ఏంటి? పత్తి పంటకి, సహదేవ వర్మ, ఉరఫ్ ఈగల్ (రవితేజ)కి ఏంటి సంబంధం. భారత అత్యున్నత గూఢచార సంస్థ రా(RAW), ఎందుకు ఈగల్ వెంటపడింది. అసలు ఈగల్ లక్ష్యం ఏంటి? వంటి వాటితో పాటు మధ్యలో రచన(కావ్య థాపర్) ఎవరు? మరోవైపు నక్సల్స్, టెర్రరిస్టులు ఈగల్ ను ఎందుకు చంపాలి అనుకున్నారు? వంటి వాటితో కథ ముందుకు నడుస్తుంది.
"నాకు కథ చెప్పడం ఇష్టం" అని డైరెక్టర్ చెప్పాడు, ఇష్టం సంగతి సరే గానీ ఈ సినిమాలో దర్శకుడు సరిగ్గా చెప్పలేకపోయిన విషయం అది ఒక్కటే! సినిమాలో మిగతా పాత్రలన్నీ హీరోని ఎలివేట్ చేస్తూ వారి వారి యాంగిల్స్ లో చెప్తూ పోతారు, కథ మాత్రం ఇంటర్వెల్ తర్వాత గాని స్టార్ట్ కాదు. ఒకవేళ రెండో సగంలో కథ గురించి చెప్పినప్పటికీ, దాంట్లో క్లారిటీ లేదు. మిగతా విషయాల్లో డైరెక్టర్ కి చాలా క్లారిటీ ఉంది, కానీ కథ చెప్పడంలో లేదు. కథను థ్రిల్లింగ్ గా నడపాలన్న ధ్యాసతో, కథ తో పాటు కథనాన్ని కూడా తనే స్వయంగా చెడగొట్టుకున్నాడు. సినిమాటోగ్రాఫర్, దర్శకుడు ఒకరే అయినప్పుడు ఇలాంటి సమస్య సాధారణంగా ఉంటుంది. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పాలి. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ ఉన్నత స్థాయిలో ఉంది. దీనికి కారణం దర్శకుడితోపాటు, ఇంకో ఇద్దరు హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్స్(కమిల్ ప్లాకి, కర్మ్ చావ్ల).
ఇక్కడ ఇంకో విషయం ప్రస్తావనార్హం. "రాంబో, టెర్మినేటర్ సినిమాలను మనం ఎంజాయ్ చేస్తాం", అని చెప్పిన దర్శకుడు వాటిని మనం తెలుగులో తీయమన్న విషయాన్ని మర్చిపోయాడు. భూ భౌగోళికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అమెరికా వేరు భారతదేశ పరిస్థితులు వేరు. పైగా హాలీవుడ్ పరిధి చాలా పెద్దది. ఈ విషయం ఎరిగి సినిమాలు తీయడం వల్ల అవి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అంటే హాలీవుడ్ లాంటి సినిమాలు తీయకూడదు, హాలీవుడ్ స్థాయిలో మాత్రం తీయాలి. ఇక్కడే ఇంకో విషయం చెప్పాలి. ఇంతకుముందే చెప్పినట్లు ఖచ్చితంగా ఈ సినిమా నిర్మాణ విలువలు, ఫోటోగ్రఫీ, లొకేషన్స్, నేపథ్య సంగీతం, చిత్రీకరణ చాలా బాగున్నాయి.హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి.
నటన పరంగా చెప్పాలంటే, ఇది పూర్తిగా రవితేజ సినిమా, వన్ మ్యాన్ షో. 56 ఏళ్ల వయసులో(మొదటిసారి వయసుకు తగ్గ పాత్ర లో). రవితేజ ఎనర్జీ చూస్తే ముచ్చటేస్తుంది. రవితేజ ఒక డిఫరెంట్ స్టైల్ నటుడు. ఈ సినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకుంటాడు అనడం కన్నా సినిమాని నడిపిస్తాడు అని చెప్పడం కరెక్ట్. . ఇక మిగతా నటీనటుల సంగతి కొస్తే, అవసరాల శ్రీనివాస్(రా ఏజెంట్) గా పర్వాలేదు. అలాగే నవదీప్ కి చాలా రోజుల తర్వాత ఒక మంచి పాత్ర దొరికింది. బాగానే యుటిలైజ్ చేసుకున్నాడు. అనుపమ పరమేశ్వరన్ జర్నలిస్టుగా పర్వాలేదు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో వినయ్ రాయ్ ఆకట్టుకుంటాడు. ఈ సినిమాలో సర్ప్రైజ్ ప్యాకేజ్ శ్రీనివాస్ రెడ్డి, అజయ్ ఘోష్ ల మధ్య కామెడీ, బాగానే ఉంది. ఇలాంటి సినిమాల్లో డైలాగులకు పెద్ద ప్రాధాన్యత ఉండదు కాబట్టి అక్కడక్కడ డైలాగులు బానే ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఏవైతే ఉండకూడదు అని, వాటిని నాశనం చేయాలని లక్ష్యం పెట్టుకున్నఈగల్ తన లక్ష్య సాధనకు వాటినే విచ్చలవిడిగా వాడటం విచిత్రమే! బహుశా ముల్లుని ముల్లుతోనే తీయాలనుకున్నాడేమో!
దర్శకుడు సినిమా విడుదలకు ముందే సీక్వెల్ ఉంటుందని స్పష్టం చేశాడు కాబట్టి ఇక ప్రేక్షకులు సీక్వెల్ కోసం ఎదురు చూడాలి. ఇప్పుడు ఈ సినిమా చూడాలంటే మాత్రం రవితేజ కోసమే చూడాలి. ఈ సినిమా యువతను, ఫాన్స్ ను ఆకట్టుకోవచ్చు గాని, మిగతా ప్రేక్షకులకి అంతగా నచ్చకపోవచ్చు.
ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. సినిమా లో ముఖ్యమైన కథ, స్క్రీన్ ప్లే విభాగాల్లో ఇద్దరు పని చేశారు. అందుకే "Two" many cooks spoil the dish??!! అనుకుందామా?
తారాగణం:
నటీనటులు: రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, మధుబాల తదితరులు
దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
స్క్రీన్ ప్లే: కార్తీక్ ఘట్టమనేని, మణిబాబు కరణం
కథ: కార్తీక్ ఘట్టమనేని, మణిబాబు కరణం
సంగీతం: దవ్జాంద్
ఛాయాగ్రహణం:కార్తీక్ ఘట్టమనేని, కర్మ్ చావ్లా, కమిల్ ప్లోకీ
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేది: 9 ఫిబ్రవరి 2024
Next Story