తెలుగు రాష్ట్రాల్లో మంజుమ్మల్ బాయ్స్’షోలు ఆపేశారు...ఎందుకో తెలుసా?
మంజుమ్మల్ బాయ్స్ సినిమా షోస్‌ను తెలుగు రాష్ట్రాల్లో ఆపేశారు. పీవీఆర్ సినిమాస్ వాళ్లు ఇలాంటి సంచలన నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలుసా..
కొన్ని సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. ఎక్కడో మొదలైన ఏదో ఒక సంఘటన ..మరోచోట ముగిస్తూ కొన్నిటికి మంగళం పాడుతుంది. ఎక్కడో బ్రెజిల్ దేశంలో ఒక సీతాకోక చిలక ఎగరడం వలన అమెరికాలో ఒక పెద్ద తూఫానికి కారణం అవుతుంది - దీన్ని బటర్-ఫ్లై ఎఫెక్ట్ అని చాలా మంది చెపుతూ ఉంటారు. అలా ఇప్పుడు చక్కగా ఓ రూపాయి సంపాదించుకోవచ్చు.. సూపర్ హిట్ సినిమాని డబ్ చేసి రిలీజ్ చేశాం అని సంబరపడుతున్న ‘మైత్రీ మూవీస్’కు దెబ్బ పడింది. అదెలా అంటారా... మలయాళ సినిమాలకు ఈ మధ్యన ఊపొచ్చింది. వచ్చిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అయిపోతోంది. వాటిని డబ్ చేసి మనవాళ్లు కూడా బాగానే సంపాదిస్తున్నారనుకోండి. అలా ప్రేమలు అనే మలయాళ సినిమాను డబ్ చేసి రాజమౌళి కొడుకు కార్తికేయ బాగానే సక్సెస్ కొట్టాడు. ఆ తర్వాత వంతు.. రీసెంట్‌గా మలయాళ సూపర్ హిట్ ‘మంజుమ్మల్ బాయ్స్’ది. ఈ సినిమా (Manjummel Boys)ను ‘మైత్రీ మూవీస్’ తెలుగులో డబ్ చేసి, విడుదల చేసింది. దిల్ రాజు తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్‌కి ఈ సినిమా దెబ్బ కొట్టింది. ఫ్యామిలీ స్టార్ చిత్రం బొబ్బుంటే ఈ సినిమా బాగా వర్కవుట్ అయ్యింది.
అయితే ఊహించని విధంగా పీవీఆర్ మల్టీప్లెక్స్ తెలుగు రాష్ట్రాల్లో ‘మంజుమ్మల్ బాయ్స్’ ప్రదర్శనలను గురువారం అర్ధాంతరంగా నిలిపివేసింది. దీంతో, మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్‌రెడ్డి నిర్మాతల మండలిని ఆశ్రయించారు. ప్రసుత్తం ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతుండగా నిలిపివేయడంపై మండిపడ్డారు. మలయాళం నిర్మాతతో ఇబ్బంది ఉంటే తెలుగు వెర్షన్ ఎలా ఆపుతారని ప్రశ్నించారు. పీవీఆర్ మల్టీప్లెక్స్ వ్యవహారంపై నిర్మాతల మండలి అత్యవసర సమావేశం కానుంది. అయితే ఈ మేటర్‌కు బటర్-ఫ్లై ఎఫెక్ట్‌కు లింకేంటంటరా.. అక్కడికే వస్తున్నాను... అసలు జరిగింది ఇదీ.. పీవీఆర్ మల్టీప్లెక్స్ (PVR Multiplex)కి మలయాళ చిత్ర పరిశ్రమకు డిజిటల్ ప్రొవైడర్ల విషయంలో వివాదం మొదలైంది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్, నిర్మాతల మధ్య జరుగుతున్న వివాదం నేటిది కాదు. గతంలో ప్రింట్ సిస్టమ్ మాత్రమే ఉండేది. అయితే డిజిటలైజేషన్‌లో భాగంగా డిజిటల్ ప్రింట్ భారీ స్థాయిలో వాడకంలోకి వచ్చేసింది. దీంతో చాలా వరకు థియేటర్లని డిజిటలైజ్ చేసేశారు. అయితే నిర్మాతలకు ఇది పెను భారంగా మారుతూ వస్తోందని, డిజిటల్ ప్రొవైడర్లు ఈ విషయంలో తమని దోపిడీకి గురి చేస్తున్నారని నిర్మాతలు వాపోతున్నారు.
వాళ్ల మీద బోలెడు కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ డిజిటల్ సర్వీసు ప్రొవైడర్స్ నిర్మాతలు ఇచ్చే కంటెంట్ ద్వారా ప్రకటనలను అందులో చేర్చి కోట్లు సంపాదిస్తూంటారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల ప్రదర్శన కోసం నిర్మాతల వద్ద నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుం వసూలు చేస్తున్నారు. యూఎఫ్‌ఓ(u.f.o) అని, క్యూబ్ (qube) అనే రెండు సంస్థలు మోనోపాలితో నిర్మాతలను దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ మాఫియాపై ఉక్కు పాదం మోపి సగటు సినీ ప్రేక్షకులను, పరిశ్రమను కాపాడాలని గతంలో విజ్ఞప్తులు చేసినా ఫలితం లేదు. భారీ స్థాయిలో కోట్లు ఖర్చు చేసి సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు గత కొంత కాలంగా క్యూబ్, యుఎఫ్‌ఓ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ భారీ స్థాయిలో నష్టపోతున్నా ఏం చెయ్యలేని పరిస్దితి. దాంతో ఈ సమస్యకు పరిష్కారం దొరక్క కాస్తంత బెదిరిద్దామని అంతకు ముందు తెలుగులో సినిమా థియేటర్లను బంద్ చేయడం వంటివి చేశారు. కానీ ఓ కొలిక్కి రాలేదు. దాంతో వదిలేశారు. ఇప్పుడు కేరళ వాళ్లు దీనికి పరిష్కారం కనుక్కోవాలని నడుం బిగించారు. ఈ వివాదంపై అక్కడ నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చారు.
మళయాళ నిర్మాతలు తమ సొంత ప్రొడక్షన్ కంటెంట్ మాస్టరింగ్ సిస్టమ్ PDC (Producers Digital Content)ని ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని పీవీఆర్ వారిని అవి వాడమని కోరారు. తమ మలయాళ సినిమాలను ఆ ఫార్మెట్‌లో ప్రదర్శించమన్నారు. అయితే నిర్మాతల వరకూ ఈ ఆలోచన బాగానే ఉంది కానీ ఈ కొత్త ఫార్మాట్‌ని ఎడాప్ట్ చేసుకోవటానికి పీవీఆర్‌కు చాలా ఖర్చు అవుతుంది. అసలు పీవీఆర్ నష్టాల్లో ఉంది. ఇప్పుడు కొత్త పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన లేదు. దాంతో వాళ్లు మావల్ల కాదు అని మళయాళ సినిమాల ప్రదర్శననే ఆపేశారు. అందులో భాగంగానే ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys)తెలుగు వెర్షన్ ని ఆపేసారు. ఇలా ఎక్కడో మొదలైంది ఇక్కడ మైత్రీ మూవీస్ దగ్గరకు వచ్చి ఆగింది.
అయితే రంజాన్ సెలవు రోజు. అలాగే వీకెండ్ వస్తోంది. కరెక్ట్‌గా రెవిన్యూ జనరేట్ అయ్యే టైమ్. ఇలాంటప్పుడు ఇలా చేస్తే కష్టం అని పీవీపి తీరుపై డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీస్ (Mythri Movies) ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయం కోసం నిర్మాతల మండలిని ఆశ్రయించింది. మలయాళ నిర్మాతతో వివాదం అయితే తెలుగు వెర్షన్ నిలిపివేయడం ఏంటని ప్రశ్నిస్తోంది. ఏదైన గొడవలు ఉంటే మీరు నేరుగా వారితో తేల్చుకోవాలని, వెంటనే మూవీ ప్రదర్శించాలని కోరిన పీవీఆర్ యాజమాన్యం వినిపించుకోలేదట. దీంతో మైత్రి మూవీస్ వారు ఈ విషయమై తెలుగు ఫిలిం ఛాంబర్‌ను ఆశ్రయించారు. పీవీఆర్ మల్టిప్లెక్స్ వ్యవహారంపై ఆయన ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఫిలిం ఛాంబర్ పీవీఆర్ యాజమాన్యంతో అత్యవసర సమావేశానికి పిలుపినిచ్చింది. ఇదండీ విషయం. దీన్నే ఉరిమి ఉరిమి మైత్రీ మీద పడ్డట్లు అని కూడా చెప్పుకోవచ్చు.