టీనేజ్ ప్రేమని దేశమంతా వెదజల్లిన ‘బాబీ’ సినిమాకు 50 యేళ్లు...
x

టీనేజ్ ప్రేమని దేశమంతా వెదజల్లిన ‘బాబీ’ సినిమాకు 50 యేళ్లు...

50 సంవత్సరాలైనా ఒళ్లు పులకరింపచేసే ప్రేమ కథ బాబీ. ఎప్పుడూ ప్రస్తావనకు వచ్చే టీనేజ్ ప్రేమ కథ బాబీ. ఎన్నో విశేషాలకు, వివాదాలకు నెలవైన ఈ సినిమా జ్ఞాపకాలు



టీనేజ్ ప్రేమ కథల స్వరూపాన్ని మార్చేసి, ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమా " బాబీ " చిత్రం విడుదలయి యాభై యేళ్లు పూర్తయింది. అంతవరకు వచ్చిన ప్రేమ కథలన్నీ ఒక ఎత్తు, బాబీ ఒక్కటి ఒక ఎత్తు. దాంతోపాటు రాజ్ కపూర్ తాకట్టు పెట్టిన కపూర్ కుటుంబ వారసత్వ సంపద అయిన ఆర్కే స్టూడియో ని కూడా వేలం వేయకుండా నిలబెట్టిన సినిమా ఇది.
50 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఎప్పుడో ఒకసారి ప్రస్తావించబడుతున్న సినిమా బాబీ. ప్రేమ కథకు భాష్యం చెప్పిన సినిమా ఇది. ఎన్నో విశేషాలకు, విచిత్రాలకు, కొన్ని వివాదాలకు నెలవైన సినిమా . బాక్సాఫీస్ ను పూర్తిగా బద్దలు కొట్టిన సినిమా. ఒక అంచనా ప్రకారం, ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తేఈ సినిమా దాదాపు 300 కోట్లు వసూలు చేసినట్లే. ఇవన్నీ పక్కన పెడితే, భారత సినిమా చరిత్రలో ప్రేక్షకుల గుండెల్లో ఒక శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి!.ప్రస్తుతం స్వర్ణోత్సవం జరుపుకుంటున్న ఈ సినిమా (28 సెప్టెంబర్ 1973)ఎన్నో విశేషాల, విచిత్రాల సమాహారం.

1913 లో మొదటి సినిమా "రాజా హరిశ్చంద్ర" వచ్చిన 60 ఏళ్ల తర్వాత,ఒక ప్రభంజనంలా వచ్చి ఎన్నో రికార్డులు సృష్టించిన సినిమా రాజ్ కపూర్ " బాబీ ". 1973లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే. 70వ దశకంలో “షోలే”(1975) తర్వాత, ఎక్కువ వసూళ్లు రాబట్టిన సినిమా ఇదే. ఇంతవరకు అత్యధిక వసూళ్లు సాధించిన 20 సినిమాల లిస్టులో ఇది కూడా ఉంది. ఇది విజయవంతం కాకపోయి ఉంటే, రాజ్ కపూర్ ఆర్థికంగా చితికి పోయేవాడు.





1996లో షారుక్ ఖాన్, కాజల్ జంటగా తీసిన ప్రేమ కథ " దిల్వాలే దుల్హనియా లేజాయేంగే" సినిమా వసూళ్ల పరంగా సంచలనం సృష్టించినప్పటికీ, బాబీ అంత పాపులర్ కాలేకపోయింది. 50 ఏళ్ల తర్వాత కూడా బాబీ పాటలు ఇంకా ప్రజలు పాడుకుంటూనే ఉన్నారు. బాబీ సినిమాను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.

ఆ తర్వాత వచ్చిన " షోలే" (1975)సినిమా కూడా ఒక ప్రభంజనమే. అది భారతీయ సినిమాల్లో ఒక స్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఎన్నో రికార్డులు సృష్టించింది. అయితే అది ప్రేమ కథ కాదు. అందుకే బాబీ సినిమా ప్రేక్షకుల్లో మనసుల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. హిందీలో ఎన్ని ప్రేమకథలు వచ్చినా బాబీ ముందు దిగదుడుపే అని అంటారు, ఆ కాలం ప్రేక్షకులు,ఇప్పటి సినిమా రంగం వాళ్ళు కూడా. అదీ బాబీ ప్రత్యేకత.
ఇక రిషికపూర్ వేసుకున్న షర్ట్ కాలర్, "బాబీ" కాలర్ పేరుతో ఆ రోజుల్లో ఫేమస్. ఆ కాలపు యువత దీనిని ఫాలో అయ్యారు. అలాగే డింపుల్ కపాడియా వేసుకున్న గౌన్లు, ఫ్రాకులు, ఇతర అలంకరణలు చాలా కాలం పాటు వాడకంలో ఉన్నాయి. కొంతమంది వ్యాపారుస్తులు బాబీ ప్యాంట్లు, బాబీ షర్టులు తయారుచేసి అమ్మారు. కనీసం ఒక దశాబ్ద కాలం పాటు ఇది నడిచింది. అది బాబీ సినిమా క్రియేట్ చేసిన ఎఫెక్ట్. చాలామంది పిల్లలకి బాబీ పేరు పెట్టుకున్నారు. విశేషం ఏమిటంటే ఇందులో అమ్మాయి పేరు బాబీ బ్రిగాంజా అయినప్పటికీ అబ్బాయిలకు కూడా ఆ పేరు పెట్టడం. చాలామంది అబ్బాయిల ముద్దు పేరు బాబీ గా మారిపోయింది.

అంతగా ప్రేక్షకుల హృదయాల్లోకి (ముఖ్యంగా యువ ప్రేక్షకులు) ఇంకిపోయిన ఈ సినిమా తెర మీదికి రావడానికి కారణం, ఒక పెద్ద సినిమా భారీగా ఫెయిల్ కావడమే అంటే నమ్మబుద్ధి కాదు. అవును, ఎంతో ఇష్టపడి, చాలా కష్టపడి రాజ్ కపూర్ తీసిన " మేరా నామ్ జోకర్"(1972) సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలం కావడం వల్ల ఆర్థికంగా అతలాకుతలమయ్యాడు. ఆ నష్టాలను పూడ్చుకోవడానికి రాజ్ కపూర్ ఈ సినిమా తీయాల్సి వచ్చింది. ముందు రాజేష్ ఖన్నా లాంటి నటుడితో భారీ స్థాయిలో ప్రేమ కథ తీయాలని అనుకున్న రాజ్ కపూర్ ఆ పని చేయలేకపోయాడు. ఎందుకంటే అప్పటికే రాజేష్ కన్నా సూపర్ స్టార్ సాయి లో ఉన్నాడు. అలాంటి హీరోతో సినిమా తీయడం అంటే బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది. అందుకే చిన్న స్థాయిలో క్వాజా అహ్మద్ అబ్బాస్ రాసిన కథతో కొంత తక్కువ బడ్జెట్ లో ఈ సినిమా పూర్తి చేశాడు.
అయితే కేవలం ఒక మాదిరి విజయవంతమైన సినిమా తీయాలనుకున్నాడు. తీశాడు. కానీ అది ఇంత చరిత్ర సృష్టిస్తుందని,రాజ్ కపూర్, "ది షో మ్యాన్" కూడా ఊహించలేదట!





ఇంతా చేస్తే ఈ సినిమా కథ ఒక మామూలు సీదా సాదా కథ. ఒక మత్స్యకారుడి కూతురు, ఒక పెద్ద వ్యాపారస్తుడి కొడుకు మధ్య నడిచిన ప్రేమ కథ. ఇందులో ట్విస్టులు, టర్నులు ఏమీ లేవు. మరి సినిమా హిట్ కావడానికి కారణాలేంటి. అంతవరకు వచ్చిన సినిమాల్లో లేనివి ఇందులో ఉన్నవి ఏంటి. అని చూస్తే కొన్ని ప్రధానమైన అంశాలు కనబడతాయి.

50 సంవత్సరాల తర్వాత తీయాల్సిన సినిమా, 50 సంవత్సరాల ముందే తీయడం, ఈ సినిమా సక్సెస్ కావడానికి ప్రధానమైన కారణం

ఇదివరకు ప్రేమ కథ సినిమాలు చాలా వచ్చాయి. అయితే అవి ఒక పురుషుడికి, ఒక స్త్రీకి(లేదా ఒక యువతి యువకుడికి) మధ్య జరిగిన ప్రేమ మీద ఆధారపడినవి. అయితే మొదటిసారి ఈ సినిమా ఒక అబ్బాయి,అమ్మాయి ల మధ్య నడిచిన Adolescent(కౌమారదశ) ప్రేమ కథ. ఇంతవరకు రానిది. అదే సినిమా సక్సెస్ కు కారణం. చాలా కాలం తర్వాత ఈ విషయాన్ని రిషి కపూర్ ఒక సందర్భంలో చెప్పాడు.

అంతవరకు సాధారణ రొమాంటిక్ సినిమాలు, ప్రేమ కథలు చూసిన ఆ కాలం యువతకి ఈ సినిమా పిచ్చెక్కించింది. 16 ఏళ్ల అమ్మాయికి (ఈ సినిమా హీరోయిన్ డింపుల్ కపాడియా కి అప్పుడు 15 ఏళ్లు) 18 ఏళ్ల అబ్బాయికి(అప్పుడు రిషి కపూర్ వయసు 21 ఏళ్లు) మధ్య జరిగిన ఈ ప్రేమ కథ కొన్ని సంవత్సరాల పాటు రీ రిలీజ్ అవుతూ యువతను అలరించింది.

ఈ సినిమా సక్సెస్ కావడానికి మరో కారణం ఈ సినిమా పాటలు.ఈ సినిమా పాటలు సూపర్ డూపర్ హిట్. ఏ పాట కూడా తీసేయడానికి లేదు. మొదటిసారి ఆర్కే గ్రూపు సినిమాకు సంగీతాన్ని అందించిన లక్ష్మీకాంత్ ప్యారే లాల్ స్వరపరిచిన ప్రతి పాట హిట్టయింది.

తన కుమారుడు హీరో రిషి కపూర్ కి కొత్త గాయకుడు కావాలని భావించిన దర్శక నిర్మాత రాజ్ కపూర్ శైలేంద్ర సింగ్ ని ఎన్నుకున్నాడు. కానీ హీరోయిన్ కి మాత్రం లతా మంగేష్కర్ పాడితే బాగుంటుందని అనిపించింది. అయితే రాజ్ కపూర్ కి ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది. మేరా నామ్ జోకర్ కి ముందు వరకు రాజ్ కపూర్ సినిమాలకు ఎన్నో మంచి పాటలు పాడిన లతా మంగేష్కర్, తర్వాత పాడకూడదని నిర్ణయించుకుంది. రాజ్ కపూర్ మాత్రం లతా మంగేష్కర్ తోనే పాడించాలని పట్టుపట్టాడు.

లతా ఒప్పుకోకపోయినా, సంగీత దర్శకులు లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ఆమెను ఒప్పించారు. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇక్కడ ఒక విషయం ఉంది. 1972 లో వచ్చిన మేరా నామ్ జోకర్ సినిమాలో లతా ఒక్క పాట కూడా పాడలేదు. అందుకే తన సినిమా ఫెయిల్ అయిందని రాజ్ కపూర్ భావించాడు. బాబీ సినిమాలో లతా పాటలు పాడితే ఆ సినిమా కొంత విజయవంతమయ్యే అవకాశం ఉందని నమ్మాడు. కొంచెం మాట పక్కన పెట్టి చాలా ఎక్కువ విజయవంతమైంది. రాజ్ కపూర్ సెంటిమెంట్ నిజమైంది. ఒకవేళ లతా పాడకపోయి ఉంటే, ఏం జరిగి ఉండేదో ఎవరికి తెలియదు. అది ఇప్పుడు ఒక చరిత్ర.





ఇప్పటికి కూడా ఈ సినిమా పాటలు, ముఖ్యంగా " హమ్ తుమ్ ఏక్ కం రే మే బందో హో", చాలామంది హం చేస్తూనే ఉన్నారు. అంతగా యువతలోకి ఇంకిపోయిన పాట ఇది.మరో పాట " ఝూట్ బోలె కవ్వా కాటే" అప్పట్లో కాలేజీ డాన్స్ పోటీల్లో, ఇతర ఫంక్షన్లలో తరచుగా కనబడేది. ఈ పాట బినాక గీత్ మాల ప్రోగ్రాం లో 1974 సంవత్సరానికి రెండో స్థానంలో ఉంది.

ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ సినిమాలో పాటలు పాడే సమయానికి లతా వయసు 40 సంవత్సరాలు. అలాంటిది 16 ఏళ్ల అమ్మాయికి ఆమె పాటలు పాడితే, బాగుండేదేమో అని చాలామంది భావించారు. ఆ విషయం రాజ్ కపూర్ కు చెప్పారు కూడా. కానీ రాజ్ కపూర్ వినలేదు.

ఈ సినిమాలో నటీనటులు ఎంపిక కూడా రాజ్ కపూర్ చాలా జాగ్రత్తగా చేశాడు. హీరో తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు ప్రాణ్ (ఈ సినిమాలో నటించినందుకు ప్రాణ్ డబ్బులు తీసుకోలేదు), హీరోయిన్ తండ్రి పాత్రలో మరో ప్రముఖ నటుడు ప్రేమ్ నాథ్ లను ఎంపిక చేశాడు. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. అరుణ ఇరానీ పాత్రకు ముందుగా ప్రముఖ నటి "రేఖ"ను అనుకున్నారు. ఆమె అంతగా ప్రాధాన్యత లేదని పాత్రను నిరాకరించడంతో అరుణ ఇరానీ ఆ పాత్రలో నటించింది.

అంతవరకు ఒకటి అర సినిమాల్లో బాల నటుడిగా వేసిన రిషికపూర్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు, డింపుల్ కపాడియా కి మాత్రం ఇది మొదటి సినిమా. రాజేష్ ఖన్నా ను పెళ్లి చేసుకున్న డింపుల్ కపాడియా చాలా కాలం వరకు ఇంకో సినిమాలో నటించలేదు. రాజేష్ కన్నాతో విభేదాల తర్వాత 1982 లో రమేష్ సిప్పి దర్శకత్వంలో " సాగర్" సినిమాలో నటించింది. విశేషమేమిటంటే ఇందులో మళ్ళీ హీరో రిషికపూరే!

ఇక హీరోయిన్ పాత్రకి చాలామంది అమ్మాయిలను ఆడిషన్ చేసి ముగ్గురిని సెలెక్ట్ చేశారు.
ఒకరు డింపుల్ కపాడియా (తర్వాత ఈమె తనకన్నా రెండింతలు వయసు ఉన్న రాజేష్ ఖన్నా ను చేసుకుంది.) ఈమె రాజ్ కపూర్ స్నేహితుడు చున్నిభాయ్ కపాడియా కూతురు. మిగతా ఇద్దరిలో ఒకరు నీతూ సింగ్ (తర్వాత ఈమె రిషికపూర్ ని పెళ్లి చేసుకుంది), ఇంకొకరు పాకిస్తాన్ నటి నాజియా హసన్. చివరికి ఆ పాత్ర డింపుల్ కపాడియా ని వరించింది.

ఇంకో విశేషమేంటంటే ఈ సినిమాలో హీరోగా ఉన్న రిషి కపూర్ కు రాజ్ కపూర్ పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. అతని దృష్టి అంతా హీరోయిన్ మీదే ఉండింది. హీరోగా ఎవరినో ఒకరిని తీసుకుందాం అనుకున్నాడు. సరే ఎలాగూ వీడు ఉన్నాడు కదా అని రిషి కపూర్ ని సెలెక్ట్ చేశాడు. అంతే తప్ప రాజ్ కపూర్ కి రిషి కపూర్ హీరోగా ఫస్ట్ చాయిస్ మాత్రం కాదు. కాని హీరోయిన్ గా డింపుల్ మాత్రం ఫస్ట్ చాయిసే.

ఈ సినిమా విజయవంతం కావడానికి కారణభూతుడైన మరొక వ్యక్తి వకీల్ సింగ్ అనే డిస్ట్రిబ్యూటర్. బాబీ సినిమా డిస్ట్రిబ్యూషన్ ని తనకు ఇవ్వమని అడిగినప్పుడు రాజ్ కపూర్ నిరాకరించాడు. అయితే చివరికి రాజ్ కపూర్ అడిగిన మొత్తం కన్నా ఎక్కువ మొత్తం ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్నాడు. తర్వాత తనదైన శైలిలో మార్కెటింగ్ చేశాడు. అప్పట్లో వకీల్ సింగ్ బాబీ సినిమా రిలీజ్ అయినప్పుడు బొంబాయిలో " బాబీ" బస్సులు నడిపాడు. బాబీ బస్సులు ఎవరైనా ఎక్కవవచ్చు. అలా ఎక్కిన వారికి టికెట్లు కావాలంటే బస్సులోనే ఇస్తారు. ఆ బస్సులోనే థియేటర్ వరకు వాళ్ళని తీసుకెళ్తారు. ఇలాంటి మార్కెటింగ్ ఒక సినిమాకి అంతవరకు ఎవరు చేయలేదు, ఇప్పటిదాకా కూడా ఎవరూ చేయలేదు. ఒక్క "షోలే" సినిమాకు మాత్రం రాయలసీమ ప్రాంతం నుంచి హైదరాబాద్ కు బస్సులో తీసుకెళ్లి సినిమా చూపించి తీసుకొచ్చిన వాళ్లు కొంతమంది ఉన్నారు. అయితే వారు “షోలే” సినిమాకి సంబంధించిన వాళ్ళు కాదు. కేవలం బస్సు ఆపరేటర్లు మాత్రమే.




బస్సులు నడపడమే కాకుండ సినిమా సక్సెస్ కి ఇంకో విధంగా కూడా వకీల్ సింగ్ సహకరించాడు. అది ఎలాగంటే, రాజ్ కపూర్ బాబీ సినిమాను ప్రపంచంలో ప్రఖ్యాతి పొందిన ప్రేమ కథల(రోమియో జూలియట్, లైలా మజ్ను, హీర్ రాంఝా) లాగా చివర్లో హీరో హీరోయిన్లను చంపేసి సినిమాను ట్రాజెడీ చేయాలనుకున్నాడు. కానీ వకీల్ సింగ్ అలా వద్దని, అలా చేస్తే సినిమా ఫ్లాప్ అయితుంది అని రాజ్ కపూర్ కు చెప్పి ఒప్పించాడు. అలా సినిమా విజయానికి సహకరించాడు.

బాబీ సినిమా 21వ ఫిలింఫేర్ అవార్డ్స్ లో 14 కేటగిరీల్లో నామినేట్ అయి ఐదు అవార్డులు గెలుచుకుంది. ఆ సంవత్సరం అత్యధిక అవార్డు గెలుచుకున్న సినిమాగా గెలిచింది. బెస్ట్ యాక్టర్ గా రిషి కపూర్ కి అవార్డు రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కొంతమందికి నిరాశ కలిగించింది. అందులో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. జంజీర్ సినిమాకు అమితాబ్ కు అవార్డు వస్తుందని అందరూ అనుకున్నారు, రాకపోవడంతో ఆశ్చర్యపోయారు. తన పుస్తకం " ఖుల్లం-ఖుల్లా" లో రిషి కపూర్ బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం 30 వేల రూపాయలు లంచం ఇచ్చినట్టు తెలిపాడు. తర్వాత కాదని చెప్పిన ఎవరు నమ్మలేదు. బాబీ సినిమా కు సంబంధించి ఇది ఒక వివాదం.

ఈ సినిమాలో దర్శకుడిగా రాజ్ కపూర్ కొంతమంది విమర్శలకు గురి అయ్యాడు. అంతవరకు హీరోయిన్లను చాలా పద్ధతిగా, హుందాగా చిత్రీకరించిన రాజ్ కపూర్, ఈ సినిమాలో డింపుల్ కపాడియాతో బికినీ సీన్లు తీయడం దానికి కారణం. ఆ తర్వాత సత్యం శివం సుందరం, రామ్ తేరీ గంగా మైలీ సినిమాల్లో కూడా అలాగే చేశాడని కూడా కొంతమంది భావించారు.

రాజ్ కపూర్ జీవితంలో తీసిన సినిమాల్లో బాబీ అత్యంత విజయవంతమైన సినిమా గా నిలిచిపోయింది. బాబీ గొప్ప కళాఖండం కాదు గాని, యాభై ఏళ్ళ క్రితం వసూళ్ల పరంగా విజయవంతమైన సినిమా, ఒక నూతన ఒరవడిని సృష్టించి, ఎక్కువ మంది కూడా చూసిన సినిమాగా ఇది నిలిచిపోయింది.


Read More
Next Story