ఏటి సేత్తాం మరి..  రాజేంద్రప్రసాద్ ఆ ఒక్కటీ అడక్కు  ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం
x

ఏటి సేత్తాం మరి.. రాజేంద్రప్రసాద్ 'ఆ ఒక్కటీ అడక్కు' ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం

అల్లరి నరేష్ నటించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా లెజెండ్రీ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సినిమాను గుర్తు చేసింది. ఆ సినిమా ఇప్పటికి కూడా నవ్వులు పూయిస్తుంది.


అల్లరి నరేష్ నటించిన ఆ ఒక్కటీ అడక్కు(కొత్తది)... ఈ రోజు రిలీజైంది. ఈ టైటిల్ వింటే నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన క్లాసిక్ ఫిల్మ్ గుర్తుకు వస్తుంది. ఆ సినిమాకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఆయన తనయుడు 'అల్లరి' నరేష్ ఆ టైటిల్ (Aa Okkati Adakku) తో సినిమా చేశారు. అల్లరి నరేష్ సినిమా చూసిన వాళ్లు వెళ్లి అర్జెంటుగా యూట్యూబ్ ఓపెన్ చేసి పాత ఆ ఒక్కటీ అడక్కు సినిమాని చూసేయాలని ఫిక్స్ అవుతున్నారు. ఓ రకంగా ఆ క్లాసిక్‌ని గుర్తు చేసినందుకు నరేష్‌కు థాంక్స్ చెప్పుకుంటూ ఆ రోజుల్లోకి వెళ్లి ఆ సినిమాని గుర్తు చేసుకుంటే..

ఎనభైల్లో జంధ్యాల క్లాసిక్ కామెడీ నడుస్తున్న టైమ్‌లో ఈవీవీ సత్యనారాయణ ఆయన దగ్గర అసెస్టెంట్ డైరక్ట్‌గా చేస్తూండేవారు. ఆ తర్వాత ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ కామెడీ సినిమాలు తీసి నవ్వించారు. అయితే జంద్యాలని కాపీ కొట్టినట్లు కాకుండా తన యూనిక్ స్టైల్‌ని తీసుకొచ్చారు. మొదటిగా 1990 వ సంవత్సరంలో ‘చెవిలో పువ్వు’ అనే చిత్రంతో దర్శకుడిగా మారారు ఈవివి. కానీ ఆ సినిమా ఆడలేదు.

అయితే రామానాయుడు ‘ప్రేమ ఖైదీ’ ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని ఇస్తే దాన్ని సూపర్ హిట్ చేశారు. పెట్టిన పెట్టుబడికి 4 రెట్లు లాభాలను అందించారు. ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. ‘అప్పుల అప్పారావు, సీతారత్నం గారి అబ్బాయి, జంబలకిడి పంబ, ఏవండీ ఆవిడ వచ్చింది, వారసుడు, ఆ ఒక్కటీ అడక్కు, అబ్బాయిగారు, హలో బ్రదర్, ఆమె, అల్లుడా మజాకా, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ వంటి చిత్రాలతో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు ఈవివి. ఆ సినిమాల్లో ప్రత్యేకం ‘ఆ ఒక్కటీ అడక్కు’ .

రాజేంద్రప్రసాద్ హీరోగా చేసిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ కామెడీ క్లాస్‌గా ఉంటూనే నాన్ స్టాప్‌గా నవ్విస్తుంది. రంభ హీరొయిన్‌గా పరిచయమైన ఈ సినిమాలో రావుగోపాలరావు నటించిన రొయ్యల నాయుడు పాత్ర కూడా ఓ హైలెట్. ఎంతో విషయం, తెలివి ఉన్న అటుకుల చిట్టిబాబు(రాజేంద్రప్రసాద్)కు జాతకాల పిచ్చి. ఏదో రోజు తను రాజు అవుతానని కలలు కంటూ ఉంటూ సమయం వృధా చేస్తూంటాడు. ఆ సమయంలోనే కోటీశ్వరుడైన రొయ్యల నాయుడు (రావు గోపాల్ రావు) కూతురు రంభ(రంభ)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా చిట్టిబాబుని తప్పించి వేరే ఒకరిని చేసుకోనంటుంది. అప్పుడు వేరేదారిలేక రొయ్యలనాయుడు పెళ్లి చేస్తాడు.

అయితే పెళ్లయ్యాక శోభనం జరగకుండా అడ్డుపడతాడు. చిట్టిబాబు శోభనం జరగాలంటే లక్ష రూపాయలు సంపాదించి తనకు చూపెట్టాలని కండిషన్ పెడతాడు. ఆ తర్వాత మన చిట్టిబాబు ఏం చేసి తన మామ మనస్సుని గెలుచుకుని, భార్యను శోభనం గదిలోకి తీసుకెళ్లాడు అనేదే కథ. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి శుభం కార్డు దాకా నవ్వుల్ని పండించటం అంటే మాటలు కాదు. అలాంటి అరుదైన ఫీట్‌ని సాధించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ 1992 సెప్టెంబర్ 19న విడుదలయ్యింది.

ఇక ఈ నవ్వుల సినిమాని సుప్రసిద్ధ ఏవిఎం సంస్థ నిర్మించింది. ప్రముఖ తమిళ రచయిత కలైమని కథను అందించగా ఎల్బి శ్రీరామ్ అదరకొట్టే డైలాగులు రాశారు. ఈవివి సినిమాకు ఇళయరాజా సంగీతం సమకూర్చిన చిత్రం ఇదొక్కటే అంటే ఆశ్చర్యం వేస్తుంది. మ్యూజికల్ గానూ పాటలు సూపర్ హిట్. అలాగే విలనిజంకే పరిమితమైన రావుగోపాల రావును కామెడీ యాంగిల్‌లో చూపించడం కూడా జనాలకు తెగ నచ్చేసింది. బాబు మోహన్, అల్లు, లతాశ్రీ అలా ఎవరికి వాళ్లే నవ్వించటంలో పోటీ పడ్డారు. ఈ సినిమాని హిందిలో అక్షయ్ కుమార్ హీరోగా మిస్టర్ అండ్ మిసెస్ ఖిలాడిగా రీమేక్ చేస్తే అక్కడా హిట్టు కొట్టింది. అలాగే కన్నడంలో జగ్గేష్‌తో బాల్ నాన్ మగా చేస్తే అక్కడా మంచి హిట్టైంది. వేశావులే జోకు..నవ్వావులే నవ్వు, పిసికావులే పేడ, పుంపుహార్ వంటివి ఇప్పటికి మనోళ్ల నోట్లో నానుతూ ఉన్నాయి.

ఎక్కడ చూడవచ్చు: యూట్యూబ్‌లో

Read More
Next Story