
తెలుగు సినిమా ‘అందగాడు’ శోభన్ బాబుకు నివాళి
220 పైగా చిత్రాల్లో నటించిన శోభన్ బాబు ఎందుకో ఇతర నటుల్లాగా హైదరాబాద్ రాకుండా చెన్నైలోనే ఉండిపోయారు
తెలుగు సినిమా మేటి నటుడు శోభన్ బాబు (జనవరి 14, 1937) 2008 మార్చి 20 గురువారం ఉదయం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు ఉప్పు శోభనా చలపతిరావు. ఆయన వయసు 71 ఏళ్లు. యోగా చేస్తుండగా ఆయన హఠాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
శోభన్ బాబుకు తెలుగు సినిమా ‘అందగాడు’ గా పేరుంది. సినిమాలనుంచి నటించడం మానేశాక సినిమా ప్రపంచానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన నటించిన చివరి సినిమా అడవి దొర (1995) . వీరాభిమన్యు (1965 ఆగస్టు 2 విడుదల) సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.
విజయవాడ సమీపంలోని చిన్న నందిగామ లో రైతు కుటుంబంలో పుట్టారు శోభన్ బాబు. హైస్కూల్ రోజుల్లో 'పాతాళభైరవి', 'దేవదాసు', 'మల్లీశ్వరి' ఎక్కువగా చూసేవారు. మల్లీశ్వరి సినిమాను 22 సార్లు చూశానని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు. తాను ఇండస్ట్రీలోకి రావడానికి ఓ రకంగా ఆ చిత్రాలే కారణమని చెప్పేవారాయన. 'లా' చదివేందుకు మద్రాసు వెళ్లినా ఆయన మనసు మాత్రం సినిమా పైనే ఉండేది. ఆ ఆసక్తితోనే తన ఫొటో ఆల్బమ్ పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. ‘భక్త శబరి' చిత్రంలోని ఓ పాత్ర కోసం దర్శకుడు చిత్రపు నారాయణమూర్తి, నిర్మాత బి ఆర్. నాయుడు చర్చిస్తున్న సమయంలో శోభన్ బాబు వెళ్లడంతో ఆయనకు అవకాశం దక్కింది. తాము అనుకున్న కరుణ పాత్రకు సెట్ అవుతారని నిర్ణయించుకుని, షూటింగ్ కు రమ్మన్నారు.
తాను పోషించిన తొలి పాత్ర కరుణ కావడంతో అదే పేరును కుమారుడికి కరుణ శేషు అని పేరు పెట్టారు. అయితే, ఆయన రెండో సినిమా 'దైవ బలం' ముందుగా విడుదలైంది. ఎన్టీఆర్ హీరోగా రూపొందిన చిత్రమిది. ఆ సినిమా 17 సెప్టెంబర్ న 1959న విడుదల అయ్యింది కాని విజయవంతం కాలేదు. ఆ సమయంలోనే చిత్రపు నారాయణరావు నిర్మించిన భక్త శబరి చిత్రంలో ఒక ముని కుమారునిగా నటించారు. 1960 జూలై 15న విడుదలైన ఆ సినిమా కాస్త విజయవంతమవ్వడంతో శోభన్ బాబు పేరు రంగంలో స్థిరపడింది.అలా 1959లో నట జీవితం ప్రారంభించిన శోభన్ బాబు 1996లో రిటైర్మెంట్ తీసుకున్నారు.
220 పైగా చిత్రాలలో నటించాక 1996లో విడుదలైన ‘హలో గురూ’ చిత్రంతో తన 30 ఏళ్ల నట జీవితానికి స్వస్తి చెప్పారు. తర్వాత చెన్నైలోనే స్థిరపడ్డారు.
సోగ్గాడు, జీవన జ్యోతి, దేవత, పుట్టినిల్లు మెట్టినిల్లు,మోసగాడు, చండీప్రియ, దేవుడు చేసిన పెళ్లి, గోరింటాకు, మల్లెపువ్వు, శారద, బలిపీఠం, ముందడుగు, కార్తీక దీపం వంటి ఎన్నో హిట్ సినిమాల్లో ఆయన నటించారు. ఆయనకు ఐదు సార్లు నంది అవార్డులు వచ్చాయి. నాలుగు సార్లు ఆయన ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. తన సమకాలీన నటుడు కృష్ణతో కలిసి ఆయన మంచి మిత్రులు, కురుక్షేత్రం వంటి సినిమాల్లో నటించారు. కర్నూలు పార్క్ రోడ్డులో ఆయనకు అభిమానులు విగ్రహం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ సుధాకర్ బాబు శోభన్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడుగా విగ్రహం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. పార్లమెంట్ సభ్యుడు దాసరి నారాయణ రావు విగ్రహావిష్కరణ చేశారు.
తెలుగు నటులు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ వంటి వారు తెలుగు చిత్రసీమతో పాటే తమ మకాం హైదరాబాద్ కు మార్చిన ఆయన మాత్రం చెన్నై లోనే ఉండి పోయారు. ఆయన ఎక్కడా కనిపించే వారే కాదు. ఒక నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాజకీయాలలోకి రాకముందు శోభన్ తో ఉన్న పరిచయం బాగా ప్రచారమైంది. వారిద్దరు అనేక చిత్రాలలో కూడా నటించారు.