
కిచెన్ లో పవర్ గేమ్ : 'రిసార్ట్' సిరీస్ రివ్యూ!
ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు?
మన హీరో వెట్రి (విజయ్ కుమార్ రాజేంద్రన్) పరిస్థితి ఏంటంటే.. చేతిలో చిల్లిగవ్వ లేదు, కానీ నెత్తిన తండ్రి చేసిన అప్పుల మూట ఉంది. అమ్మ, చెల్లిని కాపాడుకోవడం కోసం డిగ్రీ మధ్యలోనే ఆపేసి జాబ్ వేటలో పడతాడు. చివరకు మహాబలిపురంలోని ఒక లగ్జరీ బీచ్ రిసార్ట్‌లో రూమ్ సర్వీస్ బాయ్‌గా చేరతాడు. అయితే వెట్రికి వంట చేయడం అంటే పిచ్చి క్రేజ్, కానీ ఆ రిసార్ట్ కిచెన్ లోకి రూమ్ సర్వీస్ వాళ్లకి నో ఎంట్రీ!
కిచెన్ కింగ్ తో 'కుకింగ్' వార్!
అక్కడ నెడుమారన్ (తలైవాసల్ విజయ్) అనే ఒక సీనియర్ చెఫ్ ఉంటాడు. ఆయన రూలే ఆ కిచెన్‌లో ఫైనల్. వెట్రి తన అప్పులు తీర్చడం కోసం రాత్రిపూట సీక్రెట్‌గా ఒక స్ట్రీట్ ఫుడ్ బండి రన్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే.. ఒకరోజు అదే నెడుమారన్ వచ్చి వెట్రి బండి దగ్గర సూప్ తాగుతాడు. తన 'సిగ్నేచర్ రెసిపీ'ని కాపీ కొట్టాడని వెట్రిపై సీరియస్ అవుతాడు. అక్కడి నుంచి అసలైన గేమ్ మొదలవుతుంది.
క్రష్‌తో లవ్.. కానీ తండ్రే విలన్!
ఇది చాలదన్నట్లు రిసార్ట్‌లో జాయిన్ అయిన కొద్దిరోజులకే వెట్రి అక్కడ పనిచేసే ఐశ్వర్యను చూసి ఫ్లాట్ అయిపోతాడు. ఐశ్వర్య కూడా వెట్రికి మెల్లగా కనెక్ట్ అవుతున్న టైమ్‌లో అసలైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. వెట్రి ఎవరినైతే లవ్ చేస్తున్నాడో, ఆ ఐశ్వర్య మరెవరో కాదు.. వెట్రికి శత్రువులా మారిన ఆ హెడ్ చెఫ్ నెడుమారన్ కూతురే! ఆమె తన గ్యాంగ్‌తో కలిసి వెట్రిని తెగ ఏడిపిస్తూ ఉంటుంది.
అసలు వెట్రి తండ్రి ఎవరు? రిసార్ట్ ఓనర్ కూతురు రియా ఎంట్రీతో వెట్రి లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి? వెట్రి తన డ్రీమ్ ఫుడ్ బిజినెస్ ని సక్సెస్ చేసుకున్నాడా లేదా? అన్నదే మిగతా స్టోరీ.
ఎలా ఉంది
మొదటి నాలుగు ఎపిసోడ్లు చూసాక ఒక విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. ఇది స్టోరీ కాదు, ఇది ఓ సిస్టమ్‌లో బతికే వాళ్ల మనస్తత్వాల మధ్య జరిగే మౌన యుద్ధం. డైరెక్టర్ Praveen Bennet ఇక్కడ పెద్ద ట్విస్ట్‌లు, షాక్‌లు పెట్టుకోలేదు. అతను చేసింది ఒక చిన్న స్పేస్ తీసుకుని, అందులో మనిషి ఈగో, బతుకు, భయం చూపించే ప్రయత్నం చేసారు. ముఖ్యంగా హీరో పాత్రను కడుపు నింపుకోవడానికి పని చేస్తున్నాను… కానీ మనసు మాత్రం వంటలోనే ఉంది అని చూపించారు. ఈ ఒక్క లైన్‌తో అతని ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ సెట్ అయిపోతుంది. దాంతో మనం కనెక్ట్ అవుతాం.
నెడుమారన్ ఎంట్రీతో షో టోన్ మారిపోతుంది. కాకపోతే నెడుమారన్ క్యారెక్టర్‌ను స్క్రీన్‌ప్లే కొంచెం ఓవర్ డ్రామటైజ్ చేసింది. దాంతో కాన్ఫ్లిక్ట్ రియల్‌గా ఉన్నా… క్యారెక్టర్స్ కొంచెం రైటింగ్ ని అనుసరిస్తున్నట్లు ఫీలవుతాం. అయినా అది పెద్ద లోపంగా చెప్పలేము..అలా నడిచిపోతుంది అంతే.
నటీనటులంతా బాగా చేసారనే చెప్పాలి. చాలా వరకూ సహజంగా సీరిస్ ని ఉంచేలా ప్రయత్నించారు. మాగ్జిమం సక్సెస్ అయ్యారు. టెక్నికల్ గా చూస్తే... కౌశిక్ క్రిష్ సంగీతం ఈ సిరీస్‌కి ఒక మంచి 'స్నాక్'లాగా భలే సెట్ అయింది, ప్రతి సీన్‌ని చాలా నాచురల్‌గా ఎలివేట్ చేసింది. విజయ్ క్రిష్ తన కెమెరా పనితనంతో ఆ రిసార్ట్ అందాలను అద్భుతంగా చూపించగా, ఎడిటింగ్ ఎక్కడా బోర్ కొట్టించకుండా కథను స్మూత్‌గా నడిపించింది.
చూడచ్చా
అభ్యంతరకర సీన్లు లేకుండా, క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది.
ఎక్కడ చూడచ్చు
జియో హాట్ స్టార్ లో తెలుగులో ఉంది.

