
తెలుగు డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ ఒక సోషల్ సైంటిస్టు
రామ్ సి చేస్తున్న ఇవివి సత్యనారాయణ చిత్రాల పరామర్శ. మూడుభాగాల సీరీస్ లో ఇది మొదటిది. కథా ‘కమానీషు’ మాయగాడు- 1
రామ్. సి
నాకు కుటుంబాల అధ్యయనం చాల పెద్ద ఆకర్షణ. ఎందుకoటే వాటి సంగతులు పైకి కనిపించేవి ఒకటి, లోపల ఇంకొకటి, చెప్పుకొనేది మరోటి, అసలు జరిగేది ఇంకేదో. కుటుంబం అనే ఛత్రం నీడలో మనిషి ఆడే వింత నాటక పార్శ్యాలు అద్భుత ప్రవర్తన పరిశోధనా వస్తువులు. అందులో భాగంగా నేను చెప్పదల్చుకున్నది సినిమా గురించే అయినా, నా పరామర్శకు దర్శకుడు, పిదప కుటుంబాలు, కుటుంబ సభ్యులు, చివరిగా 'అప్పుల అప్పారావు' (Appula Apparao: 1992) సినిమాను ఎంచుకున్నాను. ఆ విషయంలో మీతో పంచుకోవాలనుకొంటున్నాను.
ఈ.వి.వి. సత్యనారాయణ (10 జనవరి 1956 – 21 జనవరి 2011) కమర్షియల్ సినిమా రూపంలో ఓ సామాజిక శాస్త్రవేత్త (social scientist) అని నా అభిప్రాయం. సినిమా చూసి మీరు నవ్వుకొంటూ బయటకి వెళ్తున్నారంటే, మీకు సినిమా అసలు బోధపడలేదని అర్ధం. అందుకు కారణాలు లేక పోలేదు. సినిమా ప్రపంచంలో ఈ.వి.వి. సత్యనారాయణ పేరు వినగానే మనకు హాస్యం (comedy), మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ (Mass Entertainment), కథలను సునాయాసంగా చెప్పే నైపుణ్యం గుర్తుకు వస్తాయి. కానీ, ఆయన హాస్యం, వినోదం, అతిశయోక్తి వెనుక లోతైన సామాజిక పరిశీలన, మానసిక అర్థం, మానవ ప్రవర్తనల విశ్లేషణ దాగి ఉంది.
ఒక దర్శకుడు, సమాజపు అసౌందర్యాన్ని కఠినంగా వివరించకుండా, నవ్వుతూ చూపించగలిగితే, అది ఈ.వి.వి. సత్యనారాయణే అని నమ్ముతాను. ఆయనను ఓ సామాజిక శాస్త్రవేత్తగా మారుస్తున్న విషయమేమిటి మరి!
ఈ.వి.వి. (Director EVV Satyanarayana) తన ప్రేక్షకులను తాత్వికతలోకంలో తిప్పడం, సంప్రదాయాలని, పెద్దవారి హితబోధలను తలపించే సందేశాలు ఇవ్వడం అస్సలు చేయడు. బదులుగా, అసలు వాస్తవాన్ని వినోదంలో ముంచివేస్తాడు, చూపిస్తున్న సినిమాలోని కధను వాస్తవమే కాదనేలా మనల్ని నమ్మిస్తాడు.
ప్రేమ పేరుతో బంధాలు నడిచే తీరును అన్వేషించడు, నవ్విస్తూ ఆ బంధ రూపాన్ని బయటపెడతాడు. కుటుంబాలు, కుటుంబ సభ్యుల మధ్య మోసపూరిత బంధాలను విమర్శించడు, అవి ఎలా పనిచేస్తాయో ప్రేక్షకులే అర్థం చేసుకునేలా చేస్తాడు.సమాజంలోని అసమానతుల్యతలను ప్రత్యక్షంగా చూపించడు, హాస్య సన్నివేశాలలో దాచిపెడతాడు. ఈ 'అప్పుల అప్పారావు' సినిమా కూడా ఆయన అద్భుత దృష్టికోణంకు ఓ నిదర్శనం.
ఇక్కడ ఎవరూ బుద్ధి చెబితే వినేవారెవ్వరు లేరూ, సందేశాలు సుతిమెత్తగా చెప్పబడ్డతాయి అంతే. విచిత్రమైన పాత్రలు, హాస్యాత్మక సన్నివేశాలు, అతిశయోక్తితో నిండిన సంఘటనలలో దీనికంతటికీ లోతైన వాస్తవం దాగి ఉంటుంది.హాస్యంతో తడిసి ముద్దైన కథే అయినా, చివరికి మనమే మన జీవితాన్ని తెరమీద చూస్తున్నట్టు అనిపించేలా ఉంటుంది.ఈ.వి.వి. సినిమా కేవలం వినోదం కాదు, ఇది జీవితం మీద జరిపిన ఓ సమగ్ర అధ్యయనం, ఆయన వేసిన ఓ వ్యంగాస్త్రం, కానీ ఇదంతా కమర్షియల్ సినిమా ముసుగులో సృషిష్టించే కథకుడు.
నాకు ఇప్పటికీ మిస్సవుతున్న మేధావి, ముఖ్యంగా ‘అప్పుల అప్పారావు’లాంటి సినిమాల ద్వారా కొన్ని సినిమాలు కాలం గడిచే కొద్దీ పాతబడతాయి, కానీ కొన్ని ఎప్పటికీ మనకు అద్దం పడుతూ,సానపెడుతూ, సంబంధితంగా ఉంటాయి. ఈ.వి.వి. సినిమాలు రెండో కేటగిరీకి చెందినవి.ప్రతి సారి ‘అప్పుల అప్పారావు’ చూసినప్పుడల్లా, ఆయన లేని సినిమా మార్కు లోటు కొంత అనిపిస్తుంది.
ఆయన కథనం హాస్యంతో అల్లినంత మాత్రాన ఆ విషయం లోతు తగ్గిపోదు.ఆయన హాస్యం బయటకు కనిపించినా, లోపల సామాజిక స్పష్టత ఉంది.ఆయన పాత్రలు అతిశయంగా ఉన్నా, మన జీవితాల్లో మనం చూసిన వారినే గుర్తు చేస్తాయి.ఇప్పటికీ, ఆయన సినిమా చూసినప్పుడు ఆ effortless charm, అసలైన సత్యాన్ని అలవోకగా చూపించే నైపుణ్యం గుర్తొస్తూనే ఉంటుంది.
ఆయన హాస్యంలోనే కుటుంబ బంధాలలోని వ్యూహాలను విప్పిచూపే తెలివి ఉంది.అతి వ్యాఖ్యానాలు ఉన్నా, వాటి వెనుకున్న నిజమైన మనుషుల నడవడిక మనల్ని తాకుతాయి. సమాజాన్ని విమర్శించాల్సిన చోట కూడా నవ్విస్తూ చెప్పే సామర్థ్యం ఆయన్ను ప్రత్యేకంగా నిలిపింది.
‘అప్పుల అప్పారావు’ లాంటి సినిమాలు నాకు మొదట,ఆ 90 దశకం నాటి హాస్యాన్ని మాత్రమే గుర్తు చేయవు; ఒక తరం సినిమా దృష్టిని, ఒక సమాజాన్ని అర్థం చేసుకునే మార్గాన్ని, ఒక సినీ దర్శకుని మేధస్సును గుర్తు చేస్తాయి.
ఆయన సినిమాల్లోని హాస్యపు కల్లోలంలో దాగిన లోతైన పరిశీలన, తనదైన సరదాగా బుద్ధిపెట్టే వివేకం,అసలైన మానవ ప్రవృత్తుల్ని పట్టి చూపించే తీరు ఆయన సంతకం. "ఈ.వి.వి. సినిమాలు చూడటానికి సరదాగా అనిపించినా, ఆలోచిస్తే లోతైన అర్థం బయటపడుతుంది. ప్రేక్షకులు చులకనగా తీసుకున్నా, ఆయనకు మాత్రం తన కథల వెనుక ఉన్న అసలు సందేశం పూర్తిగా తెలుసు, ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఎందుకు చెప్పాలనుకుంటున్నాడో, అది అందరికీ అర్థమయ్యేలా ఎలా చెప్పాలనుకుంటున్నాడో అని" ,ఆ మధ్య ఓ మిత్రుడు చెప్పుకొచ్చాడు.
ఈ.వి.వి. సినిమా అనేది కేవలం వినోదం కాదు, ఒక నాటకీయ దుర్భార జీవిత అధ్యయనం. సత్యం. (సశేషం)
Next Story