1989  ఆర్జీవి సెన్సేషన్  శివ తర్వలో రీరిలీజ్ ...కొన్ని జ్ఞాపకాలు
x

1989 ఆర్జీవి సెన్సేషన్ 'శివ' తర్వలో రీరిలీజ్ ...కొన్ని జ్ఞాపకాలు

ఇప్పుడు రామ్ గోపాల్ వర్మని చాలా మంది రకరకాల కారణాలతో ద్వేషించవచ్చు. తిట్టుకోవచ్చు. పేరు చెపితే భగ్గుమనచ్చు. కానీ ఓ టెక్నిషియన్ గా ఆయన్ని కాదనేవాళ్లు లేరు.


ఇప్పుడు రామ్ గోపాల్ వర్మని చాలా మంది రకరకాల కారణాలతో ద్వేషించవచ్చు. తిట్టుకోవచ్చు. పేరు చెపితే భగ్గుమనచ్చు. కానీ ఓ టెక్నిషియన్ గా ఆయన్ని కాదనేవాళ్లు లేరు. ముఖ్యంగా ఆయన తొలి చిత్రం శివ (1989) ని చూసి మెచ్చుకోకుండా ఉండలేరు. ఒక్క సినిమాతో దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకోగలగటం అంటే మామూలు విషయం కాదు. అప్పటికి ఆయనకు అంత అనుభవం లేదు. సెన్స్, కామన్ సెన్స్ కావాల్సినంత ఉన్నాయి. ఇప్పుడంటే హిట్ కోసం సినిమా తీస్తాను అని చెప్పటానికి ఆయన ఇష్టపడరు. కానీ ఆ రోజుకు ఆయన ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కంటెంట్ తోనే వచ్చారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ సినిమా రీరిలీజ్ కు రెడీ అయ్యింది.

నాగార్జున పుట్టినరోజు సందర్భంగా వచ్చేనెల (ఆగస్ట్ 29న) శివ సినిమాను రీ-రిలీజ్ చేయబోతున్నారు. దీని కోసం సినిమా 4కె ఫార్మాట్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అయితే ఈ జనరేషన్ వాళ్లు ఈ సినిమా చూడాలా... ఏముంది అనే సందేహం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే వాళ్లంతా రామ్ గోపాల్ వర్మ డిజాస్టర్ సినిమాలు గురించి వింటూ పెరిగినవాళ్లు. వాళ్లకు ఈ సినిమా కూడా రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు తీస్తున్న సినిమాలాంటిదే అనిపించవచ్చు. అయితే ఈ జనరేషన్ వాళ్లు చూడటానికి కారణాలు అయితే చెప్పలేం కానీ ఈ సినిమా గొప్పతనం చెప్పుకుంటే ఆసక్తికలిగి గత వైభవం ఓ సారి గుర్తు చేసుకుందాం.

రామ్ గోపాల్ వర్మ అనే దర్శకుడు ఇప్పటికి చాలా మందికు గుర్తున్నారంటే అందుకు కారణం "శివ" . రామ్ గోపాల్ వర్మ-నాగార్జునల బ్లాక్ బస్టర్ చిత్రం "శివ" సినిమా ఎంతో మంది ఇప్పటి స్టార్ డైరక్టర్స్ ని ఆ దిసగా ప్రయాణం పెట్టుకునేలా చేసింది . తెలుగు సినిమాకు సాంకేతిక విలువలతో పాటు స్పీడును తెచ్చి పెట్టి ప్రేక్షకులను కొత్త లోకాల్లో విహరింపజేసిన చిత్రమిది. బాలీవుడ్ కు షోలే ఎటువంటిదో టాలీవుడ్ కు శివ అటువంటిదని చెప్పటంలో మొహమాటం లేదు. ఈ సినిమా పేద్ద హిట్ అవుతుందని అనుకున్నది ఇద్దరే. ఒకరు దర్శకుడు వర్మ, మరొకరు హీరో నాగార్జున.

ఈ సినిమాలో జరిగిన మ్యాజిక్ ఏమిటంటే... అప్పటి వరకు చూడని యాక్షన్, స్క్రీన్ ప్లే, టేకింగ్, మేకింగ్ శివతో పరిచయం అయ్యాయి. ఆ కెమెరా యాంగిల్స్, ఆర్టిస్ట్ ల పర్ఫామెన్స్ అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. ఇక మొదటి వారం పూర్తయ్యే సరికే రామ్ గోపాల్ వర్మ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. అలా ఆర్జీవీ శకానికి నాంది పలికినట్టు అయింది. హాలీవు్డ సినిమాల వీడియోలు చూసి, చూసి అ మేకింగ్ స్టయిల్ని వంటబట్టించుకున్న వర్మ శివ సినిమాని కేవలం ఇంగ్లీషు సినిమా ఫక్కీలోనే తీశాడు. గొల్లపూడి మారుతీరావు లాంటి పాప్యులర్ క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా వాళ్ళ డైలాగ్ డెలివరీ స్టయిల్ వద్దని చెప్పి, ఎంత ఎమోషనల్ డైలాగయినా సైలెంట్ గా, ఎమోషన్ లేకుండా చెప్పమని హెచ్చరించి మరీ చెప్పించాడు వర్మ.

అప్పటికే రీరికార్డింగ్ కూడా అప్పటికే బడ్జెట్ ఎక్కువైపోయిందని బాంబే తీసుకెళ్ళి ట్రాక్స్ వేయించడానికి పూనుకున్నారు. కానీ నాగార్జున ఒప్పుకోలేదు ఆ ప్రపోజల్ కి. ఆ సినిమాకి మ్యూజిక్ చేసిన ఇళయరాజానే పిలిచి రీరికార్డంగ్ మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టి చేయించారు. ఈ సినిమాతోటే జెడి చక్రవర్తి, ఉత్తేజ్, మాటల రచయితగా, నటుడిగా కూడా తనికెళ్ళ భరణి వీళ్ళంతా తెరమీదకి వచ్చారు.

ఈ సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ ఏమంటారంటే... నా ఈ సినిమాకు "బ్రూస్‌ లీ 'రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌" ఈ చిత్రానికి ప్రధాన ప్రేరణ. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా నుంచి శివ సినిమాను కాపీ కొట్టాను. అందులో రెస్టారెంట్ కోసం హీరో పోరాడతాడు. అయితే అక్కడ రెస్టారెంట్ తీసి కాలేజ్ పెట్టాను.. మిగతాదంతా సేమ్ టు సేమ్. సేమ్ స్క్రీన్ ప్లే అని వర్మ చెప్పుకొచ్చాడు. అందుకే నేను ఈ స్క్రిప్ట్‌ను 20 నిమిషాల్లో రాయగలిగాను.. ఎందుకంటే నేను రెస్టారెంట్ కాన్సెప్ట్ తీసి కాలేజ్ బ్యాక్ గ్రౌండ్ పెట్టాను..

అలాగే ఈ చిత్రంలోని చాలా సన్నివేశాలను అనేక చిత్రాల ప్రేరణతోనే నేను రూపొందించాను. 'అర్జున్‌, అర్ధసత్య, కాలచక్ర" వంటి చిత్రాల స్ఫూర్తి 'శివ"పై చాలా ఉంది. అయితే, ఆయా చిత్రాలనుంచి నేను ప్రేరణ పొందానే తప్ప ఎక్కడా అనుకరణకు చోటివ్వలేదు. అలాగే ఈ చిత్రం విజయంలో సౌండ్‌ ఎఫెక్ట్‌‌ లు కీలకపాత్ర పోషించాయి.

సౌండ్‌ ఎఫెక్ట్‌‌ లు జోడించడానికి ముందు ఈ చిత్రాన్ని చూసినవాళ్లంతా కచ్చితంగా ఫ్లాప్‌ అవుతుందనుకున్నారు. నిర్మాతలు సురేంద్ర, వెంకట్‌లు సైతం మహా అయితే ఈ చిత్రం యావరేజ్‌గా ఆడుతుందనుకున్నారు. నేను కాకుండా, ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మిన ఏకైక వ్యక్తి నాగార్జున. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గుర్తుంచుకునేంత సంచలనం సృష్టిస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. బహుశా నాగార్జున కూడా అనుకుని ఉండరు!" అని చెప్పుకొచ్చారు.

కేవలం 55 రోజుల్లో పాటలు సహా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికయిన ఖర్చు 85 లక్షలు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు పారితోషికంగా 50,000 రూ.లతోపాటు లాభాల్లో 5 శాతం అందుకున్న రాంగోపాల్‌ వర్మ 'బెస్ట్‌ డెబ్యూ డైరక్టర్‌"గానే కాకుండా 'బెస్ట్‌ డైరక్టర్‌"గానూ ఆ సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డులు పొందారు.

అప్పట్లోనే ఒక్క నైజాంలోనే కోటి రూపాయలకు పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది. అలాగే విడుదలకు ముందు ఈ చిత్రం తమిళ డబ్బింగ్‌ రైట్స్‌ అమ్మాలని చూస్తే లక్ష రూపాయలకంటె ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. విడుదలయ్యాక ఈ చిత్రం తమిళ డబ్బింగ్‌ రైట్స్‌కు 85 లక్షలు పలకడం విశేషం. 'ఇదయం" పేరుతో తమిళంలో అనువాదమైన ఈ చిత్రం అక్కడ 2 కోట్లకు పైగా వసూలు చేసింది. మరి ఇంతటి చరిత్ర ఉన్న సినిమాని ఈ జనరేషన్ చూడాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. చాలా విషయాలు తెలుసుకోవాలనిపిస్తుంది.

Read More
Next Story