వళరి (‘ఈటీవీ విన్’)మూవీ మినీ రివ్యూ
థ్రిల్లింగ్ మూవీ ప్రియులకు ‘వళరి’ సినిమా తెగ నచ్చేస్తుంది. భయభ్రాంతులకు గురిచేయకుండా సాదాగా సాగే థ్రిల్లర్‌గా అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఎలా ఉందంటే..
ఓటిటీలలో హారర్ థ్రిల్లర్ జోనర్ సినిమాలకు పెద్ద పీట వేస్తున్నారు. ఈ సినిమాల మేకింగ్ కు పెద్ద బడ్జెట్ తోనూ , పెద్ద తలకాయలు (స్టార్స్) తోనూ సంభందం ఉండదు. కంటెంట్ లో భయపెట్టే సీన్స్, థ్రిల్ చేసే ట్విస్ట్ లు పెట్టుకుని లాగేస్తూంటారు. పెద్ద బడ్జెట్ తీయరు కాబట్టి కాస్త తక్కువ రేటుకే వస్తాయని ఓటిటి వాళ్లు తీసుకుంటారు. జనాలు కూడా థియేటర్ కు వెళ్లి చూడటం కన్నా తలుపులేసుకుని ఒంటిరిగా ఆ హారర్ మూమెంట్స్ ని అనుభవిద్దామని ఫిక్సై ఈ సినిమాలకు ట్యూన్ అవుతూంటారు. ఆ క్రమంలో వచ్చిన తాజా చిత్ర రాజం వళరి. వళరి అనే ఈ టైటిల్ డిఫరెంట్ గా ఉండటంతో తమిళ టైటిల్ నే తెలుగుకు ఉంచేసారు. ఇంతకీ వళరి భయపెట్టిందా...అసలు వళరి అంటే ఏమిటి
కథేంటి అంటే...
నేవీలో పనిచేసే నవీన్ (శ్రీరామ్) తన భార్య దివ్య ( రితికా సింగ్) పదేళ్ల కొడుకు మధు ..తో కలిసిచెన్నైలో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూంటాడు. అయితే దివ్యకి రెగ్యులర్ గా ఒక కల రిపీట్ గా వస్తూంటుంది. కలలు కూడా కొత్తవి రాకుండా రిపీట్ గా వస్తూంటే ఏంచేయాలి...పాపం అదే ఆలోచనలో ఉండిపోతుంది ఆ తమిళ పొన్ను. అయితే మొగుడు సొమ్మేం పోయింది..కలలే దండగ అనుకుంటే ఇలా వాటి గురించి ఆలోచించటం ఇంకా దండగ వ్యవహారం అన్న ధోరణిలో లైట్ తీసుకోమని సలహా ఇస్తాడు. ఈ సిట్యువేషన్ లో వాళ్లని మరింత సమస్యల్లోకి తీయటానికి అన్నట్లు.. 'కృష్ణపట్నం' ట్రాన్సఫర్ అవుతుంది. అక్కడి నేవీ క్వార్టర్స్ లో దిగుతారు. కానీ అక్కడ దగ్గరలో ఓ పాడుబడిన బంగ్లా ఉంటుంది. రైట్ మీ అంచనా కరెక్టే దెయ్యాల బంగ్లా అన్నమాట. ఆ బంగ్లాని చూసిన దివ్య కు తనకు ఆ బంగ్లాకి ఏదో లింక్ ఉందన్న ఫీలింగ్. నిన్నటిదాకా కలలు అని ఫ్రై చేసింది. ఇప్పుడేమో బంగ్లాతో అనుబంధం అంటోందని సదరు భర్తగారు కంగారు పడతాడు. అయితే సాధారణంగా అలాంటివి జరుగుతున్నప్పుడు ప్లేస్ మార్చేస్తారు కానీ మనవాడు అలాంటివేమీచేయడు.
ఇక ఆ సమస్యలు పెంచటానికా అన్నట్లు వాళ్ల అబ్బాయి మధు ఓ రోజున ఆ బంగ్లా దగ్గరకు వెళ్లి అక్కడ దొరికిన ఓ రింగ్ ని ఇంటికి తీసుకొస్తాడు. అక్కడ నుంచి కథ మరో టర్న్ తీసుకుంటుంది. దివ్యకు మరింత ఆ బంగ్లాపై మరింత ఆసక్తిపెరుగుతుంది. దాంతో ఆ బంగ్లా వివరాలు సేకరించే పోగ్రాం పెట్టుకుంటుంది. ఆ క్రమంలో దివ్యకు వళరి దొరకడం, దాని కారణంగా ఆమె రోడ్డు ప్రమాదానికి గురై ..హాస్పటల్ లో చేరుతుంది. అక్కడ సైకాలజిస్ట్ డాక్టర్ 'రుద్ర' ( సుబ్బరాజు) ఆమెను దివ్యని ఆమె పేరుతో పిలవకుండా 'దర్శిని' అంటూ పిలుస్తూంటాడు. అసలే ప్రతీది వింతగా జరుగుతన్న దివ్యకి ఇది మరింత చిత్రంగా అనిపిస్తుంది.
ఇక్కడితో ఆగితే బాగుండును..ఆ పాడుబడిన బంగ్లా నవీన్ కు విశాలంగా అనిపించడంతో దానిని అద్దెకు కి తీసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఆ బంగ్లా యజమాని రామచంద్రయ్య (ఉత్తేజ్)ను కలిసి మాట్లాడి అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తాడు. దివ్యను హాస్పటిల్ నుంచి ఇంటికి రాగానే డైరక్ట్ గా ఆ బంగ్లాలోకి తీసుకెళ్లిపోతారు. ఆమె కూడా నో ..నేను రాను అనదు. తను వెళ్లకపోతే సినిమా కథ ఆగిపోతుంది అన్నట్లు గా సైలెంట్ గా ఆ ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఇలా మొత్తానికి బంగ్లా లోకి దివ్య ఎంట్రీ ఇచ్చింది. అక్కడ నుంచి ఆమెకు వచ్చే కలలకి సంభందించి, తనను దర్శిని అని పిలవటం గురించి..ఆ బంగ్లా గురించిన ముడి విడటం మొదలవుతుంది. అసలు ఆ బంగ్లాకు దివ్య కు సంభందం ఏమిటి...ఎందుకు ఆమె జీవితం ఆ బంగ్లాకు లాక్కురాబడింది. ఆమె భర్త పనిగట్టుకుని మరీ ఆ బంగ్లాలోకే ఎందుకు తీసుకొచ్చి ఆమెను పెట్టాడు...వంటి సమాధానాలు మనకు క్లైమాక్స్ వరకూ ఓపిగ్గా చూస్తే దొరుకుతాయి.
సినిమా ఎలా ఉంది అంటే...
హారర్ సినిమా అనగానే ఖచ్చితంగా భయపెట్టాలా.. దాన్ని బ్రేక్ చేద్దామనుకున్నట్లుంది ఈ దర్శకురాలు మ్రితికా సంతోషిణి. ‘వానం’ (వేదం తమిళ రీమేక్) సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆమె దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది(Valari).సినిమాలో ఏదో చెప్పాలని మొదలెట్టి వేరే ఏదో చెప్పి అర్జెంటుగా ముగించినట్లు ఉంటుంది. కథ సెటప్ లో ఓ పాత బంగ్లా..అందులో దెయ్యాలు ఉంటున్నాయనే ప్రచారం...కలలు,యాక్సిడెంట్స్, రివేంజ్ ఇలా హారర్ ఫిల్మ్ కు కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని సమకూర్చుకుంది. అయితే వీటిన్నటిని జనాలకు సందేశం చెప్పాలనే ఆత్రుత మింగేసింది.
టెక్నికల్ గా చూస్తే .. దర్శకురాలు కొన్ని సీన్స్ చాలా బాగా తీసింది. ముఖ్యంగా ప్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ . ఇక ఇందులో రితికా నటన హైలైట్ అనే చెప్పాలి. వర్తమానంలోను ... ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోను ఆమె చాలా బాగా చేసింది. మిగతా వాళ్లంతా కూడా తమ పాత్రలకు న్యాయం చేసుకుంటూ పోయారు. విష్ణు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సుజాత సిద్ధార్థ్ ఫొటోగ్రఫీ .. తమ్మిరాజు ఎడిటింగ్ కథకి తగినట్టుగానే ఉన్నాయి.
వళరి అంటే ఏమిటి..
'వళరి' అంటే పూర్వకాలంలో ఉపయోగించిన 'బూమరాంగ్'ను పోలిన ఒక ఆయుధం.ఎక్కువ తమిళనాడులో వాడేవారు. దాన్ని విసిరితే తన లక్ష్యాన్ని ఛేదించి, ప్రయోగించినవారి దగ్గరికి తిరిగొస్తుంది. అలాగే కర్మ కూడా తిరిగి తన దగ్గరకే చేరుతుందని దర్శకురాలు చెప్పే ఉద్దేశ్యం కావచ్చు. దెయ్యాల కథకీ .. ఈ ఆయుధానికి ముడిపెట్టింది కానీ అంతగా అతకలేదనే చెప్పాలి. ఈ సినిమాకి 'వళరి' అనే టైటిల్ ప్రధానమైన బలం. అదే మైనస్ కూడా.
చూడచ్చా...
భయపెట్టే ఘటనలు లేని హారర్ ఫిల్మ్ చూడాలంటే ఇంతకు మించిన ఆప్షన్ మీకైతే ఈ వీకెండ్ దొరకదు.
OTT: ఈటీవీ విన్
Next Story