కన్నడ నటుడు దర్శన్‌పై రౌడీ షీట్ ?
x

కన్నడ నటుడు దర్శన్‌పై రౌడీ షీట్ ?

రేణుకాస్వామి మర్డర్ కేసును లోతుగా విచారిస్తున్న పోలీసులు దర్శన్‌పై రౌడీ‌షీట్ ఓపెన్ చేస్తారా? ఆయన అభిమాన సంఘాలపై కూడా దృష్టి సారించడానికి కారణమేంటి?


రేణుకాస్వామి మర్డర్ కేసులో పోలీసులు ప్రస్తుతం కన్నడ నటుడు దర్శన్ అభిమాన సంఘాలపై దృష్టి సారించారు. హత్యకు వారు సహకరించారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

దర్శన్ క్లబ్ కీలక సభ్యుడు, సహచరులు రేణుకస్వామిని అతని స్వస్థలం చిత్రదుర్గ నుంచి బెంగుళూరుకు తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టి హత్య చేశారని విచారణలో తెలిసింది.

అభిమానులపై అనుమానం..

“రేణుకాస్వామి హత్య కేసు తర్వాత అభిమాన సంఘాల నాయకులను అనుమానించాల్సి వస్తుంది. చిత్రదుర్గ దర్శన్ అభిమానుల సంఘం కన్వీనర్ రాఘవేంద్ర అలియాస్ రఘు, ఆయన సహచరులు రేణుక స్వామి అపహరణలో కీలక పాత్ర పోషించారు. దీంతో అభిమాన సంఘాల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు, సంఘ విద్రోహా శక్తులతో దర్శన్ ఫాన్స్ జత కడుతున్నారా? అనే అనుమానం కలుగుతోంది.’’ అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

తన సినిమాలు విడుదలైనప్పుడల్లా బాక్సాఫీస్ వద్ద అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు దర్శన్, చిత్ర నిర్మాతలు, దర్శకులు, ఫైనాన్షియర్‌లు అభిమానుల సంఘాలకు భారీగా డబ్బులు చెల్లించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

దర్శన్ సినిమాల ద్వారా వచ్చే ఆదాయంలో లాభదాయక వాటా పొందడానికి అభిమానుల సంఘాలు ప్రయత్నిస్తాయని, తరచుగా వివిధ జిల్లాల్లో ఈ సంఘాల మధ్య పోటీ కూడా ఉంటుందని.. ప్రత్యర్థి నటుడి మూవీ, దర్శన్ సినిమా ఒకేసారి విడుదలైనప్పుడు.. దర్శన్ క్లబ్ సభ్యులు ప్రత్యర్థి నటుడి ఫ్యాన్స్‌తో గొడవపడడం కూడా తెలుసుకున్నామని పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

దర్శన్‌కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని కొంతమంది రౌడీలతో పరిచయాలు ఉన్నందున అతనిపై రౌడీషీట్ తెరవాలన్న ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.

రేణుకాస్వామిని ఎందుకు హత్య చేశారు?

దర్శన్‌‌కు దాదాపు 20 ఏళ్ల క్రితమే విజయలక్ష్మితో పెళైంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. మోడల్‌, బుల్లితెర, సినీ నటి అయిన పవిత్ర గౌడతో దర్శన్‌ కొన్నేళ్లుగా కలిసి ఉంటున్నారు. ఈ సంబంధం వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందన్న బాధతో చిత్రదుర్గ జిల్లా కేంద్రానికి చెందిన రేణుకాస్వామి అనే యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పవిత్రను లక్ష్యంగా చేసుకుని ఆమెకు అశ్లీల సందేశాల పంపాడు. దర్శన్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించినట్లు పోలీసులు గుర్తించారు. అదే అతడి హత్యకు దారితీసింది. 33 ఏళ్ల రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో ఛాలెంజింగ్ స్టార్‌గా పేరుతెచ్చుకున్న దర్శన్‌, పవిత్ర గౌడ, ఆయన సహచరులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. సాక్ష్యాలు, ఆధారాల కోసం కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Read More
Next Story